మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు..!!
posted on Aug 31, 2020 @ 7:48PM
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసుల ముందు లొంగిపోయారని తెలుస్తోంది. 70 ఏళ్లు దాటిన గణపతి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. ఆ కారణం చేతనే ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన గణపతి దాదాపు మూడు దశాబ్దాల పాటు నక్సల్ కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు కేంద్రకమిటీ కార్యదర్శిగా పనిచేసిన గణపతి.. 2018 చివరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. కాగా, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా జాతీయ పరిశోధన సంస్థ(ఎన్‌ఐఏ) ఆయనను ప్రకటించి, ఆయనను పట్టిచ్చిన వారికి 15 లక్షల రూపాయల రివార్డ్ ని ప్రకటించింది. మొత్తంగా ఆయనపై 36 లక్షల రివార్డ్ ఉండటం గమనార్హం.
వయోభారం, అనారోగ్యం కారణంగా కేంద్రకమిటీ కార్యదర్శి బాధ్యతల నుంచి 2018లో వైదొలిగిన గణపతి.. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ఇప్పటికే పలువురు నేతలు లొంగిపోవడం, మావోయిస్టు పార్టీ ప్రభావం కూడా రోజురోజుకి తగ్గిపోతుండం.. వంటి కారణాల చేత గణపతి లొంగిపోయారని సమాచారం. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీరని దెబ్బ అని, ఆయన బాటలోనే మరికొందరు నడిచే అవకాశముందని తెలుస్తోంది.