నెంబర్ 2నే విన్నర్! మండలి లెక్కే వేరప్పా...
posted on Mar 6, 2021 @ 12:57PM
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్ గా మారాయి. గతంలో ఎప్పుడు లేనంత హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్.. ఇతర ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఓటరు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే బరిలో ఎంతమంది ఉంటే అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు. 79 మంది పోటీలో ఉంటే.. ఒకటి నుంచి 79 వరకు ప్రాధాన్యత ఓట్లు వేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ఖరారు చేసేది కూడా భిన్నమే. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వస్తేనే.. గెలిచినట్లు ప్రకటిస్తారు.
తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం ఓట్లు రాకపోతే.. చివరి నుంచి ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అలా.. ఎవరో ఒకరికి 50 శాతం ఓట్లు వచ్చేవరకు ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూనే ఉంటారు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఓటుతో పాటు రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు అత్యంత కీలకం. ప్రస్తుతం జరుగుతున్న నల్గొండ, హైదరాబాద్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటే కీలకంగా మారింది. అభ్యర్థులు కూడా దీనిపైనే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు కోదండరామ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లు రెండో ప్రాధాన్యత ఓట్లనే నమ్ముకుని విజయంపై ఆశలు పెట్టుకున్నారు.
నల్గొండ స్థానంలో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా రాములు నాయక్ బరిలో ఉన్నారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ తో పాటు చెరుకు సుధాకర్, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమాదేవిలు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు గట్టిగా పోరాడుతున్నారు. ఇంతమంది రేసులో ఉన్నారు కాబట్టి.. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి 50 శాతం ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఇదే ఇప్పుడు కోదండరామ్ కు కలిసివస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న కోదండరామ్ పై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో సానుకూలత కన్పిస్తోంది. అదే సమయంలో వివిధ పార్టీల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు కూడా ఆయనపై వ్యతిరేకత లేదు. దీంతో వారంతా తమ పార్టీ అభ్యర్థులకు తొలి ఓటు వేసి.. రెండో ప్రాధాన్యత ఓటును కోదండరామ్ కు వేయవచ్చని భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్న, చెరుకుకు మద్దతుగా ఉంటే ఓటర్లు కూడా రెండోప్రాధాన్యత ఓటును కోదండరామ్ కు వేయవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన నల్గొండ సీటులో రెండో ప్రాధాన్యత ఓటుతో కోదండరామ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
హైదరాబాద్ స్థానంలోనూ నల్గొండ లాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుస్తాననే ధీమాలో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి దివంగత ప్రధాని పీవీ కూతురు వాణిదేవీ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచంద్రరావు బరిలో ఉన్నారు. ముగ్గురు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓటులో ఒక్కరికే 50 శాతం ఓట్లు రావడం దాదాపుగా అసాధ్యం. అయితే వివిధ పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే పట్టభద్రులు.. రెండో ప్రాధాన్యత ఓటును నాగేశ్వర్ కు వేయవచ్చని భావిస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచి గెలిచిన నాగేశ్వర్.. రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారు. గత ఎన్నికల్లో రామచంద్రరావు కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే గట్టెక్కారు. అందుకే తన ప్రచారంలో రెండో ప్రాధాన్యత ఓటు పై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు నాగేశ్వర్.
మరోవైపు తమకు రెండో ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో అధికార పార్టీ తొలి ఓటుపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల మద్దతు తీసుకునేందుకు.. మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన రహస్య సమావేశాలు నిర్వహిస్తూ.. ప్యాకేజీలు ప్రకటిస్తున్నారనే చర్చ జరుగుతోంది. తమ అభ్యర్థులు ఓడిపోతే.. పీఆర్సీ అతి తక్కువగా ఇస్తామంటూ ఉద్యోగులను అధికార పార్టీ నేతలు బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా అన్ని పార్టీలకు సవాల్ గా మారిన మండలి ఎన్నికల్లో పట్టభద్రుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరీ...