డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ వాక్సిన్.. కానీ భారత్ లో మాత్రం ఆలస్యం .. కారణం అదే..!
posted on Oct 29, 2020 @ 12:32PM
కరోనాను ఎదుర్కొనేందుకు ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ "కోవిషీల్డ్" వాక్సిన్ వచ్చే డిసెంబర్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని భారత్ లో దీనిపై ట్రయల్స్ చేసి ఉత్పత్తి చేసే సీరం ఇండియా సంస్థ సిఇవో ఆధార్ పూనావాలా తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఈ వాక్సిన్ మూడో దశ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని.. దీంతో డిసెంబర్ నెలలో ఈ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు. ఈ వాక్సిన్ పై బ్రిటన్ లో జరుగుతున్న ట్రయల్స్ లో ఇటు యువకులలో అటు వృద్దులలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తోందని.. తీపి కబురు చెప్పారు. అయితే భారత్ లో మాత్రం తొలి బ్యాచ్ 2021 జులై- సెప్టెంబర్ మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే మనదేశంలో మాత్రం వాక్సిన్ ఎపుడు వస్తుందనే విషయం.. డిసిజిఐ అనుమతుల పై ఆధారపడి ఉంటుందని అన్నారు.
తాము 10కోట్ల వాక్సిన్ డోసులను సిద్ధం చేస్తున్నామని… వ్యాక్సిన్ సేఫ్ అని ఫైనల్ ట్రయల్స్ లో తేలితే ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సినేషన్ కు వెంటనే అవకాశం ఇవ్వాలని తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని అయన వెల్లడించారు. అయితే ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ నిర్ణయమే కీలకమని అయన వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక అత్యవసరం అని భావించి అనుమతిస్తే మాత్రం జనవరి నాటికి సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయి. లేదంటే మాత్రం ఆలస్యం అవుతుందని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ సేఫ్ అనే తేలటంతో… బ్రిటన్ లో అత్యవసరంగా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.