ప్రధానితో ఐస్ క్రీం తినబోతున్న సింధు.. తెలుగు తేజానికి పార్లమెంట్ ప్రశంసలు
posted on Aug 2, 2021 @ 12:24PM
ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర స్పష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును పార్లమెంట్ ఉభయసభలు అభినందించాయి. సింధు తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిందని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభినందించారు. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సింధు విజయాన్ని ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్యం సాధించడం ఆనందకరమని చెప్పారు. ఇది ఆమెకు వరుసగా రెండో ఒలింపిక్ పతకం.. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు ఆమే కావడం విశేషమన్నారు. చారిత్రక విజయం అందుకున్న సింధుకు సభ సభ్యులందరి తరఫున స్పీకర్ అభినందనలు తెలిపారు. సింధు విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు.
సింధు గురించి ఆమె తండ్రి పీవీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంస్యం గెలిచిన తన కుమార్తె ఇక ప్రధాని మోడీతో కలిసి ఐస్‌క్రీం తింటుందని చెప్పారు. ప్రధాని ప్రోత్సాహం మరువలేనిదన్నారు రమణ.
టోక్యో వెళ్లేముందు సింధును ప్రోత్సహించేందుకు.. గెలిచి రాగానే ఐస్‌క్రీం తిందామని ప్రధాని చెప్పారన్నారు. ‘‘ప్రధాని మోదీ ఆమెకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ‘నువ్వు వెళ్లు.. రాగానే మనిద్దరం కలిసి ఐస్‌క్రీం తిందాం’ అని ఆయన అన్నారు. ఇప్పుడు సింధు రాగానే ప్రధానిని కలిసి కచ్చితంగా ఐస్‌క్రీం సేవిస్తుంది’’ అని పీవీ రమణ అన్నారు.
వరుసగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు రమణ. ఈ దేశానికి పేరు, కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చిందన్నారు. ఆమెకు లక్ష్యంపై దృష్టి ఉంది. తనలో కసి ఉందని తెలిపారు. సింధు ఆటను ఆస్వాదిస్తుంది.. ఆమె ఎప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లినా పతకం తీసుకొచ్చిందన్నారు. గతసారి రజతం గెలిచింది. ఈ సారి కాంస్యం కైవసం చేసుకుంది అని పీవీ రమణ ఆనందం వ్యక్తం చేశారు.