మంగళగిరి నుంచి స్కిల్ సెన్సెస్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చేసిన తొలి ఐదు సంతకాలలో స్కిల్ సెన్సెస్ ఒకటి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తన మొదటి సంతకాన్ని మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్‍ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఈ నాలుగు హామీలూ అమలు అవుతున్నాయి. ఆయన ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై చేశారు. స్కిల్ సెన్సెస్ అన్నది అత్యంత కీలకమైనది. భవిష్యత్ లో ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని విద్యావంతులు, విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఇది అత్యంత కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు. అటువంటి కీలక స్కిల్ సెన్సెస్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆరంభం కానుంది.
ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ప్రపంచంలోని ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన ప్రముఖ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉండటంతో పాటు.. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది. స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు. ఆధార్ కార్డు ద్వారా ఇంట్లో ఎంత మంది చదువుకున్న యువత ఉన్నారు. వారు ఎంతవరకు చదువుకున్నారు. ప్రస్తుతం వారు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నట్లయితే ఏ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు. వారు ఏఏ కంపెనీలు, ఏఏ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నారు అనే వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల ద్వారా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నవారు ఎంత మంది ఉన్నారనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన వస్తుంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉంటున్న యువతకు వారికి ఆసక్తి ఉన్నరంగాల్లో శిక్షణ ఇస్తారు. దీని వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పాటుగా రాష్ట్రంలో మ్యాన్ పవర్ కోసం చూస్తారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను ఇక్కడకు తీసురావడం ఒకింత కష్టమైన పని. దీంతో ఐటీ, నాన్ ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి రాష్ట్రాలవైపు మొగ్గు చూపుతారు. స్కిల్ సెన్సెస్ ద్వారా కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్ రాష్ట్రంలోనే లభ్యమౌతుంది. దీంతో పెట్టుబడి దారులు ఏపీవైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి.
స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎలక్ట్రికల్ విభాగం వారు ఎంత మంది ఉన్నారు.. ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు ఎంత మంది ఉన్నారు.. ఇలా ఇతర రంగాల్లో ఏ విభాగంలో ఎంతమంది ఉన్నారు..? వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే విషయాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్రతినిధుల ముందు ఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహకారం అందించడంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటారని లెక్కలతో సహా వివరిస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఐదో సంతకం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించబోతున్నది. ఒక విధంగా చెప్పాలంటే.. బీసీ జన గణన కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంగళగిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధంచేశారు.
ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీమ్ లను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.