అశోక్ టార్గెట్ గానే విగ్రహం ధ్వంసం? జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యం? 

విజయనగరం జిల్లా రామతీర్థంలోని ప్రసిద్ధ రామాలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. విగ్రహం ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తుండగా.. జగన్ సర్కార్ తీరుతో ఆ అనుమానం నిజమేనని బలపడుతోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టార్గెట్ గానే అధికార పార్టీ డైరెక్షన్ లోనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. విగ్రహం ధ్వంసం ఘటనను సాకుగా చూపుతూ ఆయన్ను ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించింది జగన్ సర్కార్. రామతీర్థంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్ట్ ల నుంచి ఆయన్ను తొలగిస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అశోక్ గజపతి రాజును పదవి నుండి తప్పించడానికి రాములోరి తల నరికారా.. అందుకే పదవి నుండి తప్పించారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపునకు పరాకాష్టగా, జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యంగా రామతీర్థం ఘటన నిలుస్తోందని చెబుతున్నారు.    రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు పూసపాటి అశోక్ గజపతి రాజు. రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేశారు. ఇప్పటికే అశోక్‌ ను ప్రతిష్ఠాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్‌ పదవి నుంచి తొలగించింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌  ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది ఏపీ సర్కార్. తాజాగా మూడు దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సర్కార్ తీరుతో అశోక గజపతి రాజును రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించేందుకే ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారనే చర్చ జరుగుతోంది.   ఇందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాకా ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా గుడుల్లో విగ్రహాలు ధ్వంసం చేయడమే, హుండీలు పగలగొట్టడమే, విగ్రహాలు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి.అయితే ఆలయాలపై దాడులు జరుగుతున్నా జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించలేదు. ఎవరిపైనా చర్య తీసుకోలేదు. 150 ఆలయాలపై దాడులు జరిగితే.. ఏ గుడి చైర్మెన్ ను తొలగించలేదు. కాని రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో  మాత్రం విచారణ జరుగుతుండగానే ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఆదేశాలివ్వడంతో.. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందనే అనుమానం బలపడుతోంది.    అంతేకాదు విగ్రహం ధ్వంసం ఘటన తర్వాత రామతీర్థం ఆలయ అధికారులు, స్థానిక పోలీసుల తీరు కూడా వివాదాస్పందగానే ఉంది. వైసీపీ నేతలను కొండపైకి అనుమతిస్తూ.. ఇతర పార్టీల నేతలను అడ్డుకున్నారు. శనివారం కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయిని ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు. చంద్రబాబు గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలిస్తే.. నిజాలు భయటపడుతాయనే భయంతోనే అధికార పార్టీ ఇలా వ్యవహరించిందని చెబుతున్నారు.  ఎంపీని గర్భగుడిలో తీసుకెళ్లి.. ప్రతిపక్ష నేత చంద్రబాబును విచారణ పేరుతో అడ్డుకోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.     ఆలయాలపై దాడులు జరుగుతున్నా నివారించలేని  దేవాదాయ శాఖకు దద్ధమ్మ మంత్రిగా మిగిలిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్... నోటి దూలతో ఆ పదవికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. రామతీర్థం ఘటనపై మరోసారి దిగజారి వ్యాఖ్యలు చేశారు వేస్ట్ మినిస్టర్ వెల్లంపల్లి. రాములవారి విగ్రహం తల పగులగొట్టిన వెధవను చైర్మన్ గా ఉంచాలా? అంటూ మండిపడ్డారు. అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని కౌంటరిచ్చారు నారా లోకేష్. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు నారా లోకేష్.   పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజు గారిని అందరూ గౌరవిస్తారు. వాళ్ల అమ్మాయికి కరీంనగర్ లో మెడిసిన్ సీట్ వస్తే  మంత్రిగా ఉండి ,  మార్పించుకునే అవకాశం  వున్నా ఒప్పుకోకుండా  వచ్చిన ర్యాంక్ కి అక్కడే చదవాలి అని ఆయన చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి,  విజయనగరం  మహారాజా కళాశాలకు వందల  ఎకరాలు  ఇచ్చిన కుటుంబం పూసపాటిది. అవినీతి  మరకలు లేని హుందాగా దేవాలయాల ధర్మ కర్తగా వ్యవహరించే అశోక గజపతి రాజును వెధవ అని సంభోదించిన వెల్లంపల్లిపై ఆయన నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి గారి నోటిదురుసుతనానికి  సిగ్గుపడుతూ,  పెద్దరికాన్ని, గౌరవాన్ని మరిచిపోయేలా చేసిన పదవి శాశ్వతం కాదని, విజయవాడ  పరువు నిలిపేలా, అందరు మెచ్చుకునేలా వ్యవహార శైలి ఉండాలని,  వయసుని గౌరవించటం నేర్చుకోవాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.    హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు రామతీర్థం ఘటనలోనూ తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా.. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవధర్ , అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తమ జగన్ భక్తీ చాటుకున్నారు. బీజేపీ నేతల తీరుపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని విష్ణువర్దన్ రెడ్డికి తెలియదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర సర్కార్ నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారా అని నిలదీస్తున్నారు. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఏపీ బీజేపీ కేడర్ నుంచి కూడా వస్తున్నాయి.

గర్భగుడిలోకి విజయసాయి రెడ్డి.. చంద్రబాబుకు మాత్రం గుడిలోకి నో ఎంట్రీ

విజయనగరం జిల్లా రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బిజెపి, వైసిపి, టిడిపి నాయకులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ రామతీర్థం ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగా విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయి ఆలయం వద్దకు వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు.   చంద్రబాబు మరికాసేపట్లో గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుడికి తాళం వేయడంపై చంద్రబాబు అక్కడి ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుడికి తాళం ఎందుకు వేశారని ప్రశ్నిస్తే... విచారణ జరుగుతోందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విగ్రహాలను ఆయన గుడి వెలుపలి నుంచే పరిశీలించారు. దుండగులు రాముడి విగ్రహం తలను విసిరేసిన కోనేరును కూడా ఆయన పరిశీలించారు. ఇది ఇలాఉండగా చంద్రబాబును ఆలయంలోకి అనుమతి ఇవ్వక పోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిని ఏ హోదాతో అనుమతి ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం!

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ని నెలలుగా ఎన్నో దేవాలయాలపై దాడుల జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ వచ్చింది. పదులు వందల సంఖ్యలో దాడులు జరిగిన తర్వాత గానీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదు. ఇటీవల ఆయన హిందూ దేవాలయాలపై దాడుల అంశంపై మాట్లాడుతూ.. దేవుడితో పెట్టుకుంటే కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. కానీ ఏం లాభం? ఆయన హెచ్చరించినా దుండగులు రెచ్చిపోతున్నారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రామతీర్థం, రాజమండ్రి ఘటనలు మరువకముందే.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.   కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం మర్లబండలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. గోపురంపై ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ఆలయంలోని హుండీలను కూడా అపహరించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

420కి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది! 

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తన సవాల్ ను స్వీకరిస్తున్నానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై లోకేష్ ఫైరయ్యారు. ‘420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏ1 కి దమ్ము, ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని దుయ్యబట్టారు  నారా లోకేష్. తనపై జగన్ రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధమని లోకేష్‌ సవాల్ విసిరారు. ప్రమాణం చేయడానికి జగన్ రెడ్డి సిద్ధమా? అని నారా లోకేష్‌  మరోసారి ప్రశ్నించారు.   రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు సంబంధించి తీవ్రంగా స్పందించిన నారా లోకేష్.. సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్చకు  సింహాద్రి అప్పన్న ఆలయానికి రావాలని సీఎం జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. అయితే లోకేష్ సవాల్ పై స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి..  ‘‘టీడీపీ నేత లోకేష్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు సిద్ధం. చర్చకు మీరే తేదీ చెప్పండి’’ అని సవాల్ విసిరారు. దీనిపై స్పంచిందిన నారా లోకేష్.. 420 జగన్‌రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి?’అని కౌంటరిచ్చారు. 

రామతీర్థంలో హై టెన్షన్.. విజయసాయి కారుపై దాడి.. చంద్రబాబు ఎంట్రీ!!

విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగాన్ని తలపిస్తోంది. రాజకీయనేతల పర్యటనతో రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు రామతీర్థానికి భారీగా చేరుకున్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   రామతీర్థం పర్యటనలో ఎంపీ విజయసాయిరెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారుపై నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయనతో పాటుగా అనేక మంది కార్యకర్తలు కూడా కొండమీదకు వెళ్లారు. అయితే, కొందరు కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొని కొండమీదకు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ జెండాలతో ఎలా వెళ్తారని బీజేపీ, టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు విజయసాయి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో విజయసాయి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన తర్వాత విజయసాయి మరో కారులో వెళ్లారు.    మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. మార్గమధ్యంలో అడ్డంకులు ఎదురైనా, ఎట్టకేలకు చంద్రబాబు రామతీర్థం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. అంతకుముందు రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌ లోని టీడీపీ నేతల మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. తాము కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతించాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఎట్టకేలకు వారిని కూడా అనుమతించడంతో రామతీర్ధం చేరుకున్న చంద్రబాబు గుడిని పరిశీలించారు. కాగా, రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు.  

సౌరవ్ గంగూలీకి గుండెపోటు

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఉదయం జిమ్‌ లో ఉండగా ఉన్నట్లుండి తీవ్రమైన ఛాతీ నొప్పితో గంగూలీ బాధపడ్డారు. దీంతో అక్కడి సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు. సాయంత్రంలోపు యాంజియో ప్లాస్టీ(గుండె నాళాల్లో అడ్డంకులు తొలగింపు) చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం ఆసుపత్రి యాజమాన్యం ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని డాక్టర్లు పేర్కొన్నారు.

సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక?  

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో   ఖాళీ అయిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగే  అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి  కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకే చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి.  తాను బీజేపీలో చేరబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణా సంఘం నివేదికను ఏఐసీసీ కోరింది. దీంతో తిరుపతిలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన కామెంట్స్‌తో కూడిన రిపోర్ట్‌ను ఏఐసీసీకి క్రమశిక్షణా సంఘం పంపించింది. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా  రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇచ్చే సమాధానం తర్వాత అతనిపై స్పీకర్ పై అనర్హత పిటిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట. కాంగ్రెస్ అనర్హత పిటిషన్ ఇస్తే.. స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరపాల్సి  ఉంటుంది.  బీజేపీలో చేరేందుకు ఏడాది క్రితమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ సందర్భంలోనే తెలంగాణలో బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని  చెప్పారు. అప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని అంతా భావించారు. అయితే అది ఎందుకో ఆగిపోయింది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే  స్పీకర్ ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ భావించింది. అదే జరిగితే స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చని భావించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఆ సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఉప ఎన్నిక వస్తే మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనే అంచనాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు వచ్చారట. అందుకే కావాలనే  అప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరికను బీజేపీ పెద్దలు వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది.  వరుస విజయాలతో తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీద ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా గెలవొచ్చనే భావనలో బీజేపీ ఉందని చెబుతున్నారు.  పార్టీ మారితే తనపై అనర్హత  వేసినా బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలుస్తాననే ధీమాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు ముహుర్తాన్ని ఆయన రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావొచ్చనే అంచనాతో బీజేపీ కూడా మునుగోడుపై  ఫోకస్ చేసిందంటున్నారు. పరిస్థితులన్ని తమకు  అనుకూలంగా ఉన్నాయని భావించిన వెంటనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. 2020 మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా కనిపించినా... మునుగోడులో మాత్రం పట్టు నిలుపుకున్నారు కోమటిరెడ్డి. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటిల్లోనూ కాంగ్రెసే మెజార్డీ డివిజన్లు గెలుచుకుంది. అందుకే తన గెలుపుపై ఫుల్ క్లారిటీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.   కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా  చర్చిస్తోందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ వేసే ముందు.. మునుగోడు పరిస్థితిపై సర్వే చేయించాలనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.  అయితే మునుగోడు కాంగ్రెస్ కు బలమైన ప్రాంతమని, రాజగోపాల్ రెడ్డి వెళ్లినా అక్కడ మళ్లీ గెలిచే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉందని కొందరు పీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడి మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడం ఖాయమనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.  మరోవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే వెంకట్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పని చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటనతో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది. 

భారతీయులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం

దేశమంతటా కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రై రన్‌ ను పరిశీలించడానికి ఓ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశమంతటా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.   ఢిల్లీలో మాదిరిగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీలోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉచితమేనని చెప్పారు. భార‌త్ లో తొలి విడతలో మూడు కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను అందజేస్తామని తెలిపారు. తొలి విడ‌త‌లో కోటి మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు మ‌రో రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ తర్వాత విడ‌త‌లో మ‌రో 27 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఎలా అందించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.

పులులు, సింహాలు కాదు విధేయులు కావాలి! రేవంత్ టార్గెట్ గా మరో లేఖ 

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు మరింత ముదురుతోంది. పార్టీలో ఏకాభిప్రాయం కోసమే టీపీసీసీ చీఫ్ ఎన్నికను హైకమాండ్ ఆలస్యం చేస్తుందని కొందరు చెబుతుండగా..  పీసీసీ ఎంపిక  ఆలస్యమయ్యే కొద్ది పార్టీలో విభేదాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిపై హైకమాండ్ కు మరో లేఖ రాశారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ కు కావాల్సింది పులులు , సింహాలు కాదని... అందరిని కలుపుకొని పార్టీకి  విధేయులుగా ఉండే నాయకత్వం  కావాలని లేఖలో సోనియా ,రాహుల్ గాంధీలను కోరారు జగ్గారెడ్డి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పార్టీకి ఇబ్బందిరకరంగా ఉందని తెలిపారు.  తెలంగాణలో పార్టీ బలోపేతానికి 25 మందితో కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించాలని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు‌, మహిళలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోరాడేందుకు విడివిడిగా కమిటీలు వేయాలని.. వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించాలని కోరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయాలన్నారు జగ్గారెడ్డి. ఈ ప్రతిపాదనలో తనకు ఎలాంటి స్వార్థం లేదని...సాగర్‌లో కాంగ్రెస్ గెలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని చెప్పారు. తాను పరిమితి దాటి మాట్లాడితే క్షమించండి అంటూ జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.  పీసీసీ రేసులో ముందున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా మరోసారి హైకమాండ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తోంది.  రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ప్రచారాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు జగ్గారెడ్డి. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే పదవి ఇవ్వాలనే చర్చను తీసుకొచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఖాయమనే సంకేతాలు రావడంతో.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సాకుగా చూపి కొంత కాలం వాయిదా వేయించే ప్రయత్నాలను జగ్గారెడ్డి చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.   

తీవ్ర ఉద్రిక్తత మధ్య రామతీర్థంలో చంద్రబాబు పర్యటన

విజయనగరం జిల్లా రామతీర్థంలో పురాతన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెల్సిందే. ఏపీలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని ప్రతిపక్షాలు మండిపడుతుండగా... ఇది టీడీపీ పనే అని అధికార వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలిని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నుండి రామతీర్థంకు బయల్దేరారు. మరి కొద్దిసేపట్లో ఆయన రామతీర్థం చేరుకోబోతుండగా.. మరోవైపు విజయసాయిరెడ్డి అంతకు ముందే బోడికొండకు చేరుకుని, రామతీర్థం ఆలయానికి చేరుకున్నారు. దీంతో, రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత పరిష్టితులు నెలకొన్నాయి.   ఇది ఇలా ఉండగా బోడికొండ కింద ఇప్పటికే టీడీపీ, బీజేపీ, వైసీపీ శ్రేణులు టెంట్లు వేసుకున్నాయి. బీజేపీ శ్రేణులతో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు కొంత మంది సాధువులు కూడా ఉన్నారు. మరోవైపు రామతీర్థంకు వెళ్తున్న విజయసాయిని బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని వారు మండిపడ్డారు. గోబ్యాక్ విజయసాయిరెడ్డీ అంటూ నినాదాలు చేసారు. మరోపక్క జైశ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగుతోంది. అయితే, పోలీసుల అండతో విజయసాయిరెడ్డి కొండపైకి బయల్దేరారు. ఆ ప్రాంతంతో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీ ఎత్తున ఆ ప్రాంతంలో మోహరించారు. అయితే ఇప్పటివరకు రామతీర్థంతో పాటు ఇతర ఆలయాల దాడులపై సరిగా స్పందించని ప్రభుత్వం, వైసీపీ నేతలు ఇపుడు చంద్రబాబు పర్యటనకు వస్తుండడంతో విజయసాయిరెడ్డి హడావిడిగా పర్యటన చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అధికారంలోకి వచ్చాకా ఎవరిని వదిలిపెట్టం! పోలీసులకు ఉత్తమ్ వార్నింగ్ 

సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ పతనం మొదలైందన్నారు. పోలీసులు కేసీఆర్‌ను చూసి ఎగరకండని.. జాగ్రత్తగా ఉండాలని.. తాము ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఉత్తమ్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒత్తిడితోనే   రాఘవ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పోలీసులు చట్టం, ధర్మం, రాజ్యాంగం పరిధిలో పని చేయాలని సూచించారు.  జైలులో ఉన్న జంగా రాఘవరెడ్డిని కలిసేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క వస్తుండటంతో  వరంగల్ సెంట్రల్ జైల్ వద్ద అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.  రాఘవ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో వరంగల్ సెంట్రల్ జైలు పరిసరాలతో పాటు వరంగల్ నగరం, జనగామ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.    

మంత్రి అవంతి ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టం: టీడీపీ సంచలన కామెంట్స్ 

ఏపీలోని విశాఖ నగరంలో గత కొంత కాలంగా వైసీపి, టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో చల్లని వింటర్ లో కూడా రాజకీయ వాతవరణం బాగా వేడెక్కుతోంది. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విరుచుకుపడ్డారు. అవంతి ఇతర రాష్ట్రాలకు పారిపోయే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మరో రెండేళ్ల తర్వాత ఇటు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు, అటు దేశంలో జగన్ కూడా ఉండడు అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఆఫర్ చేస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీలోనే ఉన్నారన్న అక్కసుతో వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని అయన మండిపడ్డారు. వెలగపూడి.. కబడ్ధార్ అని మంత్రి అవంతి అనడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. అసలు అవంతి బెదిరింపులకి భీమిలి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే భయపడరు, ఇంక ఆయన తాటాకు చప్పుళ్లకు టీడీపీ ఎమ్మెల్యే భయపడతారా? అంటూ మంతెన ఎద్దేవా చేశారు.   వైసీపీని నమ్మి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇస్తే...రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ.. ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షలు, కార్పణ్యాలు, తప్పుడు కేసులతో రెండేళ్ళ సమయాన్ని వృధా చేసారని అయన విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అయన హెచ్చరించారు. జగన్ ని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయినట్లు అవంతిని నమ్మి భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా మోసపోయారన్నారు. మంత్రి అవంతి విశాఖలో భూకబ్జాలు చేయడం తప్ప మంత్రిగా తన నియోజకవర్గానికి గానీ రాష్టానికి గానీ ఈ రెండేళ్లలో చేసిందేంటని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన మరుసటిరోజే విశాఖలో అవంతి చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని, దీంతో చేసిన తప్పులకు భయపడి అవంతి.. ఇతర రాష్ట్రాలకు పారిపోయినా వదిలిపెట్టం అని మంతెన సత్యనారాయణరాజు హెచ్చిరించారు.

యూ టర్నా.. కమలాన్ని ఇరికిస్తున్నారా? సీఎం కేసీఆర్ దారెటు? 

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ మారిపోయారా? వరుస ఓటములతో ఆయన దిగొచ్చారా? తెలంగాణలో ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాల్లోనే కాదు టీఆర్ఎస్ లోనూ ఇదే ఇప్పుడు ప్రధానంగా మారిందని చెబుతున్నారు. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే. మాములుగా తనకు నచ్చిన పని చేసేస్తుంటారు గులాబీ బాస్. అది అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా సరే ఆయన తన నిర్ణయాలను వెనక్కి తీసుకోరు. మొండిగా ముందుకు వెళుతూనే ఉంటారు. కాని ఇటీవల మాత్రం ఆయన మైండ్ సైట్ లో మార్పు కనిపిస్తోంది. తాను తీసుకున్న  కొన్ని విధాన పరమైన నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్నారు కేసీఆర్. గతానికి భిన్నంగా తన నిర్ణయాలపై  తెలంగాణ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాల్లో ఆస్తక్తిగా మారింది. కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారారని విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. రాజకీయ అనలిస్టుల నుంచి మాత్రం కేసీఆర్ యూ టర్న్ ల వెనక బలమైన వ్యూహమే ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా వెళుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలానికి బూస్ట్ ఇచ్చాయి. వరుస విజయాల జోష్ తో రాష్ట్రంలో అధికారమే లక్ష్యమంటోంది కాషాయ దళం. దీంతో  తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీకి బ్రేక్ వేయడమే లక్ష్యంగా కేసీఆర్ తాజా అడుగులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.  తెలంగాణ బీజేపీ నేతలు  లేవనెత్తిన  అంశాల్లోనే కేసీఆర్ వెనక్కి తగ్గటం ఇందుకు బలాన్నిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్, ఉద్యోగాల అంశాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు అంశాల్లో కేసీఆర్ దిగిరావడంతో..  బీజేపీకి ఇక ప్రచారం చేయడానికి వేరే అంశాలు లేకుండా పోయాయని చెబుతున్నారు. బంతిని బీజేపీ కోర్టులోకి విసిరి దూరమవుతున్న ప్రజలను తిరిగి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కేసీఆర్ వ్యూహంలో  దాగి ఉన్నాయని అంటున్నారు.   రానున్న కాలంలో కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించే విద్యుత్ సంస్కరణలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు ప్రత్యేక కోటాలాంటి మరికొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం నుంచి వెలువడే అవకాశం ఉంది.ఆయుష్మాన్ భారత్, వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు బీజేపీ నేతలు. కేంద్ర చట్టాలను తెలంగాణ సర్కారు అమలుచేయకపోవడంతో పేదలకు ప్రయోజనం అందడంలేదని బీజేపీ ఇంతకాలం విమర్శించింది. ఢిల్లీ పర్యటన తర్వాత కేంద్రానికే జై కొట్టారు కేసీఆర్. దీంతో  రైతులలో ఇకపైన వ్యతిరేకత వస్తే దానికి కేంద్రమే జవాబుదారీ అనే అభిప్రాయం నెలకొంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ దోషిగా నిలబడుతుంది. బీజేపీని ఎక్కడా విమర్శించకుండా రైతుల ద్వారానే కాగల కార్యాన్ని ఇలా సాధించాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.  ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేసినట్లయితే దాని ద్వారా కనీసంగా రూ. 250 కోట్లు రాష్ట్రానికి అందే వీలు ఉంది.కేంద్రం దారిలో నడవడం ద్వారా రోజువారీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చన్న అంశం కూడా కేసీఆర్  వ్యూహంలో కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేయడంతో పాటు  పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలన్నింటినీ ఒక్కటొక్కటిగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ బాస్. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉద్యోగులకు జీతాల పెంపు , సామాన్యులకు ఎల్ఆర్ఎస్ మినహాయింపు అందులో భాగమేనంటున్నారు. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు, నాగార్జునసాగర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికులు జరుగునున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తాజా వ్యూహాలతో బీజేపీకి రాజకీయ అంశాలు లేకుండా చేయడంతో పాటు ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే.. కేసీఆర్ తన నైజానికి భిన్నంగా యూటర్న్ లు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

మళ్లీ ఫ్యాక్షన్ పడగలోకి రాయలసీమ? అరాచకాలకు అడ్డాగా జగన్ రెడ్డి పాలన ? 

మూడు మర్డర్లు.. ఆరు అటాక్ లు.. తొమ్మిది దొమ్మీలు. ఇదీ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి. ఫ్యాక్షన్ పడగలో,  కక్ష్య రాజకీయాలతో తల్లడిల్లింది ఆ సీమ. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ లబ్ది కోసం ఫ్యాక్షన్ ను పెంచి పోషించారు అక్కడి నేతలు. దివంగత నందమూరి తారక రామారావు  రాజకీయ ప్రవేశంతో  రాయలసీమ ఊపిరి పీల్చుకుంది. ఎన్టీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, అభివృద్ధి నినాదంతో  రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంత సీమగా మారిపోయింది. తర్వాత చంద్రబాబు పాలనలోనూ రాయలసీమలో  ఫ్యాక్షన్ ను చోటు లేకుండా పోయింది. హత్యా రాజకీయాలు మాని అభివృద్ధి కోసం పని చేశారు ప్రజా ప్రతినిధులు. అయితే కొన్ని రోజులుగా రాయలసీమలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జగన్ రెడ్డి పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ నీడలోకి వెళ్లింది. అధికార పార్టీ నేతలు బరి తెగింపుతో  సీమలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రజలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దాడులకు తెగబడుతున్నారు. హత్యలకు పాల్పడుతూ జనాల్లో భయాందోళన స్పష్టిస్తున్నారు.  కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం.. ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి. రోజూ ఏదో ఒక చోట ప్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  రాజకీయ కక్షలతోనే .. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. దీంతో ప్రజలు ప్రాణాలు అర చేతిలో  పట్టుకుని జీవించాల్సిన పాత రోజులు రాయలసీమలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పట్టపగలే జరిగిన టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది.  ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యక్రమంలో ఇళ్ళపట్టాల పంపిణీ  వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్న సుబ్బయ్యను రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ లో  స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాత్రను,  అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పోలీసులు అక్కడ ఉండగానే.. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో  ఊహించవచ్చు.   అనంతపురం జిల్లా  వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. పోలీసుల అండతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చిలో కూర్చొని హంగామా చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి ఘటనే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని చెబుతున్నారు. గతంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగినా.. ఇలా ఒక ఎమ్మెల్యే వందలాది మందిని తీసుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ఎప్పుడు జరగలేదంటున్నారు. ఏపీలో  రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.   అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో దళిత జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపైనే  దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  జగన్ రెడ్డి పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయింది. తాము చెప్పినట్లు వినకపోతే అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. బెదిరించి వారిని దారిలోకి తెచ్చుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు జరుగుతూనే ఉండగా.. తాజాగా  గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి.. కరెంట్ బిల్లు కట్టమన్న లైన్ మైన్ పై తీవ్రంగా కొట్టడం దుమారం రేపింది. ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో వైసీపీ నేత పేరు డీఫాల్ట్ లిస్టులోకి వెళ్లిపోయింది. లైన్ మైన్ కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో లైన్  మెన్ ను ఇంటికి పిలుపించుకుని మరీ కొట్టాడు వైసీపీ నాయకుడు.    రాయలసీమలో  జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ్లీ పాత రోజులు వచ్చాయని వారంతా భయపడుతున్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏపీలో వైసీపీ నేతలే  విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ భయానక పరిస్థితులు నెలకొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాముడికే రక్షణ లేని రాష్ట్రం.. వ్యవస్థలు ఏమైపోయాయి.. చినజీయర్ స్వామి  

ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 160కిపైగా ఆలయాలలో ఈ తరహా దాడులు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం తల వేరు చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మరోపక్క నిన్న రాజమహేంద్రవరంలో సుబ్యహ్మణ్యేశ్వర స్వామి చేతులను విరిచేసిన ఘటన చోటు చేసుకుంది. ఇంతకూ ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఈ తాజా ఘటనలు అందరి మనసులను కలచివేస్తున్నాయి. అంతేకాకుండా ఆలయాలపై వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో దుండగులు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి అసలు ఈ ఘటనలకు కారకులు ఎవరు ?ఎందుకు చేస్తున్నారన్న దానిపై ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. మరో పక్క ఈ ఘటనలపై భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు. హిందువులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించవలసిన ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.   తాజాగా రామతీర్థం ఆలయ ఘటనపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. ఆలయాల్ని పరిరక్షించే బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. అక్కడి ఆలయాన్ని.. అలాగే రాముల వారిని ఆసరాగా చేసుకుని ఓ వ్యవస్థ ఉందని… వారంతా ఏమైపోయారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నవారు.. రక్షించాల్సిన వారు ఎందుకు నిమిత్తమాత్రులుగా మారారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో ప్రశ్నించడానికి భక్తులు ఏమాత్రం భయపడకూడదని ఆయన అన్నారు. వ్యవస్థలు విఫలమైనప్పుడు తప్పకుండా ప్రశ్నించాలని.. భక్తులకు ఆయన పిలుపునిచ్చారు. మన కోసం స్వయంగా వైకుంఠ వాసుడు.. శ్రీరామచంద్రుడిగా దిగి వచ్చారని.. అలాంటప్పుడు ఆయన బాగోగులు మనం తప్పకుండ చూసుకోవాల్సిందేనన్నారు. ఎందుకంటే.. విగ్రహ రూపంలో ఆయన అక్కడ ఉన్నది మన బాగోగులు చూడటానికేనని అయన గుర్తు చేశారు.   ఇది ఇలా ఉండగా రామతీర్థం ఘటనపై చినజీయర్ స్వామి తాజా స్పందన గమనిస్తే ఈ దాడి ఆయనను ఎంత తీవ్రంగా కలచి వేసిందో స్పష్టమౌతోంది. సాధారణంగా ఇటువంటి అంశాలపై చినజీయర్ స్వామి మాట్లాడితే రాజకీయం చేసే ప్రమాదం ఉంది. తాజాగా రామతీర్థం వ్యవహారం ఉన్మాద స్థాయికి చేరడంతో.. ఇక ఉపేక్షిస్తే.. ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశం ఉండడంతో అయన సున్నితంగా తన స్పందన తెలియచేసారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడంతో… ఏపీలో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్ట ఆలయంతో పాటు.. విజయనగరం జిల్లాలోని కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం ఆలయాన్ని కూడా పరిశీలించింది. వివిధ రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఒంటి మిట్టను నవమి వేడుకలకు ఎంపిక చేసుకున్నప్పటికీ.. రామతీర్థం ఆలయానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తాజాగా ఆ ఆలయంపైనే కొందరు ముష్కరులు గురి పెట్టారు. ఇది ఇలా ఉండగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని హిందూత్వంపై జరుగుతున్న దాడిగా.. మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది స్వామిజీలు మాత్రం కనీసం స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. కేవలం రాజకీయ ప్రకటనలు చేయడానికి పరిమితమైన కొందరు స్వాములు గుడ్డిగా ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు.

సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నేతల గన్ ఫైట్ 

ఏపీ సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల కారణంగా ప్రతి రోజు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఒక పక్క సీఎం జగన్ అనేక కొత్తకొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. మరో పక్క జగన్ ఎంత మొత్తుకున్నా అయన పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట అయితే ప్రతిపక్షాలతో లేదంటే సొంత పార్టీ నేతలతో ఘర్షణలకు దిగడంతో ప్రజలలో పార్టీ చులకన అవుతోంది.   తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప వైసీపీలో వర్గపోరు రాజుకుంది. అక్కడ వైసీపీ లోని రెండు గ్రూపులు నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరిపై మరొకరు రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. కడపజిల్లా కమాలాపురం నియోజకవర్గం వీరపనాయునిపల్లి (మం) పాయసంపల్లి వైసీపీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసే విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ముదిరి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో వైసీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.   పాయసం పల్లికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసేందుకు సిద్దపడగా.. వైసీపీలోని మరో వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశార‌ని స‌మాచారం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ రెడ్డి పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పోస్ట్ చేశారు. వైసీపీకి చెందిన మరో వర్గానికి చెందిన మహేశ్వరరెడ్డి ఈ పోస్టింగ్‌పై ఫోన్‌ చేసి సుధాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. "మనకు కొత్త సంవత్సరం..ఉగాది కదా! జనవరి ఒకటి కాదు కదా" అని గట్టిగా అడిగారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అని.. ఇద్దరూ ఫోన్‌లోనే హెచ్చరించుకొన్నారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మహేశ్వరరెడ్డి వర్గీయులు.. సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతడి వర్గీయులపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగిరెడ్డికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి వర్గీయులను కంట్రోల్ చేయడానికి సుధాకర్‌రెడ్డి తన లైసెన్స్‌ గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గాయపడిన వారికి చికిత్స అందుతోంది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో దేవుడికే రక్షణ కరువైంది!!

అందరికీ ఆ దేవుడే రక్ష అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవుడికే రక్షణ కరువైంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 19 నెలల  కాలంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం, రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటనలు వెలుగు చూశాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.    ఏపీకి వైఎస్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఐన తరువాత ఈ 19 నెలల కాలంలో 20 కి పైగా హిందూ దేవాలయలపై దాడుల జరిగాయి. 1. 2019 నవంబర్ 14 న.. గుంటూరు దుర్గ గుడి ధ్వంసం  2. 2020 జనవరి 21 న.. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం 3. 2020 ఫిబ్రవరి 11 న.. రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం 4. 2020 ఫిబ్రవరి 13 న.. ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు 5. 2020 ఫిబ్రవరి 14 న.. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం 6. 2020 సెప్టెంబర్ 6 న.. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం 7. 2020 సెప్టెంబర్ 13 న.. విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ 8. 2020 సెప్టెంబర్ 15 న.. కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం 9. 2020 సెప్టెంబర్ 16 న.. ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 10. 2020 సెప్టెంబర్ 16 న.. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం 11. 2020 సెప్టెంబర్ 17 న..  కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం 12. 2020 సెప్టెంబర్ 19 న.. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం 13. 2020 సెప్టెంబర్ 20 న.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం 14. 2020 సెప్టెంబర్ 23 న.. కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 15. 2020 సెప్టెంబర్ 25 న.. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం 16. 2020 అక్టోబర్ 5 న.. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా సుగని జలాశయం దగ్గర వున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో నరసింహ స్వామి శేషపడగలు ధ్వంసం 17. 2020 అక్టోబర్ 6 న.. కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ  స్వామి విగ్రహం ధ్వంసం 18. 2020 అక్టోబర్ 6 న.. గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం 19. 2020 అక్టోబర్ 17 న.. తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం 20. 2020 నవంబర్ లో.. యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం.. 21. 2020 డిసెంబర్ 29 న.. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం 22. 2020 డిసెంబర్ 31 న.. రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ గణపతి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం   ఇలా హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడి ఘటనలు వెలుగులోకి వచ్చినవి కొన్నే.. వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరైన చర్యలే లేవు. మతిస్తిమితం లేని వారి చర్యలంటూ ప్రభుత్వం, పోలీసులు కాలయాపన చేశారు. ఇక సీఎం సంగతి సరేసరి. ఇన్ని నెలలుగా దాడులు జరుగుతుంటే ఆయన నుండి సరైన స్పందనే లేదు. తాజాగా ఒక్కసారి స్పందించారు. దేవుడితో పెట్టుకోవద్దని, శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. అయితే ఆయనలా హెచ్చరించిన కొద్ది గంటల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటన జరగడం గమనార్హం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ఇక ప్రభుత్వానికి తగ్గట్టే ప్రతిపక్షాల తీరు కూడా ఉంది. దాడి జరిగినప్పుడు ఖండిస్తున్నాం అంటూ రెండు వ్యాఖ్యలు చేయడమే తప్ప.. ఇది కోట్ల మంది మనోభావాలకు సంబందించిన అంశం అంటూ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ సరైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే చేయడం లేదు.   మరోవైపు హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్రకోణం ఉందన్న అనుమానాలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ.. రాష్ట్రంలో హిందూ మతం లేకుండా చేసి, మరో మతాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తుందని అనమానపడుతున్నారు. లేదా మరో పార్టీ.. ఈ దాడులతో హిందూవులలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి ఆ ఓట్లన్నీ రాబట్టే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న ఈ దాడుల వెనుక ఏ పార్టీ రాజకీయ పార్టీ కుట్ర కోణం ఉందో గానీ.. ఈ దాడుల మూలంగా కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ దాడుల వెనుక ఉన్న కోణాన్ని ఆ దేవుడు ఎంత త్వరగా బయటపెడితే.. అంత మంచిదన్న అభిప్రాయం అటు హిందువుల్లోనూ, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

కోమటిరెడ్డి బాటలో ఇంకెందరు? రేవంత్ రెడ్డే వాళ్ల టార్గెట్టా?

ఘోర పరాజయాలు, నేతల వలసలతో 2020 సంవత్సరంలో కుదేలైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. కొత్త ఏడాది కూాడా కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2021 న్యూఇయర్ తొలిరోజే హస్తం పార్టీకి షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏడాది క్రితం జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ తాను బీజేపీలోకి వెళతానని ప్రకటించారు. త్వరలోనే తాను కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని మరోసారి స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారి సన్నిధిలో కోమటిరెడ్డి చేసిన రాజకీయ ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీలోకి వెళతారా లేక ఆయనతో పాటు ఇంకెవరైనా వెళతారాదా అన్నది సస్పెన్స్ గా మారింది.     2020లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అంతేకాదు బీజేపీ కంటే దిగువకు పడిపోయింది. గత సంవత్సరం చాలా మంది పార్టీ నేతలు, కొందరు సీనియర్లు కూడా బీజేపీలో చేరారు.  దీంతో తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో ప్రక్షాళనకు  సిద్ధమైంది. కొత్త పీసీసీని నియమించే పనిలో పడింది. పీసీసీ పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఎవరో ఒకరిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఖాయమని తెలిసినందు వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డికి మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలోకి వెళతారనే చర్చ జరుగుతోంది.    రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తమకు ఇబ్బంది అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఓటు మొత్తం కమలానికి వెళుతోంది. రేవంత్ పీసీసీ బాస్ గా వస్తే కాంగ్రెస్ బలోపేతం కావడంతో పాటు ప్రజా వ్యతిరేకత ఓటు కొంత అటు వైపు వెళుతోంది. దీంతో తమకు నష్టం కల్గుతుందని భావిస్తున్న బీజేపీ హైకమాండ్... తెలంగాణ కాంగ్రెస్ ను బలహీనం చేయడమే లక్ష్యంగా.. ఆ పార్టీ నేతలను ఆహ్వానిస్తోంది. రేవంత్ కు పీసీసీ వస్తున్నందున.. అందుకు కౌంటర్ గా కమలనాధులు తమ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ కు బలపడే అవకాశం ఇవ్వకుండా.. పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగానే మొదటగా సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బాటలోనే కొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా కాషాయం గూటికి చేరుతారంటున్నారు. రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత వీహెచ్ తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా కాంగ్రెస్ నుంచి బయటికి రావచ్చంటున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ ను వ్యతిరేకించే నేతలందరికి బీజేపీ వల వేస్తుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చిన వెంటనే కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు ఉండేలా తెలంగాణ బీజేపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది.    మరోవైపు తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కోమటిరెడ్డి సోదరులు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనలేదని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన తల్లిగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టారు రాజగోపాల్ రెడ్డి. కాని ఆ కార్యక్రమాలకు తన అన్న వెంకట్ రెడ్డిని ఆయన పిలవలేదు.  తన అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి ఎంపీ పరిధిలోనే ఉన్నా..ప్రోటోకాల్ ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి వెళ్లలేదు. అప్పడే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అన్న టీపీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్తానని ప్రకటించడంతో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని భావిస్తున్నారు.    మొత్తంగా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. అతనితో పాటు ఇంకా ఎవరెవరు నేతలు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే.. ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయనే అభిప్రాయం కూడా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరీ బీజేపీ వ్యూహాలకు కాంగ్రెస్ నేతలు ఎలా చెక్ పెడతారో చూడాలి మరీ..

కేసీఆర్ కి కొత్త బిరుదు.. యూటర్న్ ల వీరుడు!!

"టర్న్ లందు యూటర్న్ లు వేరయ్యా యూటర్న్ ల్లో కేసీఆరే తోపయ్యా" అని భవిష్యత్ తరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి చెప్పుకుంటారేమో అనిపిస్తోంది. అదేదే సినిమాలో చెప్పినట్టుగా "ఈరోజు రైట్ అనిపించింది రేపు రాంగ్ అనిపించొచ్చు. ఈరోజు రాంగ్ అనిపించింది రేపు రైట్ అనిపించొచ్చు" అనే మాటని కేసీఆర్ నిజమని రుజువు చేస్తున్నారు. ముందేమో అబ్బే ఇది అసలు పనికిరాదు అంటారు. కట్ చేస్తే కొన్నిరోజులకి ఇది అమోఘం అంటారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఎన్నెన్నో.. ఆ ఎన్నెన్నోలో ఇప్పుడు కొన్ని యూటర్న్ ల గురించి తెలుసుకుందాం.   తెలంగాణలో రైతులంతా నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలని సూచించిన కేసీఆర్.. తరువాత ఆ మాటను వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని.. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. కొన్ని రోజులకే ఆ చట్టాలకు జై కొట్టారు. 'నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటి చ‌ట్టం. దీన్ని క‌చ్చితంగా వ్య‌తిరేకించి తీరాలి' అని కేసిఆర్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన భారత్ బంద్ ‌లో మిగతా పార్టీల కంటే ఉత్సాహంగా టీఆర్ఎస్ పాల్గొంది. టీఆర్ఎస్ కీలక నేతలు, మంత్రులు సైతం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఓ రకంగా అది టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారిక బంద్ గా కనిపించింది. కానీ కొన్నిరోజులకే సీన్ మారిపోయింది. కొత్త చట్టాలకు జై కొడుతూ.. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలని తీసివేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.   అప్పట్లో 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని అసలు ఎందుకు పనికి రాదన్న కేసీఆర్.. తాజాగా ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలోనూ అమల్లోకి రానుంది. ‌ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గతంలో అసెంబ్లీ సాక్షిగా 'ఆయుష్మాన్ భారత్' పై కేసీఆర్ విమర్శలు చేశారు. ‌ఆరోగ్యశ్రీతో పోల్చితే అసలు 'ఆయుష్మాన్ భారత్' దేనికి పనికి రాదన్నారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు 'ఆయుష్మాన్ భారత్' కి ఆహ్వానం పలికారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుపై వైద్యం చేయడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు, మరో వైపు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అందుకే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను అనుసంధానించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.   వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో మాత్రమే కాదు. పలు విషయాల్లో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. సీఎం కాకముందు నుండి ఇప్పటి వరకు ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత నాయకుడిని సీఎం చేస్తానన్నారు.. ఆయనే సీఎం అయ్యారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. తరువాత ఆ ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. తరువాత అదసలు సాధ్యమేనా? అని ఆయనే రివర్స్ లో క్వశ్చన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యూటర్న్ లు ఉన్నాయి. అయితే, తాజాగా వ్యవసాయ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ అంశాల్లో కేసీఆర్ తీసుకున్న యూటర్న్ మాత్రం.. యూటర్న్ సీఎం అంటూ విమర్శల పాలు చేసింది.