సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నేతల గన్ ఫైట్
posted on Jan 2, 2021 @ 9:47AM
ఏపీ సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల కారణంగా ప్రతి రోజు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ఒక పక్క సీఎం జగన్ అనేక కొత్తకొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. మరో పక్క జగన్ ఎంత మొత్తుకున్నా అయన పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట అయితే ప్రతిపక్షాలతో లేదంటే సొంత పార్టీ నేతలతో ఘర్షణలకు దిగడంతో ప్రజలలో పార్టీ చులకన అవుతోంది.
తాజాగా సీఎం సొంత జిల్లా అయిన కడప వైసీపీలో వర్గపోరు రాజుకుంది. అక్కడ వైసీపీ లోని రెండు గ్రూపులు నువ్వెంతంటే నువ్వెంతంటూ ఒకరిపై మరొకరు రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. కడపజిల్లా కమాలాపురం నియోజకవర్గం వీరపనాయునిపల్లి (మం) పాయసంపల్లి వైసీపీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసే విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ముదిరి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో వైసీపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు.
పాయసం పల్లికి చెందిన వైసీపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసేందుకు సిద్దపడగా.. వైసీపీలోని మరో వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ రెడ్డి పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పోస్ట్ చేశారు. వైసీపీకి చెందిన మరో వర్గానికి చెందిన మహేశ్వరరెడ్డి ఈ పోస్టింగ్‌పై ఫోన్ చేసి సుధాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. "మనకు కొత్త సంవత్సరం..ఉగాది కదా! జనవరి ఒకటి కాదు కదా" అని గట్టిగా అడిగారు. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అని.. ఇద్దరూ ఫోన్‌లోనే హెచ్చరించుకొన్నారు. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మహేశ్వరరెడ్డి వర్గీయులు.. సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతడి వర్గీయులపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగిరెడ్డికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి వర్గీయులను కంట్రోల్ చేయడానికి సుధాకర్‌రెడ్డి తన లైసెన్స్ గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గాయపడిన వారికి చికిత్స అందుతోంది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.