జగన్ హయాంలో గుంతల మయం.. ఇప్పడు అద్దంలా మెరుస్తున్న వైనం!
posted on Feb 17, 2025 9:17AM
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు. ప్రజల గుంతల రోడ్లపై ప్రయాణించలేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకోలేదు. ఉచితాలు పందేరం చేస్తున్నా.. నన్ను కాక ఇంకెవరిని ఎన్నుకుంటారు అన్నట్లుగా వ్యవహరించారు. అయితే కేవలం బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడం ఒక్కటే పాలన అని ప్రజలు భావించలేదు. ఐదేళ్ల పాటు తమకు నరకాన్ని చూపించిన జగన్ కు గత ఏడాది జరిగిన ఎన్నికలలో గుణపాఠం చెప్పారు. జగన్ బాబూ మీకు పాలన చాతకాదు.. ఇక ఇంటికి దయచేయడం అని ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని అసెంబ్లీలో కేవలం 11 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ కు ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ప్రజల సైతం గట్టి షాక్ ఇచ్చారు. సొంత జిల్లా కడపలో మెజారిటీ సీట్లలో ఓడించిన జనం.. పులివెందులలో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడుతూనే రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. నిర్దిష్ట సమయంలో రోడ్లపై గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు అద్దాల్లా తయారయ్యాయి. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క గుంత కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ హయాంలో రోడ్లపై ప్రయాణం అంటే నరకంలా ఉందనీ, ఇప్పుడు స్వర్గంలా మారిందని అంటున్నారు. ఇదే విషయాన్ని నెటిజనులు కూడా సాక్ష్యాలుగా అప్పటి ఫొటోలు, ఇప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ జగన్ పాలన నరకం, బాబు పాలన స్వర్గం అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా గుంటూరులోని ఆగ్రహారం రోడ్లుకు సంబంధించి జగన్ పాలనలో ఆ రహదారి దుస్థితిని, ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న పరిస్థితిని తెలియజేసేలా ఫొటోలు పోస్టు చేశారు. ఆ ఫొటోలు వెంటనే తెగ వైరల్ అయ్యాయి. జనం.. చంద్రబాబు సమర్ధతను, ప్రజల ప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.
ఇదే అగ్రహారం రోడ్డు జగన్ హయాంలో గుంతలతో నిండి, వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ ను తలపించేలా ఉండేది. అప్పట్లో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవించేవి. పలువురు మరణించగా, మరింత మంది ఆస్పత్రుల పాలయ్యారు. అదే రోడ్డు ఇప్పుడు గుంతలనేవి లేకుండా, రోడ్డు మధ్య డివైడర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మారిపోయింది. జనం ఈ రోడ్డు పై ప్రయాణిస్తూ నిత్యం జగన్ పాలనలో ఈ రోడ్డు పై ప్రయాణం అంటే నరకయాతనగా ఉందని, ఇప్పుడెంతో హాయిగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.