సాగర్ తో పాటు మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక?
posted on Jan 2, 2021 @ 2:01PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లాకే చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక రావొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. తాను బీజేపీలో చేరబోతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణా సంఘం నివేదికను ఏఐసీసీ కోరింది. దీంతో తిరుపతిలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన కామెంట్స్‌తో కూడిన రిపోర్ట్‌ను ఏఐసీసీకి క్రమశిక్షణా సంఘం పంపించింది. క్రమశిక్షణా సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి ఇచ్చే సమాధానం తర్వాత అతనిపై స్పీకర్ పై అనర్హత పిటిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుందట. కాంగ్రెస్ అనర్హత పిటిషన్ ఇస్తే.. స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది.
బీజేపీలో చేరేందుకు ఏడాది క్రితమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ సందర్భంలోనే తెలంగాణలో బీజేపీనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని
చెప్పారు. అప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని అంతా భావించారు. అయితే అది ఎందుకో ఆగిపోయింది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే స్పీకర్ ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ భావించింది. అదే జరిగితే స్పీకర్ అనర్హత వేటు వేయవచ్చని భావించారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఆ సమయంలోనే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని ప్రకటించారు. అయితే అసెంబ్లీ ఉప ఎన్నిక వస్తే మళ్లీ బీజేపీ నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదనే అంచనాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలు వచ్చారట. అందుకే కావాలనే అప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరికను బీజేపీ పెద్దలు వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది. వరుస విజయాలతో తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీద ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చినా గెలవొచ్చనే భావనలో బీజేపీ ఉందని చెబుతున్నారు.
పార్టీ మారితే తనపై అనర్హత వేసినా బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలుస్తాననే ధీమాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీలో చేరేందుకు ముహుర్తాన్ని ఆయన రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నిక రావొచ్చనే అంచనాతో బీజేపీ కూడా మునుగోడుపై ఫోకస్ చేసిందంటున్నారు. పరిస్థితులన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని భావించిన వెంటనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని, ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. 2020 మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా కనిపించినా... మునుగోడులో మాత్రం పట్టు నిలుపుకున్నారు కోమటిరెడ్డి. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటిల్లోనూ కాంగ్రెసే మెజార్డీ డివిజన్లు గెలుచుకుంది. అందుకే తన గెలుపుపై ఫుల్ క్లారిటీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై సీరియస్ గా చర్చిస్తోందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ వేసే ముందు.. మునుగోడు పరిస్థితిపై సర్వే చేయించాలనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటే మాత్రం రాజగోపాల్ రెడ్డిపై అనర్హత పిటిషన్ ఇవ్వకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే మునుగోడు కాంగ్రెస్ కు బలమైన ప్రాంతమని, రాజగోపాల్ రెడ్డి వెళ్లినా అక్కడ మళ్లీ గెలిచే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉందని కొందరు పీసీసీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మాత్రం ఆయనపై అనర్హత వేటు పడి మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడం ఖాయమనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు పెరిగాయన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే వెంకట్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పని చేస్తారని చెబుతున్నారు. మొత్తంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు ప్రకటనతో మునుగోడు రాజకీయాలు వేడెక్కాయని తెలుస్తోంది.