సీఎం మమతకు తీవ్ర గాయాలు!
posted on Mar 11, 2021 @ 11:25AM
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి ఘటన పశ్చిమ బెంగాల్ లో దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు . అయితే బీజేపీ నేతలు మాత్రం మమతపై ఎలాంటి దాడి జరగలేదని, ఎన్నికల్లో లబ్ది కోసమే ఆమె డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బెంగాల్ కాంగ్రెస్ నేతలు కూడా దీదీ రాజకీయ ఎత్తులు వేస్తున్నారని మండిపడుతున్నారు. నందిగ్రామ్ నుంచి సాయంత్రమే కోల్ కతా వచ్చిన మమతా బెనర్జీ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
దాడి ఘటనపై రాజకీయ రగడ సాగుతున్న సమయంలో మమతపై ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. మమతా బెనర్జీ ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. అంతేకాదు ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు తెలిపారు. మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చారు వైద్యులు. మమత ఆరోగ్య పరిస్థితిపై టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. ఇప్పటికే ఆమెపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ డీజీపీని సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిచింది.
మరోవైపు మమత తనపై దాడి జరిగిందని చెబుతున్న ప్రాంతంలో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం అసలు ఆమెకు అక్కడ ఏమీ కాలేదని చెబుతున్నారు. స్థానిక విద్యార్థి సుమన్ మైతీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కారులో ఇక్కడకు వచ్చిన సమయంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మమతను ఎవరూ తోయలేదని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయినట్లు అనంతరం తెలిసిందని, ఆ సమయంలో ఆమె కారు మెల్లిగా కదులుతూ ముందుకు వెళ్లడాన్ని చూశానని చెప్పాడు.