అశోక్ టార్గెట్ గానే విగ్రహం ధ్వంసం? జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యం?
posted on Jan 3, 2021 @ 12:44PM
విజయనగరం జిల్లా రామతీర్థంలోని ప్రసిద్ధ రామాలయంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. విగ్రహం ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తుండగా.. జగన్ సర్కార్ తీరుతో ఆ అనుమానం నిజమేనని బలపడుతోంది. టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టార్గెట్ గానే అధికార పార్టీ డైరెక్షన్ లోనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. విగ్రహం ధ్వంసం ఘటనను సాకుగా చూపుతూ ఆయన్ను ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించింది జగన్ సర్కార్. రామతీర్థంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్ట్ ల నుంచి ఆయన్ను తొలగిస్తూ హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అశోక్ గజపతి రాజును పదవి నుండి తప్పించడానికి రాములోరి తల నరికారా.. అందుకే పదవి నుండి తప్పించారా అన్న చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపునకు పరాకాష్టగా, జగన్ రెడ్డి నియంత పాలనకు సాక్ష్యంగా రామతీర్థం ఘటన నిలుస్తోందని చెబుతున్నారు.
రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ గా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు పూసపాటి అశోక్ గజపతి రాజు. రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతిరాజు పూర్వీకులు ఆలయ ధూపదీప నైవేద్యాలకు తమ ఏలుబడిలోని 12 గ్రామాలను కేటాయించారు. విజయనగరం సంస్థానంలోని 105 దేవాలయాల నిర్మాణం, పోషణ పూసపాటి వంశీకులదే. వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతి రాజును టార్గెట్ చేశారు. ఇప్పటికే అశోక్ ను ప్రతిష్ఠాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది ఏపీ సర్కార్. తాజాగా మూడు దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సర్కార్ తీరుతో అశోక గజపతి రాజును రామతీర్థం ట్రస్ట్ చైర్మెన్ పదవి నుంచి తొలగించేందుకే ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారనే చర్చ జరుగుతోంది.
ఇందుకు బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాకా ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా గుడుల్లో విగ్రహాలు ధ్వంసం చేయడమే, హుండీలు పగలగొట్టడమే, విగ్రహాలు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయి. అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గ అమ్మవారి వెండి రథం సింహాలు మాయం వంటి ఘటనలు జరిగాయి.అయితే ఆలయాలపై దాడులు జరుగుతున్నా జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించలేదు. ఎవరిపైనా చర్య తీసుకోలేదు. 150 ఆలయాలపై దాడులు జరిగితే.. ఏ గుడి చైర్మెన్ ను తొలగించలేదు. కాని రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో మాత్రం విచారణ జరుగుతుండగానే ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఆదేశాలివ్వడంతో.. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందనే అనుమానం బలపడుతోంది.
అంతేకాదు విగ్రహం ధ్వంసం ఘటన తర్వాత రామతీర్థం ఆలయ అధికారులు, స్థానిక పోలీసుల తీరు కూడా వివాదాస్పందగానే ఉంది. వైసీపీ నేతలను కొండపైకి అనుమతిస్తూ.. ఇతర పార్టీల నేతలను అడ్డుకున్నారు. శనివారం కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండ పైకి ఎక్కారు. విజయసాయిని ఆలయ అధికారులు ఆయనను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయంలో ఆయన పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు కొండ పైకి ఎక్కారు. అయితే చంద్రబాబు గుడిలోకి వెళ్లకుండా అధికారులు తాళం వేశారు. చంద్రబాబు గుడి వద్దకు చేరుకుంటారనగా అధికారులు తాళం వేయడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఘటనాస్థలిని పరిశీలిస్తే.. నిజాలు భయటపడుతాయనే భయంతోనే అధికార పార్టీ ఇలా వ్యవహరించిందని చెబుతున్నారు. ఎంపీని గర్భగుడిలో తీసుకెళ్లి.. ప్రతిపక్ష నేత చంద్రబాబును విచారణ పేరుతో అడ్డుకోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఆలయాలపై దాడులు జరుగుతున్నా నివారించలేని దేవాదాయ శాఖకు దద్ధమ్మ మంత్రిగా మిగిలిపోయిన వెల్లంపల్లి శ్రీనివాస్... నోటి దూలతో ఆ పదవికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. రామతీర్థం ఘటనపై మరోసారి దిగజారి వ్యాఖ్యలు చేశారు వేస్ట్ మినిస్టర్ వెల్లంపల్లి. రాములవారి విగ్రహం తల పగులగొట్టిన వెధవను చైర్మన్ గా ఉంచాలా? అంటూ మండిపడ్డారు. అశోక గజపతి రాజును ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గాడిదకేం తెలుస్తుంది గంధం వాసన అంటూ మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గారి వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరిచిప్పలు కొట్టేసే దొంగకి మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుందని చురకలంటించారు. నీతికి, బూతుకు తేడా తెలియనివాడి నోటి నుంచి అంతకంటే మంచి భాష ఎలా వస్తుందని కౌంటరిచ్చారు నారా లోకేష్. మాన్సాస్ ట్రస్టు ద్వారా 14కి పైగా విద్యాసంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రీ మంత్రీ తెలుసుకో! అంటూ హితవు పలికారు నారా లోకేష్.
పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా అశోక్ గజపతిరాజు గారిని అందరూ గౌరవిస్తారు. వాళ్ల అమ్మాయికి కరీంనగర్ లో మెడిసిన్ సీట్ వస్తే మంత్రిగా ఉండి , మార్పించుకునే అవకాశం వున్నా ఒప్పుకోకుండా వచ్చిన ర్యాంక్ కి అక్కడే చదవాలి అని ఆయన చదివించారు. ఆంధ్ర యూనివర్సిటీ కి, విజయనగరం మహారాజా కళాశాలకు వందల ఎకరాలు ఇచ్చిన కుటుంబం పూసపాటిది. అవినీతి మరకలు లేని హుందాగా దేవాలయాల ధర్మ కర్తగా వ్యవహరించే అశోక గజపతి రాజును వెధవ అని సంభోదించిన వెల్లంపల్లిపై ఆయన నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి గారి నోటిదురుసుతనానికి సిగ్గుపడుతూ, పెద్దరికాన్ని, గౌరవాన్ని మరిచిపోయేలా చేసిన పదవి శాశ్వతం కాదని, విజయవాడ పరువు నిలిపేలా, అందరు మెచ్చుకునేలా వ్యవహార శైలి ఉండాలని, వయసుని గౌరవించటం నేర్చుకోవాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ నేతలు రామతీర్థం ఘటనలోనూ తమ రాజకీయ కుట్రను బయటపెట్టుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయకుండా.. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవధర్ , అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎప్పటిలానే చంద్రబాబుపై పడ్డారు. రామతీర్థం ఘటనపై మాట్లాడకుండా.. టీడీపీలో హయాంలో కూల్చేసిన గుడుల గురించి ప్రస్తావించి తమ జగన్ భక్తీ చాటుకున్నారు. బీజేపీ నేతల తీరుపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్రం నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న గుడులను తొలగించారని విష్ణువర్దన్ రెడ్డికి తెలియదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర సర్కార్ నిర్మాణాన్నే వ్యతిరేకిస్తున్నారా అని నిలదీస్తున్నారు. జగన్ సర్కార్ కు ఇబ్బంది కాకుండా, చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఏపీ బీజేపీ కేడర్ నుంచి కూడా వస్తున్నాయి.