రైలు ప్రమాదం... ఆ 7 నిమిషాల్లో ఏం జరిగింది?
posted on Oct 14, 2024 @ 10:49AM
తమిళనాడులోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం నాడు జరిగిన భాగమతి ఎక్స్.ప్రెస్ రైలు ప్రమాదంలో కుట్ర కోణం దాగి వుందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది. ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? సిగ్నలింగ్ వైఫల్యం వల్ల జరిగిందా? కుట్ర కోణమా? ఇతర కారణాలు ఏవైనా వున్నాయా అనే అంశాల మీద ఎన్ఐఏ, రైల్వే భద్రతా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. భాగమతి ఎక్స్.ప్రెస్ ప్రధాన లైన్‌లో కాకుండా లూప్ లైన్లోకి వెళ్ళి గూడ్స్.ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు బోగీలు కాలిపోయాయి. మొత్తం పన్నెండు బోగీలు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంపై విచారణ నిమిత్తం రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. గత సంవత్సరం ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఈ ప్రమాదం కూడా జరగడంతో ఏదైనా కుట్రకోణం వుందా అనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో రికార్డ్ అయిన డేటా లాగర్‌ని తీసుకుని, ప్రమాదానికి ముందు ఏం జరిగిందో పరిశీలించారు. భాగమతి ఎక్స్.ప్రెస్‌కి ముందు మరో ట్రైన్ అదే మార్గంలో వెళ్లింది. అయితే ఆ ట్రైన్ లూప్ లైన్‌లోకి వెళ్ళలేదు. ఆ ట్రైన్‌కి, ఈ ట్రైన్‌కి మధ్య ఏడు నిమిషాల వ్యవధి వుంది. ఈ ఏడు నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు వున్నాయి.
రైలు ట్రాక్ మారడానికి వాడే సిగ్నలింగ్ గేర్, స్విచ్ పాయింట్‌ని ట్యాంపర్ చేసినట్టు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. కవరైపేట్టై స్టేషన్‌కి సమీపంలోనే వున్న పొన్నేరి రైల్వే స్టేషన్లో ఇటీవల పట్టాల ఇంటర్ లాకింగ్ వ్యవస్థను టాంపరింగ్ చేసినట్టు బయటపడటం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పట్టాలకు సంబంధించిన బోల్టులు, నట్లు మాయమైనట్టు గుర్తించారు.