బోగస్ బ్యాలెట్ ఓట్లు! దుబ్బాకలో మరో రచ్చ
posted on Oct 29, 2020 @ 11:09AM
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్య పరిణామాలకు వేదికవుతోంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ఇక్కడ ప్రతి విషయం వివాదాస్పదమే అవుతోంది. అన్ని గ్రామాల్లోనూ అలర్ట్ గా ఉంటున్న పార్టీ శ్రేణులు చీమ చిటుక్కుమన్నా సీరియస్ గా స్పందిస్తున్నాయి. ఇటీవల జరిగిన నోట్ల కట్టల రగడ అలా ఉండగానే.. కొత్తగా బోగస్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారనే రచ్చ నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. అధికార పార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కై బోగస్ బ్యాలెటు ఓట్లు వేయించుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ఈసారి ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. డెబ్బై ఏండ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు పోలింగ్ కేంద్రానికి రాకుండా ఇంట్లోనే ఉండి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించింది. ఎన్నికల సంఘం అలాట్ చేసిన అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామాలకు వెళ్లి.. వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల నుంచి బ్యాలెట్ ఓట్లు తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. బ్యాలెట్ ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు తమను అనుకూలంగా ఉన్నవారినే నియమించారని, వారు బ్యాలెట్ ఓట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోకి వస్తున్న పోలింగ్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.
దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, మిరుదొడ్డి మండలాల్లోని పలు గ్రామాలు అధికార, విపక్ష పార్టీల మధ్య బ్యాలెట్ ఓట్ల విషయంలో గొడవలు జరిగాయి. గ్రామాల్లోకి వస్తున్న ఎన్నికల సిబ్బంది.. వృద్ధులను అధికార పార్టీకి ఓటేయమని ప్రలోభాలకు గురి చేస్తున్నారని విపక్ష కార్యకర్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాలెటు ఓటు వినియోగించుకుంటున్న ఓటరు చెప్పిన గుర్తుకు కాకుండా కారు పార్టీకే అధికారులు ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వృద్ధుల ఓట్లన్ని ఒకచోటే గంపగుత్తగా టీఆర్ఎస్ నేతలే వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటును తమకు అనుకూలంగా మలుచుకుంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, అడ్డదారిలో గెలిచేందుకు కుట్రలు చేస్తుందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఇక బ్యాలెటు ఓటు వినియోగించుకునే అర్హులంతా ఆసరా పెన్షన్లుదారులే. ఇది కూడా అధికార పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటేయకుంటే ఫించన్ ఆగిపోతుందని వారిని గులాబీ నేతలు భయపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెన్షన్ పోతుందన్న భయంతో ఇష్టం లేకున్నా కొందరు వృద్ధులు, వికలాంగులు అధికార పార్టీ నేతలకే తమ బ్యాలెటు పేపర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓటమి భయంతోనే బ్యాలెటు ఓట్లను భారీగా వేసుకునేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పరిశీలకుడి దృష్టికి అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను తీసుకువెళ్లేందుకు కమలనాధులు సిద్ధమవుతున్నారట.
మరోవైపు ఎన్నికల సిబ్బంది మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదంటున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే బ్యాలెటు ఓట్లు తీసుకుంటున్నామని, తామెవరిని ప్రభావితం చేయడం లేదని చెబుతున్నారు. వృద్ధులు, వికలాంగుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారితోనే ఓట్లు వేయిస్తున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు కూడా విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. కరోనా తర్వాత జరుగుతున్న ఎన్నికల కోసం ఈసీనే ఈ వెసులుబాటు కల్పించిందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారని చెప్పారు. ఓటమిని ముందే గ్రహించిన విపక్షాలు.. అందుకు కారణాలు వెతుక్కుంటున్నాయని, అందులో భాగంగానే తమపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నాయని కారు పార్టీ నేతలు మండిపడుతున్నారు.
మొత్తంగా ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతుండటంతో పోలింగ్ నాటికి ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనవచ్చనే భయాందోళన కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.