రాముడికే రక్షణ లేని రాష్ట్రం.. వ్యవస్థలు ఏమైపోయాయి.. చినజీయర్ స్వామి
posted on Jan 2, 2021 @ 9:49AM
ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 160కిపైగా ఆలయాలలో ఈ తరహా దాడులు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహం తల వేరు చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మరోపక్క నిన్న రాజమహేంద్రవరంలో సుబ్యహ్మణ్యేశ్వర స్వామి చేతులను విరిచేసిన ఘటన చోటు చేసుకుంది. ఇంతకూ ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఈ తాజా ఘటనలు అందరి మనసులను కలచివేస్తున్నాయి. అంతేకాకుండా ఆలయాలపై వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో దుండగులు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి అసలు ఈ ఘటనలకు కారకులు ఎవరు ?ఎందుకు చేస్తున్నారన్న దానిపై ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. మరో పక్క ఈ ఘటనలపై భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు. హిందువులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించవలసిన ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు.
తాజాగా రామతీర్థం ఆలయ ఘటనపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. ఆలయాల్ని పరిరక్షించే బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. అక్కడి ఆలయాన్ని.. అలాగే రాముల వారిని ఆసరాగా చేసుకుని ఓ వ్యవస్థ ఉందని… వారంతా ఏమైపోయారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నవారు.. రక్షించాల్సిన వారు ఎందుకు నిమిత్తమాత్రులుగా మారారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో ప్రశ్నించడానికి భక్తులు ఏమాత్రం భయపడకూడదని ఆయన అన్నారు. వ్యవస్థలు విఫలమైనప్పుడు తప్పకుండా ప్రశ్నించాలని.. భక్తులకు ఆయన పిలుపునిచ్చారు. మన కోసం స్వయంగా వైకుంఠ వాసుడు.. శ్రీరామచంద్రుడిగా దిగి వచ్చారని.. అలాంటప్పుడు ఆయన బాగోగులు మనం తప్పకుండ చూసుకోవాల్సిందేనన్నారు. ఎందుకంటే.. విగ్రహ రూపంలో ఆయన అక్కడ ఉన్నది మన బాగోగులు చూడటానికేనని అయన గుర్తు చేశారు.
ఇది ఇలా ఉండగా రామతీర్థం ఘటనపై చినజీయర్ స్వామి తాజా స్పందన గమనిస్తే ఈ దాడి ఆయనను ఎంత తీవ్రంగా కలచి వేసిందో స్పష్టమౌతోంది. సాధారణంగా ఇటువంటి అంశాలపై చినజీయర్ స్వామి మాట్లాడితే రాజకీయం చేసే ప్రమాదం ఉంది. తాజాగా రామతీర్థం వ్యవహారం ఉన్మాద స్థాయికి చేరడంతో.. ఇక ఉపేక్షిస్తే.. ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశం ఉండడంతో అయన సున్నితంగా తన స్పందన తెలియచేసారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం తెలంగాణలో ఉండిపోవడంతో… ఏపీలో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ చేయాలన్న చర్చ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం కడపలోని ఒంటిమిట్ట ఆలయంతో పాటు.. విజయనగరం జిల్లాలోని కొన్ని శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం ఆలయాన్ని కూడా పరిశీలించింది. వివిధ రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఒంటి మిట్టను నవమి వేడుకలకు ఎంపిక చేసుకున్నప్పటికీ.. రామతీర్థం ఆలయానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. తాజాగా ఆ ఆలయంపైనే కొందరు ముష్కరులు గురి పెట్టారు. ఇది ఇలా ఉండగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని హిందూత్వంపై జరుగుతున్న దాడిగా.. మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న కొంత మంది స్వామిజీలు మాత్రం కనీసం స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు. కేవలం రాజకీయ ప్రకటనలు చేయడానికి పరిమితమైన కొందరు స్వాములు గుడ్డిగా ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు.