వెంకట్రామరెడ్డి జగన్ భక్తికి ఫలితం దక్కుతోందిగా?
posted on Aug 22, 2024 @ 9:54AM
వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారుల తీరు హద్దులు దాటిపోయింది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తల్లా వ్యవహరించారు. తమ స్వలాభం కోసం ప్రభుత్వ పెద్దల ప్రసన్నంకోసం కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎంతకైనా తెగించేశారు. పాతాళానికి దిగజారిపోయారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ మోహన్ రెడ్డిని పొగిడేందుకే మనం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్నట్లుగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించారు. వారి తీరుపట్ల ఉద్యోగులే కాదు ప్రజలు కూడా విస్తుపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నామన్న సోయి మరిచి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కార్యకర్తలా వ్యవహరించిన వారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ముందువరుసలో ఉన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి 2022 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వద్దకు, ప్రభుత్వ పెద్దల వద్దకు ఉద్యోగుల సమస్యలను తీసుకెళ్లి వాటి పరిష్కారంకోసం కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు.
2014-19 మధ్య కాలంలో కూడా వెంకట్రామరెడ్డి జగన్ భక్త ఆంజనేయుడిగానే వ్యవహరించారు. జగన్ కు మద్దతుగా నిలవడం కోసం తన ఉద్యోగ ధర్మాన్ని కూడా ఉల్లంఘించారు. అప్పట్లో రహస్య పత్రాలను వైసీపీకి అందచేసి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎలాగోలా మళ్లీ ఉద్యోగంలో చేరినా ఆయన తీరు మారలేదు. జగన్ రాజకీయ ప్రవేశం చేసిన క్షణం నుంచీ ఆయన ప్రభుత్వోద్యోగిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా పని చేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జగన్ భక్తి ఉన్మాద స్థాయికి చేరింది. మరింతగా చెలరేగిపోయారు.
అయితే జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు తన గత పాపాలు, తప్పులకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైంది. వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగ నేతగా ఎన్నడూ పని చేసిన పాపాన పోలేదు. జగన్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా పదవి కూడా వచ్చింది. అయితే ఆయన తన సేవలన్నీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా, జగన్ కు ఊడిగం చేయడం కోసమే వినియోగించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.
చివరాఖరికి ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పని చేయడంతో ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించి సస్పెన్షన్ వేటు వేసింది. సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ిచన తరువాత ఆయనపై అభియోగాలు ఖరారు చేసి వివరణ ఇచ్చుకోవడానికి పక్షం రోజులు గడువు ఇస్తూ నోటీసు ఇచ్చింది. ఆ విరణ తరువాత ఆయనపై చర్యలు తప్పవు. వెంకట్రామిరెడ్డిపై అభియోగాల తీవ్రతను బట్టి ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. అది వాస్తవం కూడా.. ప్రభుత్వోద్యోగిగా, సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఆయన చేసిన తప్పిదాలు, జగన్ భక్త ఉన్మాదంతో వ్యవహరించిన తీరు పరిగణనలోనికి తీసుకుంటే వెంకట్రామరెడ్డి డిస్మిస్ అవ్వడం ఖాయమని ఉద్యోగులే అంటున్నారు. జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆయన ఉద్యోగులను నానా బాధలకూ గురి చేశారనీ, జగన్ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలను సమర్ధించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.