శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు
posted on Apr 28, 2020 @ 1:30PM
- అద్భుతమైన జ్ఞానమూర్తి ఆదిశంకరులన్న స్వరూపానంద
- ట్విట్టర్ ద్వారా స్వాత్మానంద సందేశం
విశాఖ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో సాగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో నిర్వహించారు. వేకువ జామున గణపతి పూజతో శంకర జయంత్యుత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలుత కలశారాధన, మండపారాధన చేశారు. ఆ తర్వాత శంకరాచార్యుని దివ్య ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పూలతో విశేష అర్చన చేశారు. లోక కల్యాణార్ధం శాంతి హోమాన్ని నిర్వహించారు. శంకర జయంతి వేడుకలను రోజంతా నిర్వహించేందుకు వీలుగా పీఠం ప్రతినిధులు ఏర్పాట్లు చేసారు. పీఠంలో పనిచేసే అతి కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఈ జయంత్యుత్సవాలకు హాజరయ్యారు.
విజ్ఞాన రాశుల్ని అందించిన జ్ఞాన మూర్తి ఆదిశంకరులు
సర్వ మానవాళికి విజ్ఞాన రాశులను అందించిన అద్భుతమైన జ్ఞాన మూర్తిగా ఆదిశంకరాచార్యుడిని అభివర్ణించారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. ఆది శంకరులు బోధించిన అద్వైత జ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి మానవాళి ప్రయత్నిస్తుండటం శుభ పరిణామం అన్నారు. భగవదారాధన గురించి ఆదిశంకరులు కన్నా గొప్పగా బోధించిన వారు మరొకరు లేరన్నారు. మానవులంతా శంకరాచార్యుడిని నిత్యం స్మరించుకునే రోజు రావాలన్నదే తన ఆశయంగా చెప్పుకొచ్చారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర.
ట్విట్టర్ ద్వారా సంస్కృతంలో సందేశం
పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర శంకర జయంతి సందేశాన్ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందేశం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది. మన ఆత్మనే పరబ్రహ్మ స్వరూపంగా భావించాలని శంకరాచార్యులు ప్రబోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. కరోనా గండం నుంచి గట్టెక్కడానికి పూర్వీకుల విధానాలను పాటించాలని, ప్రభుత్వ నియమాలను అనుసరించాలని సూచించారు స్వామి స్వాత్మానందేంద్ర
మూడు రోజులుగా భాష్య పారాయణ
శంకర జయంతిని పురస్కరించుకుని మూడు రోజులుగా పీఠం ప్రాంగణంలో భాష్య పారాయణ నిర్వహించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు శంకరాచార్యులు ప్రత్యేకంగా భాష్యం చెప్పారు. దీనినే ప్రస్థాన త్రయం, శంకర భాష్యం అని కూడా అంటారు. జగద్గురువు జయంతి సందర్భంగా పీఠంలో శంకర భాష్య పారాయణ చేసారు. ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర స్వయంగా ఈ పారాయణలో పాల్గొన్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పారాయణ చేపట్టినట్లు స్వామి స్వాత్మానందేంద్ర తెలిపారు.