ఆ ముగ్గురు మంత్రులు తోకలేని కోతులు వంటివారు.. జనసేన ఫైర్ 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా ఏపీ మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై జనసేన ముఖ్య నేత శివశంకర్ స్పందించారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని కూడా ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని అన్నారు. ఆ మంత్రులకు మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు ఎంతమాత్రం తెలియవని, అంతేకాకుండా ప్రజస్వామ్యం గురించి గానీ, రాజ్యాంగం గురించి కానీ ఓనమాలు కూడా తెలియని మంత్రులని విమర్శించారు. ఈ ముగ్గురు ప్రాచీనయుగంలో పుట్టవలసినవాళ్లని అయన అన్నారు. ఆ మంత్రులు ఈ యుగంలో పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.   మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు. మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. బూతులు మాట్లాడే మంత్రులను పక్కన పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. నివర్ తుఫాను వల్ల 19 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... ఇప్పుడు 11 లక్షల మంది రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యను పూర్తిగా గాలికొదిలేశారని, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు తడిసిన ధ్యాన్నాన్ని కొనుగోలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని.. అయితే ఇప్పుడు మిల్లర్లు శాసిస్తున్నారని, దీంతో రైతులు రోడ్డుపై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వ్యక్తిగత దాడులు ఆపాలని, రైతులకు నివర్ నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు.

బి కేర్ ఫుల్... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా..

కరోనా మహమ్మారి నుండి తమ దేశ ప్రజలను రక్షించడం కోసం బ్రిటన్, అమెరికా వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న వారం తరువాత ఓ మేల్ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. అయన మొన్న డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతంలో చేతిపై కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఎటువంటి ఇబ్బందులూ కలగలేదని మాథ్యూస్ తెలిపారు.   అయితే అయన ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల తరువాత.. క్రిస్మస్ సందర్భగా విధుల్లో ఉన్న తనకు కొంత అనారోగ్యంగా అనిపించిందని.. ఆ తరువాత కొంత సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని ఆయన తెలిపారు. మరుసటి రోజు మ్యాథ్యూస్ అనుమానం కలిగి టెస్టు చేయించుకోగా.. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే ఈ ఘటన పై స్పందించిన అంటువ్యాధుల నిపుణుడు ఒకరు ఈ ఘటన అనూహ్యమైనదేమీ కాదని వ్యాఖ్యానించారు. "క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే కరోనాను ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత మనలో ఇమ్మునిటీ 50 శాతం, రెండు డోసు తీసుకున్న తరువాత 95 శాతం శక్తిని పుంజుకుంటుందని" ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా కొంతకాలం పాటు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందుబాబులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ తెలిపింది. బార్లు, క్లబ్బులకు ఒంటిగంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.   కాగా, కరోనా నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కు అనుమతి లేదని ఇటీవల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.

17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు జంప్ ? బీహార్ కు కొత్త సీఎం వస్తారనే ప్రచారం 

బీహార్ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు అర్జేడీలో చేరబోతున్నారన్న..  ఆ పార్టీ నేత వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్‌  పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్‌   పార్టీలో చేరనున్నట్లు ఆర్జేడీ  నేత శ్యామ్ రజక్ అన్నారు. జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు   ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోమని చెప్పిన ఆయన.. 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం  పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.  ‘17 మంది జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారు ఆర్జేడీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ క్షణమైనా జరగొచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినప్పటి నుంచి ఆ చట్టం నిబంధనలను మేం అతిక్రమించడం లేదు. అయితే మేం వారికి ఒక విషయం స్పష్టం చేశాము. 28 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఈ సంఖ్య 28కి చేరే అవకాశం ఉంది’’ అని జేడీయూ నేత శ్యామ్ రజక్ అన్నారు.  శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలతో బీహార్ లో నితీశ్ కుమార్ సర్కార్ కూలిపోబోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే  రజాక్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని, ఆర్జేడీ తప్పుడుగా ప్రచారం చేస్తోందని తెలిపారు. గత  నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ, బీజేపీ కంటే అతి తక్కువ స్థానాలను గెలుచుకుంది. ఎన్డీయే కూటమిలో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినా..  ఎన్నికల ఒప్పందం ప్రకారం నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. గతంలోనూ జేడీయూ ఎమ్మెల్యేలను ఆర్జేడీ ప్రలోభ పెడుతుందనే ఆరోపణలు వచ్చాయి. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచే కొందరు నితీశ్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని జేడీయూ నేతలు ఆరోపించారు. తాజాగా మళ్లీ ప్రలోభాల ఆరోపణలు రావడం ఆసక్తి రేపుతోంది.   

హైకోర్టు సంచలన తీర్పు.. మిషన్ బిల్డ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు ఆదేశం

మిషన్ బిల్డ్ ఏపీ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ అధికారి ఐఏఎస్ ప్రవీణ్‌‌ కుమార్‌ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం అభియోగాల కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది.    కాగా, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జగన్ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్‌ రాకేష్ కుమార్‌ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు మిషన్ బిల్డ్ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంలో వ్యహరించే అవకాశం ఉందని ఆయన అఫిడవిట్‌లో ఆరోపించారు.

మళ్లీ తెరపైకి నిర్మాత సి కల్యాణ్  భూకబ్జా ! బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత 

హైటెక్ సిటీకి సమీపంలోని  హఫీజ్ పేటకు సంబంధించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ భూ కబ్జా వివాదం మళ్లీ ముదురుతోంది. పేదల భూములను కల్యాణ్ అక్రమించారంటూ  భూ నిర్వాసితులు చందానగర్  మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ ను ముట్టడించారు. పేదలను తరిమేసి భూములను ఆక్రమించుకున్న బడా నిర్మాత.. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారంటూ ఆందోళనకు దిగారు. కబ్జా స్థలంలో నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని చందానగన్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. నిర్మాత సి కల్యాణ్ తో పాటు సర్కార్ కు వ్యతిరేకంగా హఫీజ్ పేట నిర్వాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చందానగర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర  తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.   శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 80లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రముఖ నిర్మాత  సి. కల్యాణ్ కబ్జా చేశారని 2017లో వెలుగులోనికి వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. సర్వే నంబర్ 80లో మొత్తం  484.31 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ దాదాపు వెయ్యి మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసించేవారు. రికార్డుల ప్రకారం ఈ భూమి  ప్రభుత్వానిదే అయినా..  తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నది సీ కల్యాణ్ పై ఆరోపణ.  2006 ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి రంగారెడ్డి ఎస్ ఆర్‌ ఏ వో ఈ  భూమిని సి కల్యాణ్ కు రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఈ భూమిని యూకో బ్యాంక్ కు ఐదు కోట్ల రూపాయలకు తనఖా పెట్టారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అప్పు  కట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు  కల్యాణ్ కు నోటీసులు కూడా ఇచ్చారు. అదే సమయంలో 8 ఎకరాల భూమిని 80 ఎకరాలుగా పత్రాల్లో చూపించారనే  ఆరోపణలు వచ్చాయి. అయితే యూకో బ్యాంకుతో వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకున్న సీ కల్యాణ్ ఈ  భూమిని విడుదల చేయించుకున్నాడు.  తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను గతంలో ఖండించారు సి కల్యాణ్. తాను ఎవరి భూములను ఆక్రమించలేదని చెప్పారు. అయితే మూడేండ్ల కిందట దుమారం రేపిన భూ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వివాదాస్పద భూమిలో నిర్మాత సి కల్యాణ్ నిర్మాణాలు చేపట్టడంతో బాధిత నిర్వాసితులు చందా నగర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారని చెబుతున్నారు. 2017లో కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలతో సి కల్యాణ్ రాజీ కొచ్చారనే  నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.

 రేవంత్ రెడ్డికి పదవి కోసం కేసీఆర్ మొక్కులు! 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారట.. ఏంటీ తప్పుగా రాశారని  అనుకుంటున్నారా...  ఆరున్నర ఏండ్లుగా  పాలనలో తనకు  పక్కెలో బల్లంలా మారిన రేవంత్ రెడ్డికి ఉన్నత పదవి రావాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..  కాని ఇది అక్షరాల నిజం. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డికి పొలిటికల్ ప్రమోషన్ రావాలని  సీఎం కేసీఆర్  బలంగా కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి.  తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా ఉంది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన విజయం సాధించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతోంది. వరుస విజయాలతో  కమలం గూటికి చేరడానికి నేతలు క్యూ కడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న గ్రాఫ్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బీజేపీ దూకుడుతో కలవరపడుతున్న కారు పార్టీ అధినేత.. ఆ పార్టీ స్పీడ్ కు బ్రేక్ వేయడం ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమనే ఆలోచనకు వచ్చారట. తెలంగాణలో తమ పార్టీకి ఢోకా లేకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డికి కీలక పదవి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారని తెలుస్తోంది.   దుబ్బాక అసెంబ్లీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టమ్ నిర్వహించిన కేసీఆర్.. బీజేపీకి మంచి ఫలితాలు రావడానికి కాంగ్రెస్ బలహీనంగా ఉండటమే కారణమనే అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఇటీవల కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగింది. అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో అది బీజేపీకి ఫ్లస్ అవుతోంది. కేసీఆర్ ను ఓడించాలనే కసిగా ఉన్న ఓటర్లంతా అయిష్టంగానైనా బీజేపీ వైపు మళ్లుతున్నారని టీఆర్ఎస్ సమీక్షలో తేలిందట. కాంగ్రెస్ ఎలాగూ గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటేయడం కంటే బీజేపీకి వేస్తే టీఆర్ఎస్ ను ఓడించవచ్చని ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారు భావించారని, అలానే ఓటింగులో పాల్గొన్నారని కేసీఆర్ అంచనా వేశారని తెలుస్తోంది.  తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు 30 శాతానికి పైగానే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. అయితే దుబ్బాకలో పీసీసీ నేతలంతా గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రమించినా కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే భావనతో హస్తం సానుభూతి పరులు, కేసీఆర్ పని తీరుపై కసిగా ఉన్న జనాలంతా కమలానికి జై కొట్టారని  తేలింది. దుబ్బాకలో ఇలా దాదాపు 10 శాతం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లాయంటున్నారు. అక్కడ బీజేపీ గెలిచింది కేవలం వెయ్యి ఓట్లతోనే. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే.. ఆ పార్టీ ఓట్లు వారి అభ్యర్థికే పడితే.. దుబ్బాకలో టీఆర్ఎస్ దాదాపు 10 శాతం ఓట్లతో గెలిచేదని గులాబీ నేతల భావన. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కూడా దుబ్బాకలో ఇదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలవదు కాబట్టి.. ఆ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టేనని జనాల్లోకి తీసుకెళ్లింది. ఇది కూడా బీజేపీకి వర్కవుట్ అయిందని ఫలితాల తర్వాత తేలింది.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంక్  బీజేపీ వైపు వెళ్లిందని  స్పష్టమైంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ దాదాపు 26 శాతం ఓట్లు సాధించింది. ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ కేవలం 12 శాతం ఓట్లు సాధించింది. కాని ఈసారి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 35 శాతానికి పైగా ఓట్లు సాధించిన బీజేపీ.. 48 డివిజన్లు గెలుచుకుంది. బీజేపీకి అదనంగా వచ్చిన ఓట్లన్ని కాంగ్రెస్ తో పాటు టీడీపీవేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా, బీజేపీ హిందుత్వ నినాదం వినిపించినా గత ఎన్నికల కంటే గ్రేటర్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు తగ్గాయి. కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉన్న చోట బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ గెలిచిన ఉప్పల్, ఏఎస్ రావు నగర్ తో పాటు గట్టి పోటీ ఇచ్చిన గాజుల రామారంలో బీజేపీ అభ్యర్థులు బాగా వెనకబడ్డారు. ఈ లెక్కన కాంగ్రెస్ కొంత బలంగా ఉంటే గ్రేటర్ లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటకపోయేదని టీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్ అంచనాకు వచ్చారట.   తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంటనే బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయగలమనే భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఒకే పార్టీకి వెళుతుండటంతో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అదే ప్రజా వ్యతిరేక ఓటు చీలితే తమకు ఇబ్బంది ఉండదని గులాబీ బాస్ భావిస్తున్నారట. కాంగ్రెస్ బలంగా ఉంటనే టీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే భావనలో  ఉన్నారట. అందుకే రాష్ట్రంలో  రోజురోజుకు బలహీన పడుతున్న కాంగ్రెస్ బలోపేతం కావాలంటే టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.  మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే,  తమకు ఎదురు లేకుండా ఉండాలంటే కాంగ్రెస్ కనుమరుగు కావాలని కోరుకుంటున్న కమలం నేతలు.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావొద్దని బలంగా కోరుకుంటున్నారట. మొత్తంగా ఫైర్ బ్రాండ్ లీడర్ , మల్కాజ్ గిరి ఎంపీ  రేవంత్ రెడ్డిపైనే టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండటం ఆసక్తిగా మారింది. తెలంగాణ రాజకీయాలన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయనడానికి టీఆర్ఎస్, బీజేపీ ఆలోచనలే నిదర్శమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.     

చదువుతోంది సీఏ.. ఆధార్ నంబర్, నీటిచుక్కల సాయంతో ఘరానా మోసం  

వైరస్ లు రూపం మారుస్తున్నట్లే.. మన సమాజంలో మోసాలు కూడా కొత్త కొత్త రూపం మార్చుకుంటున్నాయి. నేరస్తుల కొత్త కొత్త క్రియేటివిటీ పోలీసులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలతో సామాన్య జనం హడలి పోతున్నారు. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఫొటో, నీటిచుక్కల సాయంతో తాజాగా పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.   ఏపీకి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి కొంత మంది నిందితులు భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫొటోలతో మధురానగర్ కు చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ లోని రూ. 10వేలు మాయం చేసారు. దీంతో బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపాయింట్ ద్వారా ఆ డబ్బును స్వాహా చేసినట్టు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు విశాల్, అర్షద్ లు సీఏ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

దేశంలో 20కి పెరిగిన కరోనా స్ట్రెయిన్ కేసులు! 

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కరోనా స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ కొత్త కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం వరకు కొత్త కరోనా కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండగా.. 24 గంటల్లోనే  మొత్తం 20 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం నాడు ఆరుగురికి కొత్త వైరస్ సోకిందని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, తాజాగా.. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ న్యూ స్ట్రెయిన్ కనిపించిందని స్పష్టం చేసింది. కోల్ కతా, పూణేలో ఒక్కో కేసు, బెంగళూరులో  7, హైదరాబాద్ లో  3, ఢిల్లీలో   2 కరోనా  స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.  నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యూకే నుంచి భారత్ కు వచ్చిన 33 వేల మందికి ఇప్పటి వరకు టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఇప్పటి వరకు 20 మందికి కరోనా సోకినట్లు కేంద్రం ఆరోగ్యశాఖ నిర్ధారించింది.  యూకే కరోనా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. జినోమ్ పరీక్షల దేశంలో 10 ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. కరోనా కొత్త వైరస్ సోకిన బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులను ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తోంది. కరోనా స్ట్రెయిన్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన వారందరిని  క్వారంటైన్ కు తరలిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కరోనా స్ట్రెయిన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.  రూపాంతరం చెందిన కరోనా  70 శాతం వరకూ వేగంగా వ్యాపిస్తున్నా.. పెద్దగా భయపడాల్సిందేమీ లేదని చెబుతున్నారు. కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పాటిస్తుంటే కొత్త వైరస్ కూడా సోకకుండా ఉంటుందని సీసీఎంబీ పేర్కొంది. మాస్క్ లు, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొత్త స్ట్రెయిన్ కు కూడా దూరంగా ఉండవచ్చని  సూచిస్తోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్  కొత్త స్ట్రెయిన్ ను కూడా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.    

 తప్పుడు వైద్యంతోనే కరోనాలో మార్పులు ? 

ఏడాది దాటినా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలను ఆగమాగం చేసిన వైరస్.. తాజాగా రూపు మార్చుకుని  మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  బ్రిటన్ లో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా స్ట్రెయిన్ .. అక్కడి నుంచి చాలా దేశాలకు పాకేసింది.  మన దేశంలోనూ మంగళవారం వరకే 20 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కరోనాతో ప్రపంచ దేశాల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త కరోనాతో  ఎక్కువ ప్రమాదం లేదని  వైద్య నిపుణులు చెబుతున్నా.. అది సోకే వేగమే ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.  వైరస్ లో  ఇలాంటి జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి చెబుతోంది.  కరోనాకు అందిస్తున్న తప్పుడు వైద్యం వల్లే వైరస్ జన్యు పరంగా ఉత్పరివర్తనం చెందుతోందని, లేని చికిత్సలు చేయడం వల్లే మార్పులు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ స్పష్టం చేస్తోంది.  బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా  తప్పుడు వైద్యం వల్ల వచ్చిందేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు. మామూలుగా వైరస్ లో మార్పులు జరుగుతూనే ఉంటాయని, కానీ  బ్రిటన్ వైరస్ విషయంలో మాత్రం వేగంగా వ్యాపించడమే కలవరపెడుతోందని అన్నారు. తప్పుడు చికిత్సలతో వైరస్ మీద రోగనిరోధక ఒత్తిడి పెరగడం వల్లే మార్పులు జరుగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులే మహమ్మారిలో ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నా.. శాస్త్రీయత లేని వైద్యం చేసి వైరస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మార్పులు జరుగుతాయన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ.  టీకాతో కరోనా రోగనిరోధకశక్తి పెరుగుతుందని, కాబట్టి వ్యాక్సినేషన్ను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని భార్గవ చెప్పారు. కరోనాకు ప్రస్తుతం తయారు చేస్తున్న వ్యాక్సిన్లన్నీ వైరస్లోని ఎస్ ప్రొటీన్ను లక్ష్యంగా పనిచేసేవనని, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లూ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ప్రస్తుతానికి వైరస్ మీద బాగానే పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్నందున కరోనా స్ట్రెయిన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఐసీఎంఆర్ డైరెక్టర్.     

రజనీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న అభిమానులు!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆయన అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం మూడేండ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు.. రజనీ ప్రకటనతో షాకయ్యారని తెలుస్తోంది. పార్టీ లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు రోడ్లపైకి వచ్చి  తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా తమ ఆరాధ్య హీరో రజనీ కాంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదని రజనీకాంత్ ప్రకటించిన వెంటనే.. వందలాది మంది ఆయన అభిమానులు పోయెస్ గార్డెన్ కు చేరుకుని, అక్కడ రోడ్డుపై కూర్చుని ధర్మా చేశారు. తిరుచ్చిలో అభిమానులు ఆగ్రహంతో తమ అభిమాన నేత దిష్టిబొమ్మను, అప్పటికే కట్టి ఉంచిన బ్యానర్లను దగ్ధం చేశారు. కన్యాకుమారి, మధురై, విల్లుపురం, కోయంబత్తూరు, వేలూరు తదితర ప్రాంతాల్లోనూ రజనీ అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.                      దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో కొంత శూన్యత వచ్చింది. అదే సమయంలో రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో  2017 డిసెంబర్‌ 31న రాజకీయ పార్టీపై ప్రకటన చేశారు రజనీకాంత్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి రజనీ అంటూ హడావుడి చేశారు. తర్వాత  మూడేళ్లు గడిచినా  పార్టీ ఏర్పాటుపై పురోగతి లేకపోవడంతో అభిమానులు మళ్లీ ఢీలా పడ్డారు. గత నవంబర్ 30న  రజనీ మక్కల్ మండ్రం సభ్యులతో  చర్చించి కొత్త పార్టీపై మరోసారి ప్రకటన చేశారు భాషా. డిసెంబర్ 31 పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.  దీంతో మరోసారి సంబరాలు చేసుకున్నారు రజనీకాంత్ అభిమానులు. డిసెంబర్ 31 పండుగ చేసుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే రాజకీయ పార్టీ లేదనే ప్రకటన రావడంతో రజనీకాంత్ అభిమానులు షాకయ్యారు. అందుకే తాము ఎంతగానే ఆరాధించే హీరో ఫోటోలనే ధ్వంసం చేస్తున్నారని చెబుతున్నారు. 

ఇవాళ, రేపు వీసారెడ్డి బిజీ అందుకేనట.. వైసీపీ ఎంపీపై బుద్ధా వెంకన్న సెటైర్ 

ఏపీలో ఇకపై కుక్కలను, పందులను పెంచుకోవాలనుకునేవారు గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలని జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. తాజాగా ఇదే విషయం పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఈ రోజు, రేపు, వీసా రెడ్డి బిజీగా ఉంటాడని, ఎవరూ కలవద్దు అని చెప్పారంట. ఏంటా అని ఆరా తీస్తే, తుగ్లక్ ప్రభుత్వం ఇచ్చిన కుక్కలు, పందుల లైసెన్స్ నిర్ణయం కోసం, తాడేపల్లి ప్యాలెస్ లో కట్టేసిన కుక్కలు, పందులకు లైసెన్స్ తీసుకునే పనిలో వీసా రెడ్డి బిజీగా ఉన్నాడని చెబుతున్నారు" అని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కానుకిచ్చినా  కోపమే! తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో చీలిక? 

వరాలు ప్రకటించినా ఉద్యోగుల విమర్శలెందుకు? కేసీఆర్ మాటలు అమలవుతాయన్న ఆశ పోయిందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పై నమ్మకం లేదని తెలుస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినా.. ఉద్యోగులు స్వాగతించకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కేసీఆర్ ప్రకటనను మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించడం టీఆర్ఎస్ వర్గాలను కూడా విస్మయపరుస్తోంది. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ ప్రకటన రాగానే.. ఉద్యోగ సంఘాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అధికార పార్టీ భావించిందట. కాని సీఎం ప్రకటన  వచ్చిన నిమిషాల్లోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో గులాబీ నేతలు షాకయ్యారని తెలుస్తోంది. సీఎం నిర్ణయాన్ని కొన్ని సంఘాలు మాత్రమే స్వాగతించగా.. మెజార్టీ ఉద్యోగ  సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులను మరోసారి మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయని తెలుస్తోంది.   ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షుడిగా  కమిటిని నియమించడం ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని, దానికి అనుగుణంగా వేతన సవరణ ఎంత చేయాలన్నది మంత్రివర్గం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే పీఆర్సీ కమిటీకి పెట్టిన రెండేండ్ల గడువు ముగిసినా ఇంత వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. రెండేండ్లుగా పీఆర్సీ కమిటీ చేయని పనిని ఇప్పుడు చీఫ్​ సెక్రటరీ నేతృత్వంలోని కొత్త కమిటీ చేస్తుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు  ఉండటంతో.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకే సీఎం కేసీఆర్  కొత్త  కుట్రకు తెరలేపారని కొన్ని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు  ఫిబ్రవరిలో ఎన్నికలు రానున్నాయి. ఎలాగూ ఎన్నికల కోడ్ వస్తది కాబట్టి.. ఆ పేరుతో తప్పించుకోవడం కోసం మరో నాటకం మొదలుపెట్టారనే విమర్శలు వస్తున్నాయి.  ఉద్యోగవర్గాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కమిటీలు, అధ్యయనాలతో కాలయాపన చేయరాదని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి డిమాండ్ చేశారు. వేతన సవరణ గురించే వేతన సవరణ కమిషన్​ వేశారని, రెండున్నరేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక సబ్మిట్​ చేయలేదని విమర్శించారు. కనీసం సబ్మిట్​ చేయని రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని నిర్ధిష్టంగా చెబుతూ మేనిఫెస్టోలో పెట్టారని, అలాంటి అంశంపై మళ్లీ చర్చ ఎందుకు, అధ్యయనం ఎందుకని సంపత్​ కుమారస్వామి ప్రశ్నించారు. ఈ అధ్యయనాలు, చర్యలు పూర్తి అయ్యేలోగా మళ్లీ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన కోడ్​, ఆ తర్వాత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ చివరకు నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల కోడ్​ వచ్చే అవకాశం ఉందన్నారు.   సీఎం కేసీఆర్  ఉద్యోగులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్  ఆరోపించారు. ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి  ఇస్తుంటే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నడని మండిపడ్డారు.  కేసీఆర్​ బహురూపుల వేషాలను ఇక ఎవరూ నమ్మరని, పగటి వేషగాళ్లు కూడా కేసీఆర్ ను చూసి నవ్వుకుంటున్నారని బండి సంజయ్​  కామెంట్​ చేశారు. ఆరేండ్ల నుంచి మాటలు చెప్తూ ఉద్యోగులను  కేసీఆర్​ మోసం చేస్తూనే వస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జీతాలు పెంచుతం, ఉద్యోగాలు భర్తీ చేస్తమనుకుంట కేసీఆర్ చేసిన ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే.. సీఎంను బజార్ లో నిలబెడ్తామన్నారు. కొంతకాలం మోసం చేయొచ్చేమోగానీ.. అందరినీ అన్నిసార్లు మోసం చేయలేమన్న విషయాన్ని సీఎం  గుర్తు తెచ్చుకోవాలన్నారు సంజయ్.

సీఎం జగన్ పాలనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు 

ఏపీ సీఎం జగన్ పరిపాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. "అయ్యా జగన్మోహన్‌రెడ్డి.. నువ్వు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే.. అది అప్పులు, అవినీతే" అంటూ సోము వీర్రాజు సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిన్న నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సీఎం అప్పులతో పాలన చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే గానీ, జగన్ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఒక్క ఇళ్ల స్థలాల పంపిణీకి 9వేల కోట్లు నిధులు కేటాయించి, అందులో సగం బొక్కేశారని ఆరోపించారు.   మరోపక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయిస్తే, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల 8 లక్షల ఇళ్లు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలోని ఎర్రచందనం స్మగ్లర్లు అంతా వైసీపీ నేతల అనుచరులేనని అయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకనూ దోపిడీ చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అందుకే వారంతా పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తమపార్టీ ఉద్యమం చేస్తుందని అయన చెప్పారు. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం విచిత్రమైన జీవో.. ఇది కదా పరిపాలనంటే..  

ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక విచిత్రమైన జీవో తీసుకొచ్చింది. కుక్కలు, పందులకు లైసెన్స్‌లు ఉండాలంటూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే యజమానికి రూ.500 ఫైన్‌తో పాటు రోజుకు రూ.250 రుసుము వసూలు చేస్తారని జీవోలో పేర్కొంది. ఒకవేళ ఎవరూ వాటి ఓనర్లుగా అంగీకరించకపోతే వాటిని కూడా వీధి కుక్కులు, పందులుగా పరిగణించి వాటికీ కుటుంబ నియంత్రణ చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. అంతేకాకుండా లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 10 రోజుల్లోగా వాటికి తిరిగి లైసెన్స్ పొందాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.   అంతేకాకుండా లైసెన్స్‌లు పొందే ముందు కుక్కలు, పందుల యజమానులు వాటికి సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్ కూడా అందజేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఇటు కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ అందచేయడం, అటు పందుల విషయంలో ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రభుత్వం అదేశించింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కుక్కలు, పందుల యజమానులకు టోకెన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. ఆ టోకెన్లను పెంపుడు జంతువుల మెడలో నిరంతరం వేలాడేలా చూడాలని ఆ ఆదేశాలలో పేర్కొంది.

ముంబై ఈడీ ఆఫీసుకు బీజేపీ పార్టీ బ్యానర్..

మహారాష్ట్రలో ఒకప్పటి మిత్రులైన బీజేపీ శివసేనల మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం నడుస్తున్నసంగతి తెల్సిందే. ఈ మాటల యుద్ధం తాజాగా ఒకరి పై మరొకరు ప్రత్యక్ష చర్యలకు దిగే పరిస్థితులలోకి దారి తీశాయి. శివసేన ఎంపీ సంజయ్‌‌ రౌత్‌‌ భార్య వర్షా రౌత్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఏకంగా బీజేపీ ప్ర‌దేశ్ కార్యాల‌య్ ( మహారాష్ట్ర స్టేట్ బీజేపీ ఆఫీసు) అంటూ ప్లెక్సీ క‌ట్టారు. అంతేకాకుండా ఈడీ, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు కూడా చేశారు.   పీఎంసీ బ్యాంకు సొమ్ము అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన విషయంపై శివ‌సేన మండిప‌డుతోంది. తమ పార్టీ నాయకులపై బీజేపీ ఈడీని ఉసిగొల్పుతుంద‌ని వారు ఆరోపించారు. మ‌హారాష్ట్రలోని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ కూట‌మిని కూల్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని, గత సంవ‌త్స‌రకాలంగా త‌మ‌ను బెదిరిస్తూనే ఉన్నార‌ని సంజ‌య్ రౌత్ ఆరోపించారు. బీజేపీ పాల్పడుతున్న ఇటువంటి కవ్వింపు చ‌ర్య‌ల‌కు శివ‌సేన భ‌య‌ప‌డదంటూ ఆధిత్య థాక్రే హెచ్చ‌రించారు.

మోడీ ఇలాఖాలో బీజేపీకి బిగ్ షాక్! 

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ గట్టి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి,  భరూచ్‌ లోక్‌సభ  సభ్యుడు మన్‌సుఖ్‌‌ భాయి వాసవ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు ఆయన లేఖ రాశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు వాసవ తెలిపారు. వాసవ రాజీనామా అంశంపై బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి భరత్‌ పాండ్యా స్పందించారు. ఆయన రాజీనామా లేఖ సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీకి అందిందన్నారు. మన్షుక్‌ భాయ్‌ తనతో మాట్లాడారని చెప్పారు. ఆయనో సీనియర్‌ ఎంపీ అని, వాసవ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.      గుజరాత్ లో బీజేపీ సీనియర్ నేతగా ఉన్న వాసవ ఆరు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాను లేవనెత్తిన సమస్యలపై పార్టీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. బీజేపీ  పనితీరుపైనా ఆయన కొంత కాలంగా  అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవలి తన నియోజకవర్గంలో పలు సమస్యలపైనా వాసన్ మాట్లాడారు. గత వారంలో ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వాసవ లేఖ రాశారు. నర్మదా జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్‌ జోన్లుగా ప్రకటించే నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకొనేలా పర్యావరణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  అయితే తన లేఖపై స్పందించలేదనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని భావిస్తున్నారు.  ‘‘పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాను. పార్టీ విలువల రక్షణకు కృషిచేశాను. అన్నింటికి మించి నేనో మనిషిని. తెలిసో తెలియకో మనిషి తప్పులు చేస్తాడు. నేను చేసిన తప్పు పార్టీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నా. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలుస్తాను. లోక్‌సభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను అందజేస్తా. నా నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి తెలియపరచండి’’ అని తన లేఖలో పేర్కొన్నారు మన్‌సుఖ్‌‌ భాయి వాసవ.   

రాజమండ్రి మహిళకు  కరోనాస్ట్రెయిన్‌! 

బ్రిటన్ ను వణికిస్తున్న కొత్త రకం వైరస్ కరోనా స్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటరైంది.  యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలిందని వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ అధికారికంగా ప్రకటించారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయింది.  కరోనా స్ట్రెయిన్ సోకిన మహిళ నుంచి మరెవరికీ వైరస్ వ్యాపించ లేదని  కాటమనేని భాస్కర్‌ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూకే స్ట్రెయిన్‌ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలులేవని , అపోహలను నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురికి స్ట్రెయిన్‌ సోకినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.   బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2, పూణేలో ఒక యూకే కరోనా కొత్త వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. యూకే నుంచి డిసెంబర్ 9 తర్వాత భారత్ కు 33వేల మంది ప్రయాణికులు వివిధ ఎయిర్ పోర్ట్ ల ద్వారా దేశానికి చేరుకున్నారు. వారిని ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు చేయగా..అందులో 114మందికి కరోనా సోకినట్లు తేలింది. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్ వచ్చిన ఈ 114 మందిలో ఎంతమందికి ఈ యూకే కరోనా కొత్తవైరస్ సోకిందో తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆరు ల్యాబొరేటరీలకు ఈ జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. అక్కడ పలు టెస్టుల్లో ఆరుగురికి యూకే కొత్త వైరస్ సోకినట్లు గుర్తించారు. అనంతరం ఆ ఆరుగురికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పిన కేంద్రం.., ఈ కరోనా కొత్తవైరస్ పై దేశంలోని అన్నీ రాష్ట్రాల్ని అప్రమత్తం చేసింది.  

పవన్ చిడతల నాయుడు.. మెడపై మట్టి నలుపుకుంటాడు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను చిడతల నాయుడు అని సంబోదిస్తూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో దిట్ట అని విమర్శించారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ చిడతలు కొట్టారని విమర్శలు గుప్పించారు. "నేను వైఎస్‌ఆర్‌కు భక్తుడిని. చచ్చిపోతూ కూడా వైఎస్‌ కుటుంబానికే భజన చేస్తా. డబ్బులు కోసం చిడతలు కొట్టే వాడిని కాదు." అని పేర్ని నాని అన్నారు.    ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. 2014లో పంటలు నష్టపోతే మీ జాయింట్ ప్రభుత్వం (టీడీపీ-బీజేపీ)తో ఎంత ఇప్పించావు..? ఏ అసెంబ్లీని ముట్టడించావ్..? అని ప్రశ్నించారు. నువ్వు, నీ పార్టనర్ కలిసి ఇచ్చినదానికంటే ఎక్కువే ఇస్తున్నాం అన్నారు.   గుడివాడ పర్యటనలో భాగంగా నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఎవరు?.. మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయనేనా పవన్ అంటే అని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఈయన ఎప్పుడు వకీల్ అయ్యాడు..? ఏ యూనివర్శిటీలో వకీల్ చదివాడు..? అని ఎద్దేవా చేశారు. "జనం పవన్‌ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పవన్‌ది అంతా సెట్టింగ్‌లు, ప్యాకప్‌లు వ్యవహారమే" అంటూ పవన్‌ పై మంత్రి విరుచుకుపడ్డారు.