చేతులెత్తేసిన జగన్ సర్కార్!
posted on Apr 28, 2020 @ 5:12PM
'జ్వరం వస్తుంది. అంతే. మందులేసుకుంటే పోతుంది!... అంటూ కరోనా వైరస్ గురించి ముఖ్యమంత్రి జగన్ చాలా లైట్‌గా చెబుతున్నారు. కరోనా వైరస్‌ని అరికట్టలేం.. ఓ ఏడాదిపాటు ఆ కరోనా వైరస్ మనతోనే వుంటుంది తప్పదు.. అని ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తెలంగాణను దాటేసింది. తమిళనాడుని దాటేయడానికి శరవేగంగా పరుగులు పెడ్తోంది. దేశంలో ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ కేసుల పరంగా నెంబర్ వన్ పొజిషన్‌లో మహారాష్ట్ర వుంది. రికార్డుల కోసం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పోటీ పడాలనుకుంటోందా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ డెడ్లీ వైరస్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు చూస్తోంటే, పూర్తిగా ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తోంది. ఓ పక్క మేం సాధించేశాం.. మేం సమర్థవంతంగా పనిచేస్తున్నాం.. మేం వైరస్‌ని ఎదుర్కొంటున్నాం అని చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్ సోకింది.. అదీ ఆ యువకుడి ద్వారానే. మరి, కరోనా వైరస్ పరీక్షలతో నూటికి నూరు శాతం 'వాస్తవాలు' బయటకు వస్తున్నాయని ఎలా అనుకోగలం.?
సాధారణ జ్వరం పెద్ద సమస్య కానే కాదు.. మరి అలాంటప్పుడు, రోజూ వేల కొద్దీ కరోనా వైరస్ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నట్లు.? కరోనా వైరస్ పరీక్షల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటూ 'సెల్ఫ్ డబ్బా' కొట్టుకోవడమెందుకు.? పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నందుకు సంతోషించాల్సిందే. కానీ, 'ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం.. ఆ పరీక్షలతో పోల్చితే నమోదువుతన్న కేసుల సంఖ్య తక్కువే..' అని ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా చెబుతారు.?
కరోనా వైరస్ సాధారణ జ్వరం కాదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ అన్న విషయం ముఖ్యమంత్రికి మాత్రం అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఇది మొదటి సారి కాదు. మొదటి నుంచీ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కరోనా వైరస్ విషయంలో ఒకే మాట మీద వున్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇచ్చే సూచనల్ని స్వీకరిస్తే కనీసం తన 'అనుభవ రాహిత్యం' కొంత మేర మరుగున పడ్తుందన్న విజ్ఞత కూడా జగన్‌కు లేకపోవడం ఆశ్చర్యకరం. విపక్షాల్ని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వెచ్చిస్తే కొంతైనా రాష్ట్ర ప్రజలకూ మేలు జరుగుతుంది.