పులులు, సింహాలు కాదు విధేయులు కావాలి! రేవంత్ టార్గెట్ గా మరో లేఖ
posted on Jan 2, 2021 @ 1:41PM
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు మరింత ముదురుతోంది. పార్టీలో ఏకాభిప్రాయం కోసమే టీపీసీసీ చీఫ్ ఎన్నికను హైకమాండ్ ఆలస్యం చేస్తుందని కొందరు చెబుతుండగా.. పీసీసీ ఎంపిక ఆలస్యమయ్యే కొద్ది పార్టీలో విభేదాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిపై హైకమాండ్ కు మరో లేఖ రాశారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి. కాంగ్రెస్ కు కావాల్సింది పులులు , సింహాలు కాదని... అందరిని కలుపుకొని పార్టీకి విధేయులుగా ఉండే నాయకత్వం కావాలని లేఖలో సోనియా ,రాహుల్ గాంధీలను కోరారు జగ్గారెడ్డి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పార్టీకి ఇబ్బందిరకరంగా ఉందని తెలిపారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి 25 మందితో కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించాలని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోరాడేందుకు విడివిడిగా కమిటీలు వేయాలని.. వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించాలని కోరారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయాలన్నారు జగ్గారెడ్డి. ఈ ప్రతిపాదనలో తనకు ఎలాంటి స్వార్థం లేదని...సాగర్‌లో కాంగ్రెస్ గెలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని చెప్పారు. తాను పరిమితి దాటి మాట్లాడితే క్షమించండి అంటూ జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.
పీసీసీ రేసులో ముందున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టార్గెట్ గా మరోసారి హైకమాండ్ కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే ప్రచారాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు జగ్గారెడ్డి. తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే పదవి ఇవ్వాలనే చర్చను తీసుకొచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఖాయమనే సంకేతాలు రావడంతో.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సాకుగా చూపి కొంత కాలం వాయిదా వేయించే ప్రయత్నాలను జగ్గారెడ్డి చేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.