తెలంగాణలోనూ మద్యం అమ్మకాలకు సర్కార్ ఓకే!
posted on May 5, 2020 @ 11:50AM
కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే, కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. తెలంగాణలో త్వరలోనే మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.
మద్యం తాగేందుకు ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, దీని ద్వారా అక్కడ నుంచి రాష్ట్రంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ కారణాలరీత్యా రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు పునరుద్ధరించడం అనివార్యంగా మారిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఈ నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో మద్యం విక్రయాలు మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన స్టాకు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.
కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతో పాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై రాష్ట్రమంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మే 21 వరకు మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు లాంఛనమే కాగా, కొత్తగా ప్రకటించనున్న సడలింపుల విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు వేచి చూస్తారని తెలుస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తే లాక్డౌన్ను అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.