బీజేపీలోకి జగన్ మాజీ సలహాదారు..!
posted on Mar 10, 2021 @ 4:45PM
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజుల క్రితం వరకు సీఎం జగన్ వద్ద అత్యంత కీలక పదవిలో ఉన్న ఆ మాజీ ఐఏఎస్ అధికారి త్వరలో పొలిటికల్ ఏంటి ఇవ్వనున్నారని సమాచారం. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు కేంద్రంలో పని చేస్తున్న అయన రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటూ ప్రభుత్వానికి పలు కీలక అంశాలపై తన సలహాలు ఇచ్చారు. అత్యంత క్లిష్టమైన కరోనా వ్యాప్తి సమయంలో కూడా అయన ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను భుజాన వేసుకుని ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే ప్రయతం చేసారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ హఠాతుగా సీఎం జగన్.. ఆ అధికారి నుండి కొన్ని బాధ్యతలను తప్పించడంతో ఆయన మనస్తాపంతో తప్పుకున్నారు.
అక్కడి నుండి బయటకు వచ్చిన అయన తరచుగా తన ట్వీట్లతో ఎపి సర్కార్ పై పరోక్షంగా దాడి చేస్తున్నారు. ఆయనే మాజీ ఐ ఏ ఎస్ అధికారి పీవీ రమేష్. అయితే అయన ఒక్కసారిగా ఇలా తన ట్వీట్లతో జగన్దా సర్కార్ పై దాడి చేయడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. బీజేపీలో చేరాలని ఆయనకు ఆహ్వానం అందడంతోనే ఆయన ఇలాంటి వ్యాఖలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. పరిస్థితులు కలిసి వస్తే త్వరలో ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలో బీజేపీకి సరైన నేతల కొరత తీవ్రంగా ఉంది. ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎపి బీజేపీపై అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా సమాచారం దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారులను పార్టీ లోకి ఆహ్వానించి వారితో పోటీ చేయించాలని ప్రయత్నిస్తునట్లుగా తెలుస్తోంది. ఈ వ్యూహాంతోనే మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులును ఎపుడో పార్టీలోకి తీసుకున్నారు. త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో ఆయనే అభ్యర్థిగా దింపుతున్నట్లు బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు జగన్ సర్కార్ లో చాలా కీలకంగా పని చేసిన మాజీ ఐఏఎస్ పివీ రమేష్ సడెన్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా అనే విషయంపై వైసిపి వర్గాలు ఆరా తీస్తున్నాయి . తాజాగా అయన వరవరరావును ఉటంకిస్తూ "నేరమే అధికారం అయితే..అది ప్రజలను వెంటాడుతుంది. ఊరక కూర్చున్ననోరున్న వాడూ నేరస్థుడే" అంటూ చేసిన ట్వీట్ పై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే దీనిపై అయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. అసలు కారణం మాత్రం బీజేపీ నుండి వచ్చిన ఆహ్వానం ప్రభావమేనని సమాచారం.