ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య. చావు కూడా విడదీయలేని ప్రేమ!
posted on Oct 25, 2020 @ 5:53PM
ప్రేమ ఎంత గొప్పదో చెప్పనవసం లేదు. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయి. ప్రేమ కోసం రాజ్యాలే కూలాయి. ప్రేమకు పేద, పెద్ద తేడా ఉండదు. ప్రేమలో పడిన వారికే దాని గొప్పతనం ఏంటో తెలుస్తుందని చెబుతుంటారు. అంతటి ప్రేమ గొప్పతనాన్ని చాటే ఘటన తాజాగా వెలుగు చూసింది. మరణం కూడా ప్రేమను విడదీయలేకపోయింది. భూపాలపల్లి జిల్లాలో జరిగిన విషాద ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది.
మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామానికి ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. మొదట స్నేహంతో ఏర్పడిన వారి పరిచయం గాఢ ప్రేమకు దారితీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమలో మునిగిపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది.
ప్రియురాలు చనిపోవడంతో ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు ప్రియుడు. మానసికంగా కుమిలిపోయాడు. తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు.. చివరకు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దసరా పండుగ రోజే ప్రియుడు ఉరి వేసుకుని చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు ప్రేమికుల మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు బంధువులు, సన్నిహితులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.