మల్లారెడ్డి మాస్ డ్యాన్స్.. స్టెప్పులతో ఇరగదీశారు!
posted on Oct 21, 2024 @ 2:21PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మామూలోడు కాదు. ఆయన రాజకీయ నాయకుడే .. వ్యాపారవేత్త, ప్రముఖ విద్యాసంస్థల అధినేత కూడా. ఆయన ఏం మాట్లాడినా? ఏం చేసినా సంంచలనమే అవుతుంది. పూలమ్మినా, కట్టెలమ్మినా, పాలమ్మినా అంటూ ఆయన మాస్ డైలాగులతో చాలా చాలా పాపులర్ అయ్యారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన డైలాగుల్లో పంచ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ కారణంగానే ఆయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పరిస్థితి.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి సభలు, సమావేశాలు, ప్రసంగాలకు మంచి స్పందన లభించింది. ‘ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా’ అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అటువంటి మల్లారెడ్డి తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆయన డ్యాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఈవెంట్ వేదికగానే మల్లారెడ్డి తన మాస్ స్టెప్పులతో చెలరేగిపోయారు. ఏడు పదుల వయస్సులోకూడా ఆయన కుర్రాళ్లతో సమానంగా మాస్ స్టెప్పులు వేసి అలరించారు. గతంలో పలు ఈవెంట్లలో మల్లారెడ్డి చేసిన డ్యాన్సులు ఒకెత్తు, ఈ సారి డ్యాన్సు స్టెప్పులు మరో ఎత్తు అన్నట్లుగా ఆయన డ్యాన్స్ ఉంది. సంగీత్ లో మాస్ స్టెప్పులు వేయడం కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి మనవరాలి పెళ్లి సంగీత్ లో మల్లారెడ్డి స్టెప్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీగా మారిపోయాయి.