ఉత్తమ సర్పంచ్ చెత్త పని..
posted on Mar 6, 2021 @ 12:04PM
అవినీతికి కాదెవరు అనర్హం అన్నట్లుగా తయారైంది మనదేశంలో పరిస్థితులు. ప్రతి నిత్యం సర్కార్ తో ఎదో ఒక పని పడే సామాన్యుడు.. అధికారులు, నేతలు చేస్తున్న లంచాల డిమాండ్లతో తల పట్టుకొంటున్నాడు. తాజాగా ఒక ప్రభుత్వ అనుమతి కోసం వచ్చిన ఒక పౌరుడిని స్థానిక సర్పంచ్ లంచం డిమాండ్ చేసాడు. తనకు ఉన్న భూమిలో ఒక కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి ఒక వ్యక్తి నుండి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌పాషా కుటుంబానికి మన్నెగూడ పంచాయతీ పరిధిలోని వికారాబాద్ రోడ్డుపై 200 ఎకరాల భూమి ఉంది. అయితే రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో.. ఒక కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అదే సమయంలో స్థానిక పంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. దీనికోసం రూ. 20 లక్షలు లంచం ఇస్తేనే కావలసిన అనుమతి ఇస్తానంటూ సర్పంచ్ వినోద్‌గౌడ్ చెప్పాడు. దీంతో సాజిద్‌పాషా ఏసీబీని ఆశ్రయించారు. నగర శివార్లలో ఉన్న హైదర్‌షాకోట్‌లోని ఆరెమైసమ్మ ఆలయం వద్ద డబ్బు అందజేస్తానని సర్పంచ్‌కు కబురు పెట్టారు. ఆ ఆలయం వద్ద కారులో తెచ్చిన రూ. 13 లక్షలు వినోద్‌గౌడ్‌కు అందజేశారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వినోద్‌గౌడ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా అధికారులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అధికారులు అతడిని వెంబడించి మరీ పట్టుకుని కెమికల్ పరీక్షలలో పాజిటివ్ రావడంతో, అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా ఏసీబీ అరెస్టు చేసిన వినోద్‌గౌడ్ గతంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకోవడం కొసమెరుపు.