జగన్ రెడ్డికి చిప్పకూడే!
posted on Mar 11, 2021 9:27AM
కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. మహా శివరాత్రి రోజున కొల్లు రవీంద్రను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. మంచి సీఎం రాష్ట్ర అభివృద్ధితో ఆనందాన్ని పొందుతాడని... మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోడికత్తి జగన్ రెడ్డి, తాపీకత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరని అన్నారు నారా లోకేష్. తమరు ఎంత అణచినా ఉప్పెనలా టీడీపీ సైన్యం తమపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. అధికార మదంతో వైసీపీ నేతలు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి అని నారా లోకేష్ హెచ్చరించారు.
బీసీ నేతలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొల్లు రవీంద్ర అరెస్టు బీసీలపై కక్ష్య సాధింపులకు నిదర్శనమన్నారు. జగన్ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలపై కక్ష్య సాధింపులు ఏవిధంగా ఉన్నాయో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. శివరాత్రి పర్వదినం రోజున కూడా టీడీపీ నేతలను అరెస్టులతో వెంటాడుతున్నారని మండిపడ్డారు. తన కుటుంబంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న జగన్ రెడ్డి మరో వైపు టీడీపీ నేతల్ని అరెస్టులు చేయించి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు
మరోవైపు కొల్లు రవీంద్ర అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం జరిగిన మున్సిపల్ పోలింగ్ సందర్భంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు, పోలీసులపై దౌర్జన్యం చేశారంటూ కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో గురువారం ఉదయం కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు.