తెలంగాణలో తెలుగుదేశంలోకి వలసలు.. పూర్వవైభవం దిశగా పార్టీ అడుగులు!
posted on Oct 7, 2024 @ 2:51PM
తెలంగాణ రాజకీయాలలో ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచీ రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా పుంజుకుంటోంది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కానీ రాష్ట్రంలో పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు పూర్వవైభవం దిశగా రాష్ట్రంలో పరుగులు పెడుతోంది.
ఇక తెలుగుదేశంలోకి వలస వస్తున్న వారంతా బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఒక దశలో కాంగ్రెస్ లోకి వలసల వరద చూసి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని పరిశీలకులు సైతం భావించారు. కారణాలేమైతేనేం.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పది మంది ఎమ్మెల్యేలతోనే ఆగిపోయాయి. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్న కాంగ్రెస్ ఆశలకు గండి పడింది.
సరే కొంత విరామం తరువాత మళ్లీ బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సారి బీఆర్ఎస్ నుంచి నేతలకు కాంగ్రెస్ లోకి కాకుండా తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం తరువాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. వాస్తవానికి గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనే రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో అడుగులు వేసిన చంద్రబాబును.. ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అక్రమ కేసులో అరెస్టు చేసింది. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతం అన్న లక్ష్యానికి తాత్కాలిక విరామం ప్రకటించిన చంద్రబాబు నాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి కూడా పార్టీని దూరంగా ఉంచారు.
సరే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. అది వేరే సంగతి. ఇక ప్రస్తుతానికి వస్తే.. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై కూడా దృష్టి సారిం చారు. తరచుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలకు ఉపక్రమించారు. తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నెలలో ఒక సారి తెలంగాణలో పర్యటిస్తాననీ, పార్టీ క్యాడర్ కు హామీ ఇచ్చారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా తరచూ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు, సీనియర్లు తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధప డుతున్నారు. అటువంటి వారిలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిలు ముందు వరుసలో నిలిచారు. వీరు ముగ్గురూ సోమవారం (అక్టోబర్ 7) చంద్రబాబుతో భేటీ అయ్యారు. వీరిలో తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు.
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డిలు మాత్రం టీడీపీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించకపోయినా వారి చేరిక కూడా లాంఛనమే అంటున్నారు. ఎందుకంటే ఈ ముగ్గురూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారే. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోనూ, చంద్రబాబుతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరి చేరిక తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేం ఏ మేరకు బలోపేతం అయితే ఆ మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడటం ఖాయమని అంటున్నారు. తెలుగుదేశంలోకి బీఆర్ఎస్ నుంచి వలసల జోరు రానున్న రోజులలో మరింత ఎక్కువ అయ్యే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.