బెయిల్ రద్దు కాకుండా జగన్ ఏం చేస్తున్నారో తెలుసా?
posted on Aug 2, 2021 @ 5:01PM
ఆగస్టు 25న ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ కోర్టు తీర్పు రాబోతోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. పిటిషనర్ తో పాటు జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీబీఐ మాత్రం తమ కౌంటర్ వేయడంలో దాగుడుమూతలు ఆడింది. మొదట చట్టం ప్రకారమే వెళ్లాలని కోర్టుకు చెప్పిన సీబీఐ.. తర్వాత పలు వాయిదాలు కోరింది. చివరకి మళ్లీ కోర్టుకే వదిలేసింది. దీంతో జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఉత్కంఠగా మారింది.
జగన్ వంద శాంత బెయిల్ రద్దు అవుతుందని పిటిషనర్ ఎంపీ రఘురామ రాజు అంటున్నారు. కేసులో రఘురామ సమర్పించిన సాక్షాలూ పక్కాగా కనిపిస్తున్నాయని, బెయిల్ రద్దు నుంచి జగన్ తప్పించుకోలేరనే ప్రచారం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు అయితే.. మరోసారి ఆయన జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దు కేసు నుంచి బయటపడేందుకు జగన్ ఓ కేంద్రమంత్రి కుమారుడి సాయం కోరుతున్నారని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు చింతా మోహన్. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ మాజీ కావడం తథ్యమని జోస్యం చెప్పారు. జగన్ రాజకీయ పతనం ప్రారంభమైనట్టేనని, రాష్ట్రంలో రాజకీయ మార్పు రాబోతోందని చింతా మోహన్ అన్నారు.
సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో తీర్పు రాబోతున్న సమయంలో చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న చింతాకు ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీల నేతలతోనూ ఆయనకు లింక్స్ ఉంటాయి. ఇంతేకాదు పాలనకు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు అందుతుంటాయి. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ కేసుపై మోహన్ చేసిన కామెంట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బెయిల్ రద్దు కాకుండా చూడాలని జగన్ సాయం కోరిన కేంద్రమంత్రి కొడుకు ఎవరన్న దానిపై రకరకలా పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీలో కీలకంగా ఉన్న నేత అయి ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.