ఏపీలో స్కూలు పిల్లలకు విజ్ణాన విహార యాత్రలు!
posted on Feb 17, 2025 @ 9:35AM
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విజ్ణాన విహార యాత్రలను పంపాలని నిర్ణయించింది. మనోవికాసం, స్కిల్ డెవలప్ మెంట్, సాంకేతిక అంశాలపై ఆసక్తి పెంపొందించడం కోసం ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులను విజ్ణాన, విహార యాత్రలకు పంపాలన్న నిర్ణయం తీసుకుంది.
ఈ విజ్ణాన విహార యాత్రలు రాష్ట్రానికే పరిమితం కాదు, ఇతర రాష్ట్రాలలకు కూడా పంపి వారిలో ఉత్సాహాన్ని, ఉత్సుకతను పెంచాలని భావిస్తోంది. ఇందు కోసం అవసరమైన బడ్జెట్ ను కూడా కేటాయించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7, 784 మంది విద్యార్థులను విజ్ణాన, విహార యాత్రలకు తీసుకువెళ్ల నుంది. రాష్ట్ర పరిధిలో అయితే ఈ యాత్ర కోసం ఒక్కో విద్యార్థికి 200 రూపాయలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఖర్చు చేయనుంది. ఇందు కోసం విజ్ఞాన విహార యాత్రలకు సంబంధించి నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఎస్కార్టు ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ఇప్పటికే ఇంటర్మీడియేట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థులలో పరిశీలన, పఠనాశక్తి పెంచేందుకు విజ్ణాన విహార యాత్రలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులలో మనో వికాసానికీ, నైపుణ్యాభివృద్ధికీ ఈ యాత్రలు ఎంతగానో దోహదం చేస్తాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.