విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్!
posted on Apr 27, 2020 @ 10:18AM
కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 27,892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 872 మంది కరోనాతో మరణించారు. ఇక 6,185 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 19,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అలాగే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 3 సార్లు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈసారి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారా అని దేశమంతా ఎదురు చూస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం ఏపీలో రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారించారు అధికారులు. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా నిర్దారణ జరిగింది. దీనితో అప్రమత్తమైన అధికార యంత్రాంగం గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించింది. విజయవాడలో ఆదివారం మొత్తం సుమారు 30 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. దేశంలో కరోనా కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన 9వ రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దాదాపు 30 లక్షల మందికి సోకింది. ఇక అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. మొత్తం మరణాల సంఖ్య 206894కి చేరింది. ప్రతీ రోజు కూడా 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.