భువనేశ్వరి మాట.. జగన్ కు షాక్.. పైకి లేచిన బావి.. పాతబస్తిలో కమలం.. టాప్ న్యూస్@1PM
posted on Nov 26, 2021 @ 11:42AM
శాసనసభలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల స్పందించి నిరసన తెలియజేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదని అన్నారు. చిన్నతనం నుంచి తమ అమ్మానాన్న విలువలతో పెంచారని చెప్పారు. నేటికీ మేం వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలి అన్నారు. తనకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకూడదని భువనేశ్వరి పేర్కొన్నారు.
------
గుంటూ జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ముందుగా లోకేష్ మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పర్యటనను ప్రారంభించారు. ఇటివల మృతి చెందివ పలువురు కార్యకర్తలు కుటుంబాలను టీడీపీ నేత పరామర్శించారు. లోకేష్ పర్యటనలో టీడీపీ నేతలు భారీగా పాల్గొంటున్నారు.
-----
వరదల్లో 60 మంది చనిపోయారని... తిరుపతిలో చెరువుల ఆక్రమణ వల్లే ఆస్తి నష్టం కలిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో డ్యామ్‌ల గేట్లు పనిచేయవని విమర్శించారు. మానవ తప్పిదం వల్లే వరదల్లో ప్రాణ నష్టం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని... పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
---------
ముఖ్యమంత్రి జగన్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. రైతుల కోసం రైతు నవరత్నాలు పేరుతో 9 డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో నిత్యవసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని.. జీవించడమే కష్టంగా మారిందన్నారు. తెల్లరేషన్ కార్డు దారులకు నెలకు 3వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు. కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి లక్ష ఉత్తరాలు రాశామని... అయినా ముఖ్యమంత్రి జగన్‌కి స్పందించలేదన్నారు హరిరామ జోగయ్య.
---
ఉద్యోగుల సమస్యలపై మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం చర్చించారు. వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఐఆర్ పెంచి ఇవ్వడం సంతోషమన్నారు. అయితే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయడం లేదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని... కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చీడ పురుగుల్లా చూస్తోందని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఉద్యోగుల సమస్యలపై కాగితాలు ఇచ్చి ఇక అలసిపోయామన్నారు
-------
తిరుపతి శ్రీకృష్ణ నగర్‌లో వింత చోటు చేసుకుంది. భూమిలోనుంచి 25 అడుగుల బావి పైకి చొచ్చుకొచ్చింది. నిట్టనిలువుగా 11 ఒరలు పైకి వచ్చాయి. అనుకోని పరిణామంతో స్థానికులు అవాక్కవుతున్నారు. ఈ వింతను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గత వారం రోజులుగా శ్రీకృష్ణనగర్ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో ఈ వింత జరిగింది.
---
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పాతబస్తీలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. శాసనసభా పక్షనేత రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, పొంగులేటి, విజయశాంతి, వివేక్, ప్రధాన కార్యదర్శులు, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తదితరులు హాజరయ్యారు. కాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
----
వరి కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య గుండె పోటుతో వరి కొనుగోలు కేంద్రం వద్ద మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్ల కుప్పను ఒక దగ్గరకు చేసి రాజయ్య అక్కడే కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
----
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి.మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దు చేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను విరమించేది లేదని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.
-----
జమ్మూ కశ్మీర్ పూంచ్‌లోని భింబర్ గలి ప్రాంతంలో గురువారం అర్థరాత్రి పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది.భీంబర్ గలి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు భారత ఆర్మీ అధికారులు గురువారం అర్థరాత్రి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు.సరిహద్దుల్లో మరణించిన ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారతసైనికులు స్వాధీనం చేసుకున్నారు.