ప్రధాన అర్చకుడిగా మళ్లీ రమణ దీక్షితులు! టీటీడీలో మరో వివాదం
posted on Apr 3, 2021 @ 3:10PM
తిరుమల పుణ్యక్షేత్రం వివాదాలను కేంద్ర బిందువుగా మారుతోంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం రిటైర్డ్ అర్చకులు, ప్రస్తుత ప్రధాన అర్చకులకు మధ్య అగాధాన్ని రాజేసింది. రిటైర్డ్ అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. టీటీడీ ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి శ్రీవారి ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.
టీటీడీలో అర్చక వివాదం ఎప్పటి నుంచో ఉంది. 1933 వరకు మహంతుల పాలనలో కొనసాగిన శ్రీవారి ఆలయ వ్యవహారాలకు చెక్ పెడుతూ..., టీటీడీని నియమించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. పాలన మాత్రమే టీటీడీ కొనసాగించినా.. సంవత్సరాల తరబడి రామానుజ చార్యులు నిర్ధేశించిన విధంగా మిరాశీ వ్యవస్ధకు చెందిన అర్చకులు స్వామి వారికి పూజ కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థనే రద్దు చేస్తూ 1987లోని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మిరాశీ వంశానికి చెందిన గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ కుటుంబాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం 1997 తీర్పును వెల్లడించింది. మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ... మిరాశీ వంశీకులను అర్చకులుగా నియమించాలని టీటీడీని ఆదేశించింది.
ఆ తరువాత 2007లో మిరాశీ వంశీకులు అర్చక వారసత్వం ఒక కుటుంబ నుంచి ఒకరు పొందేలా అప్పటి ఏపీ గవర్నమెంటు జీఓను విడుదల చేసింది. 2013లో వయో పరిమితి అంశాన్ని మొట్టమొదటి సారి టీటీడీ అమలు చేసింది. టీటీడీ అనుబంధ అలయాలైన తిరుచానూరు, గోవింద రాజా స్వామి ఆలయాలలోని మిరాశీ అర్చకులను పదవీ విరమణ చేయించింది టీటీడీ. మొత్తం ముగ్గురు అర్చకులు అప్పుడు పదవి విరమణ పొందారు. మిరాశీ వంశీకులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. అర్చకులకు 65 సంవత్సరాల వయో పరిమితి చెల్లదని.., వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంభావం లేకుండా అర్చకులుగా కొనసాగించాలని కోర్టు టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. 2015వ సంవత్సరం అర్చకులకు రిటైర్మెంట్ అనే పదమే లేదని అప్పటి ఈఓ ఎం.జి గోపాల్ తెలిపారు.అయితే 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేసిన సంఘటనల దృష్ట్యా టీటీడీ మరో మారు వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది. ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం అంత శరవేగంగా అయిపోయాయి. దీనితో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబంకు చెందిన వారిని నియమించింది.
టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు సుప్రీమ్ కోర్టుకు వెళ్లగా.. తిరుచానూరు, గోవింద రాజా స్వామి మిరాశీ అర్చకులు హైకోర్టుని ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై స్పష్టమైన తీర్పును గత సంవత్సరం డిసెంబర్ 14 తేదీన ప్రకటించింది. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ధర్మాసనం. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలోనూ టీటీడీ కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది. మిరాశీ అర్చకుల పదవి విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ అప్పటి అధికార పార్టిపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. దీంతో రమణదీక్షితులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ వంశపార్యంపర్య వృత్తిని అర్చకత్వాని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పదించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. సీఎం జగన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారి రమణదీక్షితులు కలిసి తనకు న్యాయం చేయాలనీ కోరారు. అయితే రమణ దీక్షితులకు ఆగమ సలహాదారునిగా నియమించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకునిగా హోదా కల్పిస్తూ 2019 నవంబర్ 6వ తేదీన ఉత్తర్వులిచ్చింది. నియమితులైన కొన్ని రోజులకే తనకు కచ్చితంగా ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు రమణ దీక్షితులు.
ఇప్పుడు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల దీక్షితులు, కృష్ణ దీక్షితులు మరికొందరు ఆలయ అర్చకులు మార్చి మాసంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఖాళీల భర్తీ కోసం అభ్యర్థించిన మిరాశీ అర్చకులు తమ మిరాశీ వంశానికి చెందిన వారికే అర్చకత్వం ఇవ్వాలని కోరగా.., పచ్చ జెండా ఊపుతూ.., టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్. దీన్ని గమనించిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి.., వైసీపీ నేతలతో చర్చలు కొసాగించారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాయకులు పంచాయితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై టీటీడీ అధికారులతో చర్చించిన సీఎం.., రమణ దీక్షితులుకు ఆలయ ప్రధాన అర్చక పదవి ఇవ్వాలని సూచించారట. సీఎం ఉత్తర్వుల మేరకు వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.