బాబాయ్ పై గొడ్డలి వేటు ఎవరిదో?
posted on Apr 3, 2021 @ 2:41PM
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ తెలుగు దేశం పార్టీ తీసుకున్న నిర్ణయంపై సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ్ముళ్లు విరుచుకుపడ్డారు. ఘాటుగా కౌంటరిచ్చారు. విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. "ఏ2 దొంగ రెడ్డీ... బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?" అంటూ ప్రశ్నించారు. "పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం అంటూ కాలర్ ఎగరేస్తున్న ఏ1 వలలు, బారికేడ్లు, 1000 మంది పోలీసుల కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమవుతోంది" అని ఎద్దేవా చేశారు. "సీబీఐ వాళ్లు వస్తున్నారట... హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!" అంటూ చివర్లో చురకేశారు అయ్యన్నపాత్రుడు.
గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి వారు ఎన్నికల్ని బహిష్కరించారని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. వాళ్లు కార్యకర్తల్ని కాపాడుకొని సీఎంలు అయ్యారని ఏ2 విజయసాయిరెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మీ ఏ1 కూడా అసెంబ్లీని రెండేళ్లు బహిష్కరించిన విషయం మరిచారా?, విజయసాయికి దొంగ లెక్కలు తప్ప చరిత్ర జ్ఞానం ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుసన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దొంగ, పోలీసు ఒక్కటయ్యారని చిన్న రాజప్ప విమర్శించారు.
ఎన్నికలను బహిష్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని.. రాష్ట్రంలో భయానక పరిస్థితులున్నాయని మాజీ మంత్రి జవహర్ అన్నారు. దొంగ, పోలీసు ఒకటయ్యారన్నారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని జగన్ బంట్రోతు, రబ్బరు స్టాంపులా పని చేస్తున్నారన్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ పారిపోయిందని సోము వీర్రాజు అంటున్నాడని.. ఎవరిపై పోరాటం చేయాలో మీకు తెలియదన్నారు. టీడీపీపై కాదని.. వైసీపీ మీద పోరాటం చేయాలన్నారు. నోటాకి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదన్నారు జవహర్. టీడీపీని కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలను కళ్లు ఉండి చూడలేని కబోది సోము వీర్రాజు అని జవహర్ మండిపడ్డారు.