కౌశిక్‌రెడ్డి కాకపోతే ఇంకెవరు?హుజురాబాద్‌లో సాగర్ స్ట్రాటజీ?
posted on Aug 2, 2021 @ 12:24PM
నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక వచ్చింది. కారు పార్టీ టికెట్ కోసం రేసులో పలువురు ఆశావహులు ఉన్నారు. నోములకు కొడుకు ఉన్నా.. ఆయన పేరు అతితక్కువగా వినిపించింది. మొదట్లో కోటిరెడ్డి అన్నారు. జానారెడ్డికి అతనే కరెక్ట్ కేండిడేట్ అంటూ విశ్లేషణలు వచ్చాయి. కొన్నాళ్లకి సడెన్‌గా గురువయ్య యాదవ్ అనే కొత్త పేరు తెరమీదకు వచ్చింది. బాగా సౌండ్ పార్టీ, యాదవ ఓట్లు అంటూ విశ్లేషణలు జరిగాయి. కట్‌చేస్తే.. చివరాఖరికి నోముల తనయుడు భగత్ టీఆర్ఎస్ అభ్యర్థి కావడం గెలవడం జరిగిపోయింది. తండ్రి చనిపోతే కొడుక్కి టికెట్ ఇవ్వడం రాజకీయాల్లో సంప్రదాయం. ఇంత సింపుల్ విషయాన్ని అంతలా కాంప్లికేట్ చేసి.. ఎవరెవరో పేర్లు ప్రచారంలో ఉండేలా చేయడం.. కేసీఆర్ తరహా పాలి..ట్రిక్స్‌కి నిదర్శనం. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ గులాబీ బాస్ నాగార్జున సాగర్ తరహా స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారని అంటున్నారు.
నాగార్జునసాగర్‌లో కోటిరెడ్డి, గురువయ్య యాదవ్‌ల పేర్లు ఉట్టి పుణ్యానికే ప్రచారంలోకి రాలేదు. ఆ పేర్లను ప్రగతిభవన్ నుంచే లీక్ చేశారు. మీడియాలో, పబ్లిక్‌లో చర్చ జరిగేలా చేశారు. ఆఖరి నిమిషం వరకూ ఆ కన్ఫ్యూజన్‌ను కంటిన్యూ చేశారు. అదంతా ఓ ఎత్తుగడ. అప్పట్లో టీఆర్ఎస్ నేత కోటిరెడ్డి తనకు టికెట్ వస్తుందని బలంగా నమ్మారు. కేసీఆర్ హ్యాండిస్తే కాంగ్రెస్‌లోకి జంప్ కొట్టాలని భావించారు. ఆయన అలాంటి దుందుడుకు పనులు చేయకుండా.. కాంగ్రెస్‌లోకి మారకుండా.. కోటిరెడ్డికే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసి ఆయన ముందరికాళ్లకు బంధం వేశారు కేసీఆర్. ఇక గురువయ్య యాదవ్ ఎపిసోడ్ కూడా అంతే. ఆయన టీఆర్ఎస్ నాయకుడు కాదు. రాజకీయ అనుభవం లేకపోయినా.. స్ట్రాంగ్ కేండిడేట్ అవుతారని భావించిన బీజేపీ.. గురువయ్య యాదవ్‌తో సంప్రదింపులు జరిపింది. ఆ విషయం పసిగట్టిన కేసీఆర్.. గురువయ్య పువ్వు గుర్తుపై బరిలో దిగితే తమ పార్టీకి నష్టం తప్పదని భావించి.. గురువయ్యకే టీఆర్ఎస్ టికెట్ అంటూ లీకులిచ్చారు. నిజమేనని భ్రమపడిన ఆయన.. చివరి వరకూ టికెట్ కోసం ఎదురుచూసి.. కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఎలాంటి ఎక్స్‌పరిమెంట్స్ చేయకుండా నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కేసీఆర్. మిగతా వారంతా కేసీఆర్ ఆడిన ఆటలో అరటిపండ్లు అయ్యారు.
ఇలాంటి జిత్తులమారి మాస్టర్‌ప్లాన్‌లు కేసీఆర్ మైండ్‌లో అనేకం ఉంటాయంటారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ పాలి..ట్రిక్స్‌తో ముందుకు వస్తుంటారు. ఈసారి హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. ఈటలను ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు రకరకాల ఎత్తుగడలు రచిస్తున్నారు. కడియం శ్రీహరి నుంచి కౌశిక్‌రెడ్డి వరకూ.. హుజురాబాద్ బరిలో అనేక మంది పేర్లు వినిపించాయి. స్థానిక నేతలతో పాటు పలువురు ఇంపోర్టెడ్ లీడర్లపైనా లీకులొచ్చాయి. మాజీ మంత్రి ముద్దసాని కుటుంబ సభ్యుల పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఆడియో లీక్ కాకపోతే కౌశిక్‌కు ఛాన్స్ వచ్చేదేమో. అయితే, రెడ్డి వర్గానికి కాకుండా బీసీ అభ్యర్థినే ఈటలపైకి ప్రయోగించే అవకాశం ఉందంటున్నారు.
హుజురాబాద్‌లో 65వేలకుపైగా ఉన్న ఎస్సీలను దళితబంధుతో గంప గుత్తగా తన ఖాతాలో వేసుకునే పాచిక బాగానే పారుతున్నట్టుంది. ఇక బీసీ ప్రతినిధిగా చెలామణి అవుతున్న ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు.. బీసీ అభ్యర్థితోనే చెక్ పెట్టాలనేది కేసీఆర్ ఆలోచనలా ఉంది. బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకే అన్నట్టుగా.. ఏడేళ్లుగా అవసరంరాని ఎల్.రమణను హడావుడిగా కారెక్కించేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు లాగిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి.. బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని రప్పించి.. బలమైన నేతలను హుజురాబాద్‌లో మోహరించారు. ఇలా.. అభ్యర్థి ఎవరైనా సరే.. గెలిపించే సత్తా ఉన్న బలమైన బలగాన్ని ముందే మోహరించారు కేసీఆర్.
హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికనేది చాలా టఫ్ క్వశ్చన్. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన రవితో పాటు టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. స్థానికతే వారి అర్హత. ఇందులో గెల్లుకే ఛాన్సెస్ ఎక్కువ అంటారు. గెల్లు శ్రీనివాస్ తండ్రి అప్పట్లోనే జెడ్పీటీసీగా ఉండేవారని.. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండేదని.. టీఆర్ఎస్ ఏర్పడిన తొలినాళ్లలోనే ఆయనకు పార్టీ టికెట్ రావాల్సి ఉండగా.. ఆయనకు బదులు ఈటలను తొలిసారి ఎమ్మెల్యే చేశారని అంటారు. ఆ తండ్రి వారసత్వంతో పాటు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువకుడిగా, టీఆర్ఎస్వీ ప్రెసిడెంట్‌గా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఈటలకు పోటీగా నిలబెడతారని అంటున్నారు. యువకుడైన నోముల భగత్‌కు అవకాశం ఇచ్చినట్టుగానే.. హుజురాబాద్‌లోనూ గెల్లుకు ఛాన్స్ ఇచ్చి.. యువ నాయకత్వంను ప్రోత్సహిస్తారని చెబుతున్నారు.
అయితే, గెల్లు శ్రీనివాస్.. ఈటల స్థాయి ఇమేజ్‌కు సరైన ప్రత్యర్థి కాలేరనే వారూ లేకపోలేదు. జానారెడ్డికి.. నోముల భగత్ సరిజోరు కాకపోయినా.. అక్కడ తండ్రి చనిపోయిన సానుభూతి కలిసొచ్చింది. ఇక్కడ అలాంటి అడ్వాంటేజేస్ ఏమీ లేవు. బయటి నుంచి బలమైన నాయకుడిని తీసుకొస్తే.. నాన్‌లోకల్ సెంటిమెంట్ రాజుకుంటుంది. అది అసలుకే మోసం తెస్తుంది. లోకల్‌గా కౌశిక్‌రెడ్డి ఒక్కడే స్ట్రాంగ్ కేండిడేట్ అయినా.. ఆడియో లీక్‌తో ఆ ఛాన్సూ మిస్ అయింది. ఇక మిగిలింది.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మినహా టీఆర్ఎస్‌కు వేరే ఆప్షన్ లేకపోవచ్చనేది కొందరి మాట. అయితే, కేసీఆర్ మదిలో ఎవరున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. ఎవరూ ఊహించని అభ్యర్థిని ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరు పోటీ చేసినా గెలిపించుకునేలా.. ఇప్పటికే కదపాల్సిన పావులన్నిటినీ కదిపేశారు. ఇక ఈటలకు చెక్ చెప్పడమే మిగిలిందంటున్నారు. చూడాలి మరి, హుజురాబాద్‌లో కారులో ఊరేగేది ఎవరో..