ఏపీలోనూ పెగాసస్ తరహా హ్యాకింగ్!
posted on Jul 27, 2021 @ 2:49PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయడంపై స్పందించిన రఘురామ.. బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గృహహింస చట్టం కింద నిందితుడిగా తేలిన ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్ మరో ఇద్దరు నిందితులతో కలిసి తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బాగోతంపై సరైన సమయంలో సమగ్ర వివరాలతో 420 చట్టం కింద ఫిర్యాదు చేస్తానన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటికొస్తాయని తెలిపారు.
తన ఫోన్ ను తీసుకున్న సునీల్ కుమార్, ఆ ఫోన్ నుంచి కొందరికి సందేశాలు పంపారని రఘురామ ఆరోపించారు. ఆ ఫోన్ ను వాడకుండానే, దాన్నుంచి మెసేజులు పంపగల ఘనుడు సునీల్ కుమార్ అని వ్యాఖ్యానించారు.టెక్నాలజీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోగల ఘనాపాఠి సునీల్ కుమార్ అన్నారు రఘురామ రాజు. గతంలో ఆయనకు వివాహం కాగా భార్యతో మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. అయితే భార్య ఉపయోగించే కంప్యూటర్ లోకి ఆమె అనుమతి లేకుండా చొరబడి, ఆ కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారని తెలిపారు. ఈ విషయం రికార్డుల్లో కూడా ఉందన్నారు. నా ఫోన్ నెంబరును ఉపయోగించి కూడా అదే విధంగా సందేశాలు పంపారని రఘురామ రాజు ఆరోపించారు. పీవీ రమేశ్ అప్రమత్తం చేయడంతో తాను అప్రమత్తం అయ్యానన్నారు. గతంలో న్యాయమూర్తులపైనా ఓ సాఫ్ట్ వేర్ ను ప్రయోగించారని పత్రికా కథనం వచ్చిందన్నారు రఘురామ.
సునీల్ కుమార్ పెగాసస్ తరహా సాఫ్ట్ వేర్ లు ఉపయోగిస్తూ ఇలాంటి సందేశాలు రూపొందిస్తున్నారని రఘురామ రాజు ఆరోపించారు. ఏదైనా దరిద్రమైన పని చేసినా అందంగా చేయాలి.. కాని నా విషయంలో ఏదో చేయబోయి దొరికిపోయారని చెప్పారు. నాకు ఎవరితోనో సంబంధం ఉందని, అవతలి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ సందేశం రూపొందించారన్నారు. అది నా అకౌంట్ కాద.. నాకు సంబంధించింది కాదని రఘురామ స్పష్టం చేశారు. కానీ, దాని ఆధారంగా సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు, ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చినట్టు చెబుతున్నారు. మరి సునీల్ కుమార్ ఫిర్యాదు చేస్తే అది సాక్షికి ఎలా వచ్చింది? ఎంపీలను తీసుకుని ఢిల్లీలో అందరినీ కలుస్తున్న దొంగోడు విజయసాయిరెడ్డికి ఎలా అందింది? అంటే సునీల్ కుమార్, విజయసాయి మిలాఖాత్ అయ్యారని అనుకోవాలా? ఇద్దరూ తోడుదొంగలు అనుకోవాలా?" అంటూ రఘురామ కృష్ణరాజు ఘాటుగా ప్రశ్నించారు.