వైన్స్ షాపుల ఎదుట భారీ క్యూ! పండగచేసుకున్న మందుబాబులు!
posted on May 4, 2020 @ 3:40PM
మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. వైన్స్ షాపుల ఎదుట క్యూ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాంతాండత క్యూలో నిలబడడం కనిపించింది. కిలోమీటర్ల మేర జనాలు నిలబడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మద్యం కోసం జనాలు బారులు తీరడంతో లిక్కర్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు అందరూ మద్యం షాపులకు క్యూ కట్టారు. దేవుడా..ఒకే ఒక్క క్వార్టర్ వచ్చే విధంగా చూడు.. తన వంతు వచ్చే వరకు స్టాక్ ఉండాలి దేవుడా.. అంటూ మందుబాబులు..క్యూ లైన్ లో వేచి చూస్తూ దేవుడిని ప్రార్థించుకున్నారు.
పెద్ద సంఖ్యలో బాటిళ్లు కొనుగోలు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే జనాలు బారులు తీరి కనిపించడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం నిబంధనను సైతం మందుబాబులు గాలికి వదిలేశారు. దీంతో మద్యం దుకాణాల యజమానులు షాపుల బయట సర్కిల్స్ గీసి నిలబెట్టారు. కాగా మద్యం షాపుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
బెంగుళూరులో మహిళలు కూడా లైన్‌లో నిలబడ్డారు. విశాఖ, సిరిపురం, చిత్తూర్, నెల్లూరు, దుగ్గిరాల, పెద్దపాలెం దృశ్యాలు
సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తమకు పండుగ రోజు అంటూ కొంతమంది మందుబాబులు వెల్లడిస్తున్నారు. పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటారో..అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండడం కనిపించింది. కొంతమంది గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్, పెద్ద పెద్ద టవల్స్, మాస్క్ లు ధరించి క్యూలో నిలబడ్డారు.
ఎంతో నిరీక్షణతో ఎదురుచూస్తున్న మందుబాబులకు ప్రాణం లేచి వచ్చినంత పనయ్యింది. ఇక మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఎప్పుడెప్పుడు మద్యం కొనుగోలు చేసి తాగుదామా అన్నట్లుగా నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు మందు షాపుల వద్ద. కానీ కొన్ని చోట్ల మాత్రం మందుబాబుల ఆశలపై నీళ్లు చల్లారు మహిళలు. మద్యం షాపులను తెరవద్దు అంటూ ఆందోళనకు దిగారు. నగరంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద సోమవారం మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు.
విజయవాడ నగరంలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు తెరువనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచి మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. అయితే విజయవాడ రెడ్‌జోన్ కావడంతో మద్యం షాపులు తెరవవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో సూపర్ వైజర్లు మద్యం షాపులను మూసివేసి సీల్ వేసి వెళ్లిపోయారు.