పోలవరానికి కేంద్రం 2800 కోట్ల వరం!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2800 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఏ పద్దు కింద ఈ నిధులు విడుదలయ్యాయన్న స్పష్టమైన సమాచారం లేదు. అయితే ప్రాజెక్టు అధికారులు మాత్రం పాత  పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద రూ. 800 కోట్లు, పనులు చేపట్టేందుకు  అడ్వాన్సుగా రూ. 2000 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ హయాంలో ఐదేళ్లుగా అతీగతీ లేనట్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత పరుగులు తీస్తున్నాయి. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది.  

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డే కారణమా?

జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల జడివాన కురిపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్.. ఏడేళ్ల పసిపాప హత్య ఉదంతాన్ని కూడా కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించడానికి వాడుకోవడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి పుంగనూరు పర్యటనకు రెడీ అయిపోయారు. అయితే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకునేలా చేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  ఏడేళ్ల చిన్నారి అస్పియా గత నెల 29న అదృశ్యమైంది. ఆ తరువాత ఆమె మృతదేహం ఒక సమ్మర్  స్టోరేజ్ ట్యాంక్ లో లభ్యమైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందంటూ గగ్గోలు పెట్టింది.  అయితే ఈ సంఘటనపై వేగంగా స్పందించిన పోలీసు యంత్రాంగం ఇద్దరు అనుమా నితులను అరెస్టు చేసింది. ప్రభుత్వం కూడా బాలిక తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా బాలిక హత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని తేలింది. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపార లావాదేవీలలో ఉన్న గొడవల కారణంగా ఆయనపై కక్ష పెంచుకున్న వారు బాలికను హత్య చేశారని వెల్లడైంది. ఈ లోగానే మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే  వైసీపీ నేతలు బాలిక పేరు, వివరాలు వెల్లడించారు. సున్నితమైన ఇటువంటి విషయాలలో బాధితురాలి పేరు వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఉల్లంఘించారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకుండా పోలీసులు మాత్రం బాలిక హత్య కేసు ఛేదించే విషయంలో ముందుకు సాగారు. అయితే వీటిని వేటినీ పట్టించుకోకుండా ఒక శవం దొరికింది.. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చెండాడేయవచ్చు అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుంగనూరు పర్యటనకు సిద్ధమైపోయారు.  బుధవారం (అక్టోబర్ 9) న ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ లోగానే చిన్నారి హత్య కేసులో రాజకీయ లబ్ధి సాధ్యంకాదన్న విషయం తేలిపోయింది. పైపెచ్చు ఈ సమయంలో జగన్ పుంగనూరులో పర్యటిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తధ్యమని భావించిన పెద్దిరెడ్డి జగన్ ను పర్యటన రద్దు చేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పటికే పుంగనూరులో పెద్దరెడ్డి ఆయన కుమారుడి పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బాలిక హత్య కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించడం, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి స్పష్టమైన భరోసా లభించడంతో జగన్ పర్యటన వల్ల ప్రయోజనం ఉండదని నిర్దారించుకున్నా పెద్దిరెడ్డి జగన్ పర్యటనకు  రాకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీ.. బిజీ!

విభజన హామీల్లో ప్రధాన అంశమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ఓకే చెప్పింది. డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీయే కూటమి ఎంపీలతో చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో వున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు వెంటనే ప్రధానిని కలిశారు. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చంద్రబాబు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన వికసిత భారత్- 2047 విజన్‌కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఆంధ్రా-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని చంద్రబాబు ప్రధానితో చెప్పారు. స్వాతంత్ర్య శత వసంతోత్సవం నిర్వహించుకునే 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రధానికి  చంద్రబాబు వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను  ఆంధ్రప్రదేశ్లో మరింత మందికి విస్తరించేందుకు వీలుగా చేయూతనందించాలని విజ్ఞప్తి  చేశారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించే విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు ఏపీ సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రధానమంత్రితో సమావేశం విజయవంతమైందని ఆ తర్వాత చంద్రబాబు 'ఎక్స్'లో వెల్లడించారు. 'పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపాను' అని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రైల్వే మంత్రితో చంద్రబాబు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఐటీ, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు పైనా చర్చించారు జరిపారు. రైల్వే మౌలిక వసతుల విషయంలోనూ చంద్రబాబు అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు. "వాల్తేర్ డివిజన్ ను యథావిధిగా ఉంచుతూనే విభజన చట్టంలో చెప్పిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు.  మంగళవారం కేంద్ర మంత్రులు అమిత్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీలను చంద్రబాబు కలవనున్నారు. వరద సాయం, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి చర్చించనున్నారు.

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ ? 

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు రీ సర్వే చేసే పనిలో ఉన్నాయి.  ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి వెంటనే రీ సర్వే చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ రీసర్వే తర్వాత ప్రత్యేక వెబ్ సైట్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళ్లడంతో ఇటీవల హైకోర్టు అక్షింతలు పెట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాతే  కూల్చివేతల స్పీడ్ తగ్గింది. మూసీ పరివాహక ప్రాంతంలో నోటీసులిచ్చిన వారికి సామరస్యపూర్వకంగా అధికారులు ఖాళీ చేయించారు. వారిని  సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతే కాదు ఆర్థిక సహకారం  కూడా అందించింది. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ ప్రతి పక్ష పార్టీల నుంచి ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో రీ సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రీ సర్వే వివరాలను వెబ్ సైట్ లో పెట్టిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది

ఫిరోజ్ ఖాన్ పై దాడి  

హైదరాబాద్ పాతబస్తీ ఆసిఫ్ నగర్ లో టెన్షన్ నెలకొంది.  ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన  కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్  వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. సీసీ రోడ్త పరిశీలనకు వెళ్లిన ఫిరోజ్ ఖాన్ ను మాజిద్  వర్గీయులు అడ్డుకున్నారు.   మాటామాటా పెరగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య  టెన్షన్ వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ అధికారంలో కోల్పోయాక కాంగ్రెస్ కు దగ్గరైన మజ్లిస్ పార్టికి  ఫిరోజ్ ఖాన్ కొరకరాని కొయ్యగా మారారు. తాజా ఘటన మజ్లిస్ , కాంగ్రెస్ సంబంధాలు బెడిసికొట్టినట్టేనని రుజువయ్యాయి. ఇరు వర్గాలను పోలీసులు సముదాయించి పంపించినప్పటికీ  అసిఫ్ నగర్ లో నివురు గప్పిన నిప్పు మాదిరిగా  తయారయ్యింది. రాత్రి వరకు ఘర్షణలు తలెత్త వచ్చని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. అయితే ఇటు ఎమ్మెల్యే మాజిద్ గాని అటు ఫిరోజ్ ఖాన్ గానీ పోలీసులకు  ఫిర్యాదు చేయకపోవడం కొసమెరుపు. ఫిరోజ్ ఖాన్ పై గతంలో అనేక సార్లు మజ్లిస్ కార్యకర్తలు  దాడులు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాడి జరగడం చర్చనీయాంశమైంది

తెలంగాణలో తెలుగుదేశంలోకి వలసలు.. పూర్వవైభవం దిశగా పార్టీ అడుగులు!

తెలంగాణ రాజకీయాలలో ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచీ రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా పుంజుకుంటోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఈ ఏడాది  జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కానీ రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు పూర్వవైభవం దిశగా రాష్ట్రంలో పరుగులు పెడుతోంది.  ఇక తెలుగుదేశంలోకి వలస వస్తున్న వారంతా బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక దశలో  కాంగ్రెస్ లోకి వలసల వరద చూసి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని పరిశీలకులు సైతం భావించారు. కారణాలేమైతేనేం.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పది మంది ఎమ్మెల్యేలతోనే ఆగిపోయాయి. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్న కాంగ్రెస్ ఆశలకు గండి పడింది.  సరే కొంత విరామం తరువాత మళ్లీ బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సారి  బీఆర్ఎస్ నుంచి నేతలకు కాంగ్రెస్ లోకి కాకుండా తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడం గమనార్హం.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం తరువాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. వాస్తవానికి గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనే రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో అడుగులు వేసిన చంద్రబాబును.. ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అక్రమ కేసులో అరెస్టు చేసింది. దీంతో  తెలంగాణలో పార్టీ బలోపేతం అన్న లక్ష్యానికి తాత్కాలిక విరామం ప్రకటించిన చంద్రబాబు నాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి కూడా పార్టీని దూరంగా ఉంచారు. సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. అది వేరే సంగతి. ఇక ప్రస్తుతానికి వస్తే.. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై కూడా దృష్టి సారిం చారు. తరచుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలకు ఉపక్రమించారు. తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నెలలో ఒక సారి తెలంగాణలో పర్యటిస్తాననీ, పార్టీ క్యాడర్ కు హామీ ఇచ్చారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా తరచూ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు, సీనియర్లు తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధప డుతున్నారు. అటువంటి వారిలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిలు ముందు వరుసలో నిలిచారు. వీరు ముగ్గురూ సోమవారం (అక్టోబర్ 7) చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరిలో తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డిలు మాత్రం టీడీపీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించకపోయినా వారి చేరిక కూడా లాంఛనమే అంటున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారే. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోనూ, చంద్రబాబుతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరి చేరిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేం ఏ మేరకు బలోపేతం అయితే ఆ మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడటం ఖాయమని అంటున్నారు. తెలుగుదేశంలోకి బీఆర్ఎస్ నుంచి వలసల జోరు రానున్న రోజులలో మరింత ఎక్కువ అయ్యే అవకాశాలే  ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

నేడు ఢిల్లీకి చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు   వామపక్ష ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం  సాయంత్రం నాలుగున్నర గంటలకు   ప్రధాని మోదీతో సమావేశం అవుతారు.అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ భేటీ అవుతారు. ఇక రేపు  హోంమంత్రి అమిత్ షా, మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్  తో చంద్రబాబు భేటీ అవుతారు.  ఈరోజు రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. చంద్రబాబు  రేపు (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర మంత్రి  పియూష్ గోయల్, 5.30 గంటలకు హర్ దీప్ సింగ్ పూరిలతో భేటీ అవుతారు. మంగళవారం రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అవుతారు.

మరో హామీ నెరవేర్చిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలసిందే. ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన పలు వాగ్దానాలు చేశారు. సరే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన లోకేష్ తాజాగా మరో వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.  పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యప్తంగా ఉన్న చిన్న దేవాలయాలలో ధూప, దీప నైవేద్యాలకు ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు చేస్తుందని లోకేష్ వాగ్దానం చేశారు. ఇప్పుడా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్ంగా ఉన్న దాదాపు 5400 చిన్న ఆలయాలకు లబ్ధి చేకూరే విధంగా ధూప,దీప, నైవేద్యాలకు ఇచ్చి ప్రభుత్వ సాయాన్ని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్విట్లర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నారా లోకేష్  తన పాదయాత్ర సందర్భంగా చిన్న ఆలయాల్లో దూప, దీప, నైవేద్యాలు నిర్వహించడం కష్టంగా ఉందన్న విషయాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గం తన దృష్టికి తీసుకువచ్చిందన్నారు.  అన్ని వర్గాల సంక్షేమం తమ బాధ్యత అని అప్పట్లో వారికి చెప్పి.. అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చానని, ఇప్పటి వరకూ  ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5000లుగా ఉన్న ప్రభుత్వ సాయాన్ని పది వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు.