రామతీర్థంలో హై టెన్షన్.. విజయసాయి కారుపై దాడి.. చంద్రబాబు ఎంట్రీ!!
posted on Jan 2, 2021 @ 2:37PM
విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగాన్ని తలపిస్తోంది. రాజకీయనేతల పర్యటనతో రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటనల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు రామతీర్థానికి భారీగా చేరుకున్నారు. వీరితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. దీంతో రామతీర్థం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
రామతీర్థం పర్యటనలో ఎంపీ విజయసాయిరెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారుపై నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయనతో పాటుగా అనేక మంది కార్యకర్తలు కూడా కొండమీదకు వెళ్లారు. అయితే, కొందరు కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొని కొండమీదకు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ జెండాలతో ఎలా వెళ్తారని బీజేపీ, టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ సమయంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు విజయసాయి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో విజయసాయి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన తర్వాత విజయసాయి మరో కారులో వెళ్లారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. మార్గమధ్యంలో అడ్డంకులు ఎదురైనా, ఎట్టకేలకు చంద్రబాబు రామతీర్థం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. అంతకుముందు రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కాన్వాయ్ లోని టీడీపీ నేతల మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. తాము కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతించాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఎట్టకేలకు వారిని కూడా అనుమతించడంతో రామతీర్ధం చేరుకున్న చంద్రబాబు గుడిని పరిశీలించారు. కాగా, రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు.