మళ్లీ ఫ్యాక్షన్ పడగలోకి రాయలసీమ? అరాచకాలకు అడ్డాగా జగన్ రెడ్డి పాలన ?
posted on Jan 2, 2021 @ 10:21AM
మూడు మర్డర్లు.. ఆరు అటాక్ లు.. తొమ్మిది దొమ్మీలు. ఇదీ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి. ఫ్యాక్షన్ పడగలో, కక్ష్య రాజకీయాలతో తల్లడిల్లింది ఆ సీమ. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ లబ్ది కోసం ఫ్యాక్షన్ ను పెంచి పోషించారు అక్కడి నేతలు. దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశంతో రాయలసీమ ఊపిరి పీల్చుకుంది. ఎన్టీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, అభివృద్ధి నినాదంతో
రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంత సీమగా మారిపోయింది. తర్వాత చంద్రబాబు పాలనలోనూ రాయలసీమలో ఫ్యాక్షన్ ను చోటు లేకుండా పోయింది. హత్యా రాజకీయాలు మాని అభివృద్ధి కోసం పని చేశారు ప్రజా ప్రతినిధులు. అయితే కొన్ని రోజులుగా రాయలసీమలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జగన్ రెడ్డి పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ నీడలోకి వెళ్లింది. అధికార పార్టీ నేతలు బరి తెగింపుతో సీమలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రజలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దాడులకు తెగబడుతున్నారు. హత్యలకు పాల్పడుతూ జనాల్లో భయాందోళన స్పష్టిస్తున్నారు.
కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం.. ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి. రోజూ ఏదో ఒక చోట ప్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ కక్షలతోనే .. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. దీంతో ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని జీవించాల్సిన పాత రోజులు రాయలసీమలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పట్టపగలే జరిగిన టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యక్రమంలో ఇళ్ళపట్టాల పంపిణీ వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్న సుబ్బయ్యను రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాత్రను, అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పోలీసులు అక్కడ ఉండగానే.. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించవచ్చు.
అనంతపురం జిల్లా వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. పోలీసుల అండతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చిలో కూర్చొని హంగామా చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి ఘటనే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని చెబుతున్నారు. గతంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగినా.. ఇలా ఒక ఎమ్మెల్యే వందలాది మందిని తీసుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ఎప్పుడు జరగలేదంటున్నారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో దళిత జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపైనే దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జగన్ రెడ్డి పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయింది. తాము చెప్పినట్లు వినకపోతే అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. బెదిరించి వారిని దారిలోకి తెచ్చుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు జరుగుతూనే ఉండగా.. తాజాగా గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి.. కరెంట్ బిల్లు కట్టమన్న లైన్ మైన్ పై తీవ్రంగా కొట్టడం దుమారం రేపింది. ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో వైసీపీ నేత పేరు డీఫాల్ట్ లిస్టులోకి వెళ్లిపోయింది. లైన్ మైన్ కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో లైన్ మెన్ ను ఇంటికి పిలుపించుకుని మరీ కొట్టాడు వైసీపీ నాయకుడు.
రాయలసీమలో జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ్లీ పాత రోజులు వచ్చాయని వారంతా భయపడుతున్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలే విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ భయానక పరిస్థితులు నెలకొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.