మునుగోడుకు అమిత్ షా

మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ విజయానికి రహదారిగా భావిస్తున్న బీజేపీ ఆదివారం (ఆగస్టు 21)న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా హాజరౌతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాన్ని రిపీట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అమిత్ షా సభను విజయవంతం చేయడం ద్వారా అందుకు బాటలు పడతాయని భావిస్తున్నది. అందుకే భారీ ఎత్తున జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం (ఆగస్టు 21)న చండూరు వద్ద సభా ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే బీజేపీ ముఖ్య నేతలు మునుగోడులోనే బస చేసి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర నిఘావర్గాలు సభా ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. అమిత్ షా సభకు భారీ ఎత్తున జన సమీకరణకు అన్ని ఏర్పాట్లూ చేశారు.   ఇక అమిత్ షా ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి  చేరుకోనున్నారు.  అక్కడ నుంచి ఆయన నేరుగా  ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు.   అమిత్‌షా మధ్యాహ్నం 3.20కి రమదా మనోహర్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ   రైతు నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం  బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో  గంటలకు మనుగోడు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సభ అనంతరం అమిత్‌షా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో  ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

సమస్యలు ప్రస్తావిస్తే తెలుగుదేశమేనా?

మీరు తెలుగుదేశం పార్టీ వాళ్లు.. అందుకే నన్ను నిలదీస్తున్నారంటూ కనిిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజలపై విరుచుకుపడ్డారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కనిగిరిలో పలు కాలనీల్లో పర్యటించారు. ఆ సందర్భంగా సమస్యలను ప్రస్తావించిన ప్రజలపై ఆయన విసుక్కున్నారు. సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికీ లబ్ధి చేకూరుస్తోందనీ, అయినా కూడా చిన్న చిన్న సమస్యలను పట్టుకుని నన్న ప్రశ్నిస్తారేమిటని ప్రజలను నిలదీశారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ వెళ్లి   ప్రభుత్వ పథకాల ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరిస్తుంటే,  పలువురు  రోడ్లు గుంతలమయంగా మారాయని, వీధి దీపాలు వెలగడం లేదని, పింఛన్లు కొందరికే ఇస్తున్నారంటూ కొందరు సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే బుర్రా తీవ్ర అసహనానికి లోనయ్యారు. మీరంతా తెలుగుదేశం వాళ్లు అందుకే ఇలా చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో ప్రజలు   తాము ఏ పార్టీకీ చెందిన వాళ్లం కాదని, కొందరు స్థానిక నాయకులు తమపై రాజకీయ కక్షలు చూపుతున్నారని ఆయనకు వివరించారు. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే శాంతించిన ఎమ్మెల్యే  ఆయా ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.  

హిజాబ్ వివాదం.. చదువు మానేస్తున్న విద్యార్థినులు

 కర్నాటకలో హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. గ ఆ వివాదం కారణంగా శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తింది. ఆ తరువాత సమసిపోయిందని అంతా భావిస్తున్నా.. ఆ వివాదం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పిన సంగతి తాజాగా బయట పడింది.   హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ కర్ణాటకలో దాదాపు 145 మంది విద్యార్థినులు చదువులకు స్వస్తి చెప్పి టీసీలు తీసుకున్నారు.   సమానత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండే దుస్తులు వేసుకుని విద్యాలయాలకు రావద్దని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించడంతో హిజాబ్‌ అంశం ఆ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే, హిజాబ్ ధరించవద్దని మంగళూరు విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత మే నెలలో యూనివర్సిటీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆ విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజీలు హిజాబ్ ధరించి కళాశాలకు రావద్దని విద్యార్థులకు సూచించాయి. దీంతో ఆ వర్సిటీ పరిధిలోని పలు కాలేజీలకు చెందిన   145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని చదువుకు గుడ్ బై చెప్పారు. మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ఈ విషయాన్ని తెలిపారు.  దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పలు కాలేజీల్లో మొత్తం 900 మంది ముస్లిం విద్యార్థినులు పలు కోర్సుల్లో చేరారని చెప్పారు. వారిలో 145 మంది   హిజాబ్ వివాదం నేపథ్యంలో టీసీలు తీసుకుని కాలేజీలు మానేశారనీ వివరించారు.  

కేసీఆర్ కు మునుగోడు భయం?

కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందా? మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి.. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? అనవసరపు ఎన్నిక పుట్టి ముంచుతుందా అన్న అనుమానం మొదలైందా? బీజేపీ వ్యూహాత్మకంగా తెచ్చి తలమీద పెట్టిన మునుగోడు ఉప ఎన్నిక తలభారంగా మారుతుందని ఆందోళన పడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే అంటున్నారు. మునుగోడులో ప్రజాదీవెన పేరిట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం (ఆగస్టు 20) జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే మునుగోడు కాంగ్రెస్ కు మరో హుజూరాబాద్ అవుతుందా అన్న అనుమానం కేసీఆర్ లో కలిగిందని అనిపించక మానదని పరిశీలకులుఅంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ధీమా లోపించిందనీ, ధైర్యం సడలిందనీ వారు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభమే మునుగోడు ఎవరికీ అవసరం లేని ఎన్నిక అని ప్రారంభించడమే కాకుండా.. ఎంత అవసరం లేని ఎన్నికైనా ఇక్కడ టీఆర్ఎస్ గెలవకుంటే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయంటూ జనాలను హెచ్చరించారు. తన ధైర్యం మీరే అంటూ జనానికి చెబుతూనే అటువంటి మీరే మద్దతు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. సాధారణంగా సభ ఏదైనా, వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ నెటి వెంట మాటల బాణాలు ప్రత్యర్థులపై నిప్పుల వాన కురిపిస్తాయి. అలాంటిది ఈ సారి కేసీఆర్ కేంద్రంపై, మోడీపై, అమిత్ షాలపై కురిపించిన విమర్శల వర్షంలో వాడి వేడి కన్నా... స్వీయ రక్షణ భావమే కనిపించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా తలొగ్గక మీటర్లు పెట్టేదేలే అని కోట్లాడాననీ, ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలవకుంటే.. తనను పక్కకు నెట్టేసి మరీ వ్యవసాయ మోటార్లకు మోడీ మీటర్లు పెడతారనీ ప్రజలను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడారు.  మునుగోడులో గెలవకుంటే సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మునుగోడు వాస్తవానికి టీఆర్ఎస్ స్థానం కాదు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో వచ్చిన ఎన్నిక ఆ స్థానం నిలుపుకోవడం కాంగ్రెస్ కు ముఖ్యం. కావాలని ఉప ఎన్నిక వచ్చేలా పావులు కదిపిన బీజేపీకి అక్కడ విజయం ముఖ్యం. మునుగోడులో గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ కు వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ లేదు. అయినా కేసీఆర్ మునుగోడు ఫలితం జీవన్మరణ సమస్యగా భావిస్తుండటానికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా భావిస్తుండటమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే మునుగోడు సభలో ఈ ఉప ఎన్నికను గోల్ మాల్ ఎన్నికగా అభివర్ణిస్తూనే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటేయకుంటే.. యావత్ తెలంగాణకు నష్టం అన్నారు. బీజేపీ మాటలకు మోసపోతే గోస తప్పదని హెచ్చరించారు. అడుగడుగునా తెలంగాణకు చేటు చేస్తున్న మోడీ, షాలపై విమర్శల వాగ్బాణాలు సంధించారు. కానీ అదే సమయంలో.. కమలం వైపు మొగ్గు చూపితే సంక్షేమం మాట మరచిపోవాల్సిందే అని హెచ్చరికలూ చేశారు. మునుగోడు ఓటు తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశిస్తుందని కేసీఆర్ అన్నారు. ఇంకా  తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లైనా ఇంకా కృష్ణా జలాల్లో మన వాటా ఎందుకు తేల్చలేదో.. మునుగోడుకు రానున్న అమిత్ షాను నిలదీసి తెలుసుకోవాలన్నారు. దేశం యావత్తూ మెచ్చుకునేలా సంక్షేమ బాటలో టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుంటే.. ఆ సంక్షేమాన్ని బంద్ పెట్టాలనుకుంటున్న బీజేపీకి మునుగోడులో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో దేశంలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్న ఆయన   బ్యాంకులు, రైళ్లు, రోడ్లు ఇలా అన్నిటినీ అమ్మేస్తూ పోతోందని, ముందు ముందు  రైతులభూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు.   కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోందని కేసీఆర్ అన్నారు.  క్రియాశీల, ప్రగతి శీల శక్తుల కలయికకు మునుగోడు నాంది పలికిందన్నారు. సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ప్రకటించిన ఆయన ఈ బంధం దేశ వ్యాప్తంగా మోడీ దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు.  మొత్తం మీద మునుగోడు సభలో కేసీఆర్ కేంద్రంపై విమర్శలతో చెలరేగారు. ఇటీవల తరచుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన పై చేస్తున్న అవినీతి ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈడీ లేదు బోడీ లేదు.. తప్పు చేసిన వారు భయపడతారు తాను కాదని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదంటూ బీజేపీ విమర్శలకూ బదులిచ్చారు. అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్న వారు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. అది అహంకారమా బలుపా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఆలోచించి, వారి కోసం నిజాయితీగా పని చేసేవారు మోడీకి భయపడరని కేసీఆర్ అన్నారు.  మాట్లాడితే చాలు తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటుంటారు, ప్రజా మద్దతుతో గెలిచిన ఆ ప్రభుత్వాలను కూల్చేస్తానని విర్రవీగే నిన్ను పడగొట్టే వాళ్లే లేరనుకుంటున్నారా మోడీ అని ప్రశ్నించారు. మోడీని ఎవరూ పడగొట్టక్కర్లేదు ఆయన అహంకారమే ఆయనను కూల్చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇన్ని చెప్పిన కేసీఆర్ మళ్లీ మునుగోడు ఉప ఎన్నికకు వచ్చే సరికి ఓటర్లకు రెండే రెండు చాయిస్ లు ఇచ్చారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా… మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా.. తేల్చుకోవాలన్నారు. తాను తెలంగాణ కోసం తెగించిన నిలబడగలిగానంటే అందుకు ప్రజలిచ్చిన బలమే కారణమన్నారు. ఇప్పుడు ఆగం చేస్తే తెలంగాణ ఏమవుతుందని ప్రశ్నించారు.  మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకు రావాలంటే… ఈ దుర్మార్గులకు తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.  ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో కాదన్న కేసీఆర్  తెలంగాణ ఏమంటుుందనేది మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా దేశం మొత్తానికీ చాటాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద బొమ్మలు ( ఫ్లెక్సీలు) చూసి మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. 

రాకుమారుడి రైలు యాత్ర‌!

నిత్యం భోగ‌భాగ్యాల‌తో జీవించేవారిలో కొంద‌రికి ఆ జీవితం మీద కాస్తంత విర‌క్తి కలిగి, అలా చెప్పా పెట్ట‌కుండా ప‌ట్ట‌ణంలో అలా అన్ని గ‌ల్లీల్లో తిర‌గాల‌నుకుంటారు. కానీ కాలుక‌దిపితే సెక్యూరిటీవారు అడ్డుకుంటారు. సామాన్య జ‌నం ఎలా ఉంటారు, ఎలా జీవి స్తుంటారో తెలుసుకోవాల‌ని పూర్వం రాకుమారుల‌కీ అనిపించింది. మారువేషాల్లో బ‌య‌ట‌ప‌డేవారు. కానీ ఇప్పుడు చాలా క‌ష్టం. ఎందుకంటే అలాంటి రాజ‌కుటుంబాల‌కు చెందిన‌వారికి ఏ దేశంలోనూ అంత స్వేచ్ఛ ఉండ‌దు. అంత‌కంటే ప్రాణ‌భీతి ఎక్కువ‌. అందుకే ర‌క్ష‌ణ వ‌ల‌యం మ‌ధ్య‌లోనే తిరుగుతూ కాల‌క్షేపం  చేస్తారు. కానీ దుబాయ్ రాకుమారుడు మాత్రం వీరం ద‌రికీ  కాస్తంత అల‌గ్‌! దుబాయ్ రాకుమారుడు షేక్ హ‌మ‌దాన్ చాలాసామాన్యుడిలా లండ‌న్ ట్యూబ్ రైళ్ల‌లో తిరుగుతుండ‌డం వైర‌ల్ అయింది. ఆయ‌న లండ‌న్‌లో స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని వ‌చ్చారు. ఆ స‌ర‌దా కాస్తా మ‌రింత సాదాసీదాగా తిర‌గాల‌నిపించేలా చేసింది. లోక‌ల్ ట్రైన్ జ‌ర్నీలో అనేకం తెలుస్తాయ‌ని ఎవ‌రు చెప్పారోగాని త‌న స్నేహితుడు బాద‌ర్ అతీజ్‌తో క‌లిసి చాలా మామూలు దుస్తుల్లో ట్యూబ్ రైళ్ల‌లో తిరిగాడు.  తన తాజా పోస్ట్‌లో, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అతను లండన్ ట్యూబ్‌లో ప్రయాణిస్తున్నట్లు సెల్ఫీ తీసుకున్నాడు, అతని తోటి ప్రయాణికులచే గమనించబడలేదు. అతను తన సన్నిహిత మిత్రుడు బదర్ అతీజ్‌తో కలిసి లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ప్రయాణించాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్ట్‌లో షేక్ హమ్దాన్ రద్దీగా ఉండే ట్యూబ్ కంపార్ట్‌మెంట్ మధ్యలో నిల బడి ఉన్నాడు, అతని వెనుక బదర్ అతీజ్ ఉన్నాడు, ఇద్దరినీ రైలు ప్రయాణికులు గుర్తించలేదు. మేము చాలా దూరం వెళ్ళాలి,  బద్ర్ ఇప్పటికే విసుగు చెందాడని క్యాప్షన్‌లో రాయల్ చమత్కరించాడు. షేక్ హమ్దాన్ తన వేసవి సెలవుల్లో అతని తండ్రి, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ చేరారు,  గత వారం అతని కుటుంబంలోని మూడు తరాలను చూపించే  చిత్రాన్ని పంచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్, డెలివరీ ఏజెంట్ ప్రమాదానికి కారణమ య్యే రద్దీగా ఉండే రహదారి నుండి ఇటు కలను తొలగిస్తున్న వీడియోను పంచుకున్నారు. వైరల్ వీడియోలో, తలాబత్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ రోడ్డుపై పడి ఉన్న రెండు ఇటు కలను తొలగిస్తున్నట్లు చూడవచ్చు. వాహనాలన్నీ దాటిన తర్వాత, అతను వాటిని త్వరగా తీసుకొని తన బైక్‌పైకి వచ్చే ముందు వాటిని రోడ్డు పక్కన ఉంచాడు.

యువ‌త‌ను తాగ‌మ‌నడంలో జ‌పాన్ ఆంత‌ర్యం?

తిండి స‌రిగా తిన‌క‌పోతే బ‌లం ఎలా వ‌స్తుందిరా.. అంటూండేవారు పూర్వం అమ్మ‌మ్మ‌లు, నాన‌మ్మలు. మంచి ఆహారం తినాలి. తినడానికి సిగ్గుప‌డ‌కూడ‌దు..అనేవి ఆహారం విష‌యంలో నిపుణులు చెప్పే నీతివాక్యాలు. కానీ జ‌పాన్‌లో కొత్త బోధ చేస్తున్నా రు. ప్ర‌జ‌లారా.. చ‌క్క‌గా తాగండి. నిర్మొహ‌మాటంగా తాగండి.. అంటూ ప్రేమ‌గా ప్ర‌చారం చేస్తున్నారు.  ఆదాయ వసూళ్లను పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో, జపాన్ ప్రభుత్వం తన సేక్ వివా పోటీ ద్వారా కుర్రాళ్ల‌ను ఎక్కువగా తాగ డానికి మార్గాలను కనుగొంటోంది. మద్యపానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది . ఇది ఏ ఆందోళనలను లేవనెత్తింది? ఆదాయ వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో జపాన్ ప్రభుత్వం దేశంలో మద్యం వినియోగాన్ని ప్రోత్స హించే మార్గాలతో ముందుకు రావాలని యువతను ఆహ్వానిస్తోంది. నవంబర్‌లో ముగిసిన సేక్ వివా పోటీలో, జపాన్ జాతీయ పన్ను ఏజెన్సీ సేక్, షోచు, అవమోరి, బీర్ , మరిన్ని వంటి జపనీస్ ఆల్కహాలిక్ పానీయాలను ప్రోత్సహించడానికి వ్యాపార ప్రణాళికలను సమర్పించమని ప్రజలను ఆహ్వానించింది. మేము జపాన్ మద్యపాన రంగాన్ని పరిశీలిస్తాము,  పోటీ, అవసరాన్ని ఏది ప్రేరేపించింది. ఇంత‌కీ, మద్యంను ప్రోత్సహించాల్సిన అవ సరం జపాన్ కి ఎందుకు అనిపించింది.. జపాన్‌లో మద్యం పరిశ్రమ క్షీణించింది. నేషనల్ టాక్స్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, 2020 ఆర్ధిక సంవ‌త్స‌రంలో, మద్యంపై పన్ను మొత్తం వసూళ్లలో 1.9 శాతంగా ఉంది. దీనితో పోల్చితే, 2010 ఆర్ధిక సంవ‌త్స‌రంలో, మద్యం పన్ను మొత్తం పన్ను వసూ ళ్లలో 3.3 శాతంగా ఉంది, 2000లో, ఇది మొత్తం వసూళ్లలో 3.6 శాతంగా ఉంది. 1994లో, మద్యం పన్ను మొత్తం పన్ను వసూళ్లలో 4.1 శాతంగా ఉంది. రెండు దశాబ్దాల (2000-2020) డేటా జపాన్‌లో మద్యంపై వసూలు చేసిన పన్ను మొత్తం, అమ్మకాల పరిమాణం (విని యోగం) తగ్గిపోయిందని చూపిస్తుంది. 2000లో, మద్యంపై వసూలు చేసిన పన్ను 1,758,800 మిలియన్ యెన్‌గా ఉంది, అమ్మకాలు లేదా వినియోగం పరిమాణం 9,519,513 కేఎల్‌. అయితే, 2020లో, ప్రభుత్వం మద్యంపై 1,068,100 మిలియన్ యెన్ పన్ను వసూలు చేసింది, అయితే వినియోగం 7,827,698 కేఎల్‌. 2021 నివేదికలో, నేషనల్ టాక్స్ ఏజెన్సీ 1999లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుండి మద్యం పన్ను విధించదగిన పరిమాణం తగ్గిందని పేర్కొంది, ముఖ్యంగా బీర్ కోసం, ఇది సంవత్సరాలుగా అత్యధికంగా వినియోగ‌ పన్ను విధించదగిన మద్యం ఉత్పత్తి. వినియోగ అలవాట్లలో మార్పు వచ్చిందని, తాగుబోతులు బీర్ కంటే మెరిసే మద్యం, చుహై, బీర్ లాంటి ఉత్పత్తులు వంటి తక్కువ ధర గల మద్యాన్ని ఇష్టపడతారని నివేదిక పేర్కొంది. కోవిడ్ -19 మహమ్మారి కూడా లాక్డౌన్ కారణం గా దేశీయ మద్యం వినియోగం, ముఖ్యంగా రెస్టారెంట్లలో క్షీణతకు దారితీసింది.

పబ్లిక్ లో జగన్ కు పరాభవం.. సన్మానాన్ని తిరస్కరించిన సీజేఐ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పబ్లిక్ లో పరాభవం జరిగింది. శనివారం విజయవాడలో న్యాయ స్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ ప్లస్ సెవన్ (7) నూతన భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వేదికపై   సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, సీఎం జగన్ ప్రసంగించారు. ఆనంతరం జస్టిస్ ఎన్ వి రమణకు సీఎం జగన్.. సన్మానం చేయాలని భావించారు. అందు కోసం వేదికపై సిహాసనం లాంటి కుర్చీ కూడా వేశారు. అయితే ఆ సన్మానానికి జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు.   సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఇదే వేదికపై ఉన్న ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరైన వారితోపాటు అక్కడే ఉన్న మీడియా సైతం ఆశ్చర్యపోయారు. స్వయంగా ముఖ్యమంత్రి సన్మానం చేయాలని భావించినా జస్టిస్ ఎన్వీరమణ నిరాకరించడంతో సన్మాన కార్యక్రమం జరగలేదు. కాగా తిరుపతి పర్యటన ముగించుకొని... సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విజయవాడ చేరుకొని.. ఓ హోటల్‌లో బస చేశారు. ఆయనతో ముఖ్యమంత్రి   జగన్‌తో  సతీసమేతంగా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో   జగన్ దంపతులు సమావేశమయ్యారు.  వారు అటు వెళ్లగానే.. ఇటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సీజేఐ ఎన్ వి రమణతో 20 నిమిషాలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎన్.వి.రమణను చంద్రబాబు శాలువా కప్పి... శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. అందుకు సంబంధించిన చిత్రాలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి. రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు పలుమార్లు వచ్చారు. తొలిసారిగా సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం జగన్ ఆయనను కలవలేదు. కానీ రెండో సారి ఆయన ఏపీలో పర్యటించినప్పుడు భారీగానే స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు.. ప్రత్యేకంగా ఆయనకు   జగన్ విందు కూడా ఇచ్చారు. కానీ ఆ సమయంలో జస్టిస్ ఎన్.వి. రమణను చంద్రబాబు కలవలేదు. అయితే ప్రస్తుతం విజయవాడ వచ్చిన జస్టిస్ ఎన్.వి.రమణను చంద్రబాబు కలిశారు. మరోవైపు జస్టిస్ ఎన్వీ రమణకు.. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. అందుకు ఇప్పటికే యూనివర్శిటీలో భారీ ఏర్పాట్లు చేశారు. జస్టిస్ ఎన్.వి.రమణ మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్నారు. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యు.యు. లలిత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

పంజ‌రంలో చిల‌క సిబిఐ, రంగు కాషాయం.. సిబ‌ల్‌

ఒక జాన‌ప‌ద క‌థ‌.. ఒక కోడి పొర‌పాటున రంగునీళ్లున్న తొట్టిలో ప‌డి క్ష‌ణం త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. త‌ర్వాత ఈక‌ల రంగు మారింద‌ని గ్రహించి ముందు భ‌య‌ప‌డుతుంది. ఆన‌క ఆ రంగుల ఈక‌ల కోడి అన్ని ప‌క్ష‌ల మీదా అజ‌మాయిషీ చేస్తుంది.   ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘పంజరంలో చిలుక’ సీబీఐ ఇప్పుడు బయటకు వచ్చిందని, దాని ఈకలు కాషాయ రంగు లో ఉన్నాయని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానం అమలు లో అక్రమాలు జరిగినట్లు ఆరో పిస్తూ సీబీఐ శుక్రవారం 20 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ అంశంపై కపిల్ సిబల్  స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. సీబీఐ పంజరంలో చిలుక వంటిదని సుప్రీంకోర్టు 2013లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.  సీబీఐ, ఒకప్పుడు ‘పంజరంలో చిలుక’ఇప్పుడు పంజరం నుంచి బయటపడింది.ఇప్పుడు దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయి. దాని రెక్కలు ఈడీ అది తన యజమాని చెప్పిన మాటలను పలుకుతుంది! అని  కపిల్ సిబల్ ట్వీట్ చేశారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఎదుగుతున్నారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ ని అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోం దని కపిల్ ఆరోపించారు.  ఇదిలావుండగా, మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలపై కాంగ్రెస్  స్పందిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిం ది. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం  అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సిసోడియా ఇంట్లో సీబీఐ  శుక్రవారం(ఆగ‌ష్టు 19) దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహమ్మద్ శనివారం మాట్లాడుతూ, ఎక్సయిజ్ విధానం అమలులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అల్కా లాంబా , అభిషేక్ దత్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్  అంతకుముందు మాట్లా డుతూ, బూటకపు కంపెనీలకు లిక్కర్ లైసెన్స్‌లను చట్టవిరుద్ధంగా పంపిణీ చేస్తున్నారని, కోట్లాది రూపాయల కుంభకోణం జరు గుతోందని జూన్ నెలలో అప్పటి ఢిల్లీ  పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు.  ఇదిలా వుండగా, తన వద్ద నుంచి తన కంప్యూటర్, ఫోన్, కొన్ని దస్తావేజులను సీబీఐ తీసుకెళ్లిందని మనీశ్ సిసోడియా చెప్పారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆరోపించారు. తదుపరి ప్రశ్నించేందుకు తనను సీబీఐ పిలవలేదన్నారు.  లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతోనే...ఢిల్లీ ఎక్సయిజ్ విధానం 2021-22ను అమలు చేయడంలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవ ర్నర్ వీకే జక్సేనా ఆదేశించడంతో సీబీఐ దాదాపు 20 చోట్ల సోదాలు నిర్వహించింది. మనీశ్ సిసోడియా ఇంట్లో దాదాపు 15 గంటలపాటు సోదాలు జరిగాయి.

సీజేఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ!

మ‌న దేశంలో ఎప్పుడైనా  ఏదైనా జరగొచ్చు. నేరాలూ, ఘోరాలు చేసిన వారికి రాచమర్యాదలు, బాధితులకు మానసిక వేదన కలుగే సంఘటనలు సామాన్యంగా మారిపోయాయి. హ‌త్య‌, మార‌ణ‌హోమం, అత్యాచారాల‌కు కాలంతో సంబంధం లేదు. బాధితుల్లో మరణించిన వారు మరణించగా, బతికున్న వారు ఎందుకు బ‌తికున్నామా అని జీవితాంతం ఏడుస్తుంటారు. నిందితులు మాత్రం చ‌ట్టాల లోపాల్ని అడ్డుపెట్టుకుని జైలు జీవితాన్ని మామూలుగానే గ‌డిపేసి, ఎంతో మారామ‌ని ఆస్కార్ న‌ట‌న ప్ర‌ద‌ర్శించి బ‌య‌ట ప‌డుతున్నారు. అలా బ‌య‌ట‌ప‌డ్డారు బిల్కిస్ బానో కేసులో నిందితులు. పైగా వారికి ఘ‌న స్వాగ‌త‌మూ ల‌భించింది. ఇలాంటి సంఘటనలతో మ‌నం ప్ర‌జాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మ‌రీ దారుణ‌మేమంటే దోషుల్ని కూడా కుల‌ గ‌జ్జితోనే చూడ్డం. ఇంత‌కంటే కుసంస్కారం మ‌రోటి ఉండ‌దు. దేశ‌భ‌క్తి గురించి భారీ ఉప‌న్యాసాలిచ్చే బీజేపీ మ‌హా నేత‌లు ఇలాంటి దోషులకు సంస్కార‌వంతులు అని లేబుల్ వేయ‌డాన్ని మించిన దారుణం మ‌రోటి ఉండ‌దు. అందుకే దేశంలో ప్ర‌జ‌లు, విప‌క్షాలు బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల విరుచుకుప‌డుతున్నారు.   ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఓ లేఖ రాశా రు. బిల్కిస్ బానోపై అ‌త్యాచారం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె 5 నెల‌ల గర్భిణీ అన్న విష‌యాన్ని త‌న లేఖ‌లో ప్ర‌స్తావించిన క‌విత‌, ఈ కేసులో దోషుల విడుద‌ల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందించాల‌ని, దేశ ప్ర‌జ‌ల్లో న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఇనుమ‌డింప జేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  కోరారు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను.. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకో వాలని జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆ లేఖ లో కోరారు. 2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా.. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం.. వారిని రెమిష‌న్ కి అనర్హులను చేయాలని లేఖలో ప్రస్తావించారు. రేప్ వంటి నేరాలు సామాజిక స్పృహను కుదిపేస్తాయనీ.. శిక్ష పడిన రేపిస్టులు స్వతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో.. ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతోందని కవిత లేఖ రాశారు. బిల్కిస్ బానో కేసును సీబీఐ  దర్యాప్తు చేసిందని.. సీబీఐ ప్రత్యే క కోర్టు వారికి శిక్ష విధించిందని గుర్తుచేశారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం.. విడు దల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని లేఖలో ప్రస్తావించారు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు.. కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్  ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. క్రిమినల్ అప్పీల్ నెంబరు 490-491/2011 కేసులో.. 2012 నవంబరు 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. 1992 నాటి విధానం స్థానంలో.. 2014లో సవరించిన రెమిషన్ విధానం వచ్చిందని కవిత గుర్తు చేశారు. ప్రభుత్వాలు రెమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించవద్దని.. స్వాభావిక ప్రక్రియ, వాస్తవిక దృష్టితో రిమి షన్ అధికా రాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని లేఖలో వివరించారు. 11 మంది దోషులను విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయంలో.. తగిన ప్రక్రియ, వాస్తవిక దృష్టిని పరిగణలోకి తీసుకున్నారో లేదో స్పష్టత లేదన్నారు. ఈ క్రూరమైన నేరం జరిగినప్పుడు బిల్కీస్ బానో వయస్సు 21 సంవత్సరాలు అని.. ఆమె ఐదు నెలల గర్భిణీ అని కవిత రాసిన లేఖలో ప్రస్తావించారు. రేపిస్టులు బయటకు రావడాన్ని.. ఈ పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బానో మనసు ముక్కలయ్యి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని.. దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కవిత సీజేఐని కోరారు. చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నాను అని కవిత లేఖ రాశారు.

లోకేష్ వ్యాఖ్యలతో.. వైసీపీలో వణుకు

జగన్  సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతకాలంగా దండయాత్ర ప్రారంభించారు. వైసీపీ నేతల భారీ కుంభకోణాన్ని త్వరలో బయటపెడతానని లోకేష్ చెప్పడంతో..  వైసీపీ నేతల్లో వణుకు స్టార్ట్ అయింది. లోకేష్ దెబ్బకు.. జగన్ రెడ్డి అబ్బా అనే రేంజ్ లో ఆ కుంభకోణం ఏదో బట్టబయలవుతుందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. లోకేష బయట పెడతానన్న కుంభకోణం ఏమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థుల తప్పుల గురించి సమాచారం ఏదైనా తెలిస్తే అప్పుటికప్పుడే ఎండగట్టేస్తాయి పొలిటికల్ పార్టీలు. జగన్ ప్రభుత్వంలో రహస్యంగా జరిగిన ఒక స్కామ్ గురించి ముందే చెప్పి బహిరంగం చేస్తానన్న లోకేష్ ధైర్యానికి తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. ‘రాష్ట్రంలో దొంగలు పడ్డారు’ అనే సినిమా త్వరలో  విడుదల అవుతుందని, దాని రిలీజ్ డేట్ ముందే చెప్పారు  లోకేష్. చినబాబు వేసిన బాంబ్ కు వైసీపీ నేతలు మాడి మసైపోతారనే టాక్  ఆంధ్రాలో జోరుగా నడుస్తోంది. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన నాటి నుండీ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేకుండాపోయిందని టీడీపీ నిప్పులు చెరుగుతూనే ఉంది. యువనేత లోకేష్ ఎప్పటికప్పుడు చేస్తున్న పోరాటంతో టీడీపీకి మైలేజ్ మరింతగా పెరిగిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  ఈ సారి లోకేష్ కొట్టే దెబ్బ వైసీపీ నేతలకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా చేయాలని టీడీపీ ప్రతి కార్యకర్తా భావిస్తున్నారని చెబుతున్నాయి. లోకేష్ బయటపెడతానన్న భారీ స్కామ్ ఏమిటో.. ఎలా ఉండబోతోందో అనే చర్చే ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో కొత్త చర్చకు తెర తీశాయి. ఇప్పుడు పట్టణాల నుండి రచ్చబండ వరకు లోకేష్ బయటపెట్టే స్కాం ఎలా ఉండబోదన్నదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. అంశపై పలువురు చర్చించుకుంటున్నారు.  

డుగ్గు డుగ్గుమ‌ని ఎన్‌ఫీల్డ్ మీదొచ్చేసింది!

పెళ్లి అన‌గానే అనేకానేక జాగ్రత్త‌లు తీసుకుంటూంటారు, మ‌గ‌, ఆడ పెళ్లివారు. ఇది ఇంటి ప‌రువుకి సంబంధించిన వ్య‌వ‌హా ర‌మూ కావ‌డంతో. పెళ్లి కూతురువాళ్లు పెద్ద ఎత్తున బాజాభ‌జంత్రీల‌తో పెళ్లి వేడుక ద‌గ్గ‌రికి వెళ్ల‌డం.. అంతా చూసి త‌రిం చాల్సిందే. పెద్ద‌ల్లో ఉండో గొప్ప ఆనందం చూసితీరాలి, పిల్ల‌లు .. రెండిళ్ల‌ వారూ క‌లిసిపోయి ఆడుకుంటూంటారు. ఇది చాలా స‌హ‌జంగా జ‌రిగేది. కానీ భారీ పెళ్లి డ్ర‌స్సు లో అమ్మాయి సిగ్గుప‌డుతూ రావ‌డం మాట అటుంచితే ఏకంగా పెళ్లి కూతురు బుల్లెట్ ఎక్కి వ‌చ్చింది! పెళ్లి మండపం ద‌గ్గ‌రికి పెళ్లి కూతురు రావ‌డం, పెళ్లి త‌ర్వాత అత్తారింటికి పంపే కార్య‌క్ర‌మాల‌తో రెండు కుటుంబాలూ కాస్తంత ఇమోష‌న్ కావ‌డం చాలా ప‌రిపాటి. అయితే కాల‌ క్ర‌మంలో అత్యాధునిక పోక‌డ‌లు చోటు చేసుకుని ఆ సంప్ర‌దాయాల‌ను కాస్తంత వెన‌క్కి నెడుతు న్నారు ఈ త‌రం త‌ల్లిదండ్రులు.  ఉత్త‌రాది పెళ్లిళ్ల‌లో బారాత్ పెద్ద స్థాయిలోనే జ‌రుగుతుంది. ఇరు కుటుంబాల వారూ ఎంతో గొప్ప‌గా చెప్పుకునే సంద‌ర్భం. పెళ్లి కొడుకు గుర్రం మీద వ‌స్తాడు. వెన‌క‌నే స‌గం ఊరు క‌దిలి వ‌చ్చిన‌ట్టు అత‌గాడి బంధుగ‌ణం అలంక‌ర‌ణ‌లు, ఆభ‌ర‌ణాల‌తో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతూంటారు. ఇదో సంప్ర‌దాయ వేడుకు. దీనికి అంద‌రూ మంత్ర‌ముగ్ధులు కావాల్సిందే.  కానీ ఇటీవ‌లే ఒక అమ్మాయి ఈ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిని పూర్తిగా కాద‌న్న‌ది. అంతేకాదు తానే మంచి డ్ర‌స్‌లో ఏకంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద పెళ్లి మండ‌పానికి వెళ్లింది. దారిలో అంతా అమితాశ్చ‌ర్యంతో చూసి ఉంటారు.  కానీ అలా అత్యాధునికంగా రావ‌డంలో, అంద‌ర్నీ అలా ఆక‌ట్టుకోవ‌డంలో ఆమె ఆనందానికి అంతే లేదు. బండి మీద రాగానే.. అదేవిటే, అలా దిగ‌బ‌డ్డావూ.. అంటూ వాళ్లింటో, వీళ్లింటో పెద్దామె ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేద‌ట‌! మేన‌మామ విసుక్కోలేదు, కాబోయే అత్త‌గారు మెటిక‌లు విర‌వ‌లేదు, మామ‌గారూ ఆగ్ర‌హించలేదు, పెళ్లి కొడుకు చిన్న‌బుచ్చుకోలేదు.. ఆమెను అలా రాగానే వెంట‌నే బండి నుంచి దింపి సాద‌రంగా, ఎంతో ప్రేమ‌తో అంద‌రూ పెళ్లి మండ‌పం మీద‌కి బంగారు త‌ల్లీ.. రావ‌మ్మా.. అంటూ దిష్టి తీసి మ‌రీ  తీసుకువ‌చ్చారు. అన్న‌ట్టు ఇలాంటి ప్ర‌య‌త్నాలు అక్క‌డేదో వూర్లో సాగింది.

డొక్కా డొంక తిరుగుడు.. ఉండవల్లికి విరుగుడు

వైసీపీలో ఏ నాయకుడిని ఎప్పుడు అందలమెక్కిస్తారో.. ఎప్పుడు అధ: పాతాళానికి తొక్కుస్తారో ఎవరూ ఊహించలేరు. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికే ఈ ఎత్తుపల్లాలు వైసీపీలో తప్పలేదు. పార్టీలో నంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత ఒక్కసారిగా జీరోగా మారిపోయారు. ఆ తరువాత మళ్లీ పార్టీలో ఆయనకు పూర్వవైభవం దక్కిందనుకోండి అది వేరే విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు వరుసగా వస్తాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా ఎంత మందో పార్టీలో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయిన వారు కనిపిస్తారు. ఇప్పుడు తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి అలా తయారైంది. జగన్ మనసు గ్రహించి మసులుకున్నఎమ్మెల్యేగా ఆమెకు మంచి గుర్తింపే దక్కింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆమె చెలరేగిన తీరు పార్టీ అధినేతను మెప్పించింది. రాజధాని కోసం గళమెత్తి ఆందోళనకు దిగిన వారందరినీ ఆమె పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు.  అమరావతి భూములన్నీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారివేనంటూ ఆరోపణలు గుప్పించారు. సరే ఆ వైభోగం ఇప్పుడు అయిపోయింది. ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తడంతో వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని దూరం పెడుతోంది. అంతేనే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని అన్యాపదేశంగా చెప్పేసింది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గ సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో పొమ్మన లేక పొగపెట్టినట్లేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఉండవల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలే వారి నియోజకవర్గానికి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తుంటారు. అయితే జగన్ మాత్రం ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను సమన్వయ కర్తగా నియమించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ఎమ్మెల్సీకీ రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆ తరువాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలోనే చేరారు. అలా చేరీ చేరగానే తాను రాజీనామా చేసిన ఎమ్మల్సీ పదవిని వైసీపీ నుంచి పొందారు. ఇప్పుడు గతంలో తాను రెండు సార్లు గెలిచిన తాడికొండ నియోజకవర్గానికి వైపీసీ సమన్వయ కర్తగా నియమితులయ్యారు. దీంతో ఉండవల్లి సీటుకు ఎసరు పెట్టేశారు. 

వైసీపీ కొంప‌ముంచిన భూమ‌న మ‌న‌సులో మాట‌!

మావోడు స‌క్ర‌మంగా ఉంటే, ఈపాటికి నేనేడో ఉండేవోడిని, ముచ్చ‌టగా కుర్చోరా అబ్బీ అంటే నా క‌మ‌తం నా యిట్టం.. అని వెన‌క‌టికి ఒకాయ‌న ఊరు వ‌దిలే ప‌రిస్థితి తెచ్చుకున్నాడు. నాయ‌కుడిని నాయ‌కులు, అభిమానులు ఆద‌రించాలి. ఆద‌రాభిమా నాలు కేజీల్లెక్కన మార్కెట్లో దొర‌క‌వు. సంపాదించుకోవాలి. తోటి వారే గేలిచేస్తే ఇక నాయ‌క‌త్వం ఎందుకు, కుర్చీల ద‌ర్జా ఎందుకు? ఇపుడు ఇదే ప‌రిస్థితి ఏపీలో వైసీపీ స‌ర్కార్ అనుభ‌వంలోకి వ‌చ్చింది. నైతిక‌త లేని రాజ‌కీయాలు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప‌త‌నం చెందిన వ్య‌క్తికి అధికారం వ‌స్తే చేయ‌గ‌లిగిందేమీ లేదంటూ ఏకంగా వైసీసీ ఎమ్మ‌ల్యే భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేదో ఆషామాషాగా, స‌ర్దాగా అన్న‌ది కాదు. మ‌న‌సులోంచి వ‌చ్చినదే. ఆయ‌న‌కు ఎప్ప‌టినుంచో ఉన్న అభిప్రాయ‌మే. కాబోతే పార్టీవారితో అన‌కుండా ఆ మాట సీజేఐ జ‌స్టిన్ ఎన్వీ ర‌మ‌ణ స‌మ‌క్షంలో అన‌డ‌మే వైసీపీలో గంద‌ర‌గోళానికి దారితీస్తోంది. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఎవ‌రి యిష్టా యిష్టాలు వారివి. అలాగ‌ని వేరేవాళ్ల‌మీద రుద్ద‌న‌వ‌స‌రం లేదు. కానీ ఇది భూమ‌న స్వంత అభిప్రాయం. ఇదే ఎక్క‌డినుంచో తెచ్చుకున్న‌ది కానే కాదు. అదే ప్ర‌క‌టించ‌డం ప్ర‌మాక‌రంగా మారింది. పైగా భూమన చేసిన వ్యా ఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తక ప్రతులను శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణాకర రెడ్డి మాట్లాడారు. పదవుల కోసం తల వంచేవాడిని కాదని, పదవుల కంటే నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపడమే గొప్పగా భావించేవాడినన్నారు. ఎమర్జెన్సీ సమ యంలో అరెస్టయి జైలు జీవితం గడిపిన సమయంలో ఎందరో మహామహులతో పరిచయం కావడం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.  గొప్ప గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణం కూడా అంతే గొప్పగా ఉండాలన్నారు. గాంధీ ఆత్మకథకు సంబం ధించి విస్మరించిన ఈకోణాన్ని ఇపుడు పదేపదే చదవాల్సిన అవసరముందన్నారు. గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితు డినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను ఇపుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట నిందితుడిగా చేతులు కట్టుకుని ఒప్పుకుంటున్నానన్నారు.  2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తీరని అన్యాయం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డానన్నారు. సభ సాక్షిగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నా నన్నారు.  స‌రే, భూమ‌న త‌న త‌ప్పుల‌ను కాయండ‌ని అన్నారు. తాను త‌ప్పుచేశాన‌ని అంగీక‌రించారు. ఇది గొప్ప మ‌న‌సుకి, వ్య‌క్తిత్వానికి తార్కాణం అంటున్నారంతా. త‌ప్పును ఇలా అంద‌రి స‌మ‌క్షంలో అంగీక‌రించ‌డానికి ఎంతో ధైర్యం కావాల‌ని,భూమ‌న త‌న త‌ప్పు ను అంగీక‌రించడం చిన్న విష‌యం కాద‌ని ఏకంగా జ‌స్టిస్ ర‌మ‌ణ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు.  ప్రస్తుత రాజకీయాల తీరుపై జస్టిస్‌ రమణ వేదనా భరితమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఏవగించుకుని, అసహ్యించుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, విలువలు, నిజాయితీ కలిగిన వ్యక్తులను, అవినీతికి పాల్పడని వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముం దన్నారు. సత్యశోధన... ప్రతి రాజకీయ నాయకుడూ చదవాల్సిన మొదటి, చివరి పుస్తకంగా ఆయన అభివర్ణించారు. అయితే ఇదంతా భూమ‌న ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని నాయ‌కుడిని మొట్టికాయ‌లు వేయించాల‌న్న ఆలోచ‌న‌తో చేశారా అన్న అనుమానం విశ్లేష‌కుల‌కు ఉండ‌నే ఉంది. అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో భేటీ అయి మ‌రీ త‌న మ‌న‌సులో ఏమున్న ది, ఎంత‌లా బాధ‌ప‌డుతున్నాన‌న్న‌ది స్ప‌ష్టం చేయ‌వ‌చ్చు. కానీ పార్టీ సీనియ‌ర్ల‌కు త‌న‌ను క‌లిసి చ‌ర్చించేందుకు అవ‌కాశం ఇవ్వ డం లేదా, పార్టీవ‌ర్గాల‌ను, అభిమానుల‌ను రోడ్ల‌మీద ప‌డి పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌న్న ఆదేశాల‌తోనే దూరంగా పెడుతు న్నారా, హెచ్చ‌రిక‌ల‌తో ఎలాంటి ఫిర్యాదులు, అభ్య‌ర్ధ‌న‌ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డం లేదా అన్న‌ది తేల‌వ‌ల‌సి ఉంది. మంత్రులు, ఎమ్మె ల్యేలు ఇక మిగిలిన పాల‌నా కాలాన్ని ఎలాగో అలా నెట్టుకెళ్లి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి గ‌ట్టి కృషి చేసి తీరాల‌ని గ‌ట్టి హెచ్చ‌రి క‌లు చేస్తుండ‌డం, పార్టీ ప‌రంగా రాష్ట్రంలో త‌గ్గుతోన్న ప్ర‌తిష్ట కూడా జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌నే అనాలి. అధికారంలో ఉండ‌గానే నాలుగు ప‌నులు చేసి న‌లుగుర్ని ఆక‌ట్టుకోవాల‌న్న ధ‌ర్మ‌సూత్రాన్ని నాలుగు రాళ్ల సంపాద‌నే అనే స్వీయ సూత్రాల ఆలోచ‌న‌తో క‌ట్టిప‌డేయ‌డం ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌కు వైసీపీ సర్కార్ దూర‌మ‌యింద‌నే విశ్లేష‌కులు అంటున్నారు.

అన్న‌కు మించి చెల్లి!

అన్న‌ద‌మ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కాచెల్లెళ్ల మ‌ధ్య కొన్ని పోలిక‌లు చిత్రంగా క‌లుస్తాయి. చ‌దువు, సంస్కారం అవ‌త‌ల పెడితే, అస‌లు వ్య‌వ‌హార‌తీరు, ఆలోచ‌నా తీరు స‌రిగ్గా న‌ప్పేట్టు ఉంటారు ఉత్త‌ర కొరియా అధినేత కిమ్, ఆయ‌ న సోద‌రి యో జోంగ్‌. అస‌లే కొరియా ద్వీప‌ క‌ల్పంలో ఉద్రిక్త‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగు తోంది. ఇక లాభం లేద‌ని ద‌క్షిణ కొరియా వారు ఒక ప్ర‌తిపాద‌న చేశారు. కానీ కిమ్ కంటే మొండివాడు ఎవ‌రుంటారు? అందుకునే ద‌క్షి ణాది వారి మాట వినేదే లే.. నేను త‌గ్గేదేలే.. అనుకుని కిమ్ అణ్వాయుధాల‌ను ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని అన్నాడు. ద‌క్షిణాదివారు ఎవ‌రికి ఏమ‌ని న‌చ్చ‌జెప్పాల‌నుకున్నారు. ముందే ఉలిపిక‌ట్టె, కోపిష్టి అలాంటివారికి పోనీ ఈ పూట వింటాడేమోన‌నుకోవ‌డినికి ఆయ‌నే మ‌న్నా పెద్ద‌బావ‌గారా.. చేప‌ల‌పులుసు తిన్న వ్యామోహంలో ఓకే అన‌డానికి! ప్రత్యర్థులపై విరుచుకుపడటంతో ఉత్తర కొరియా  అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నకు తగ్గ చెల్లెలు అనిపిం చుకుంటోంది. ఈ విషయంలో ఆయన కంటే జోంగ్ రెండాకులు ఎక్కువే చదివిందనీ తేల్చింది.  తాజాగా, చర్చల విష యమై దక్షిణ కొరియా చేసిన ప్రతిపాదనపై తనదైన శైలిలో కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చింది. అణ్వాయుధాలను వదిలిపెడితే ఆర్థిక సా యం చేస్తామని దక్షిణ కొరియా చేసిన ప్రకటనపై ఆమె ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణ కొరియా ఆఫర్‌ అని.. చర్చలపై కలలు కనడం మానుకోవాలని బదులిచ్చారు. కేవలం తిండి కోసం ఎవరూ తమ లక్ష్యాలను వదలుకోరని.. ఇదో పనికిమాలిన ప్లాన్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కొంచెం నోరుమూసుకుంటే మంచిదని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని వ్యాఖ్యానించిన కియ్ యో.. వాటిని పిల్లచేష్టలతో పోల్చారు. యూన్ ప్రతిపాదన నీలి సముద్రాన్ని ఎండబెట్టి మల్బరీ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నించినంత తెలివితక్కువగా ఉంది.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను వదిలించుకునే ఉద్దేశం లేదు.. ఇవి ఆయుధాలు రాజకీయాలకు సంబంధించిన బేర సారాలు కాదు.. యూన్ సుక్ యోల్‌ను మేం మనిషిగా ఇష్టపడం.. మేలో పదవీ బాధ్యతలు స్వీకరించిన సంప్రదాయవాద దక్షిణ కొరియా నేత విషయంలో ప్యాంగ్‌యాంగ్ కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని ప్రతిజ్ఞ చేశారు. ఒక వేళ ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదిలిపెడితే సాహసోపేతమైన చొరవ తీసుకుని ఆహారం, ఎనర్జీ, మౌలిక సౌకర్యాల సాయానికి ముందుకొస్తామని ఈ వారం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌ను ఉత్తర కొరియా తిరస్క రించింది. మరోవైపు, కిమ్ యో జోంగ్‌ వ్యాఖ్యలపై స్పందించిన దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం.. కిమ్‌ సోదరి కామెంట్లు విచారకరమని పేర్కొంది. అయినా సరే ఇప్పటికీ తమ ఆఫర్‌ అందుబాటులో ఉందని పునరుద్ఘాటించింది.

మ‌త రాజ‌కీయాల‌కంటే మునావ‌ర్ ప్ర‌మాదకారా?!

అత్త‌మ్మ తిట్టినందుకు కాదు తోటికోడ‌లు న‌వ్వింద‌ని కోప‌గించుకుందిట‌.. వెన‌క‌టి ఒకామె. అలా ఉంది ఎమ్మెల్యే రాజాసింగ్ వ్య‌వ హారం. దేశంలో మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షో అంటే గొప్ప క్రేజ్ ఉంది. ఆయ‌న త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లోనూ షో కి అంగీక‌రించ డంతో ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. టికెట్లు ఇప్ప‌టికే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. దేశంలో మునావ‌ర్ కి షారూ ఖ్ ఖాన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. మునావ‌ర్ షోని అడ్డుకుంటామ‌ని బీజేపీ ఎమ్మ‌ల్యే రాజాసింగ్, బీజేవైఎం  నేత‌లు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రతా చర్యల దృష్ట్యా శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదా స్పదంగా మారాయి. కర్ణాటక లో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్ కొనసాగుతోంది. హైదరాబాద్‌ లోనూ మునావర్ షో లు నిర్వహించకూడదంటూ రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు  పోలీసు బందోబస్తు ఉంటుందని డీసీపీ వెల్లడించారు.  దేశ‌రాజ‌కీయాల్లో స్వేచ్ఛ‌కు ఆట్టే తావు లేదు. త‌న‌కు న‌చ్చిన విధంగానే కామెంట్లు రాయాలి, చెప్పాలి, ఉద‌హ‌రించాలే గాని వేరే మార్గంలో తిట్టినా, ప్ర‌చారం చేసినా ప్ర‌భుత్వం అస్స‌లు అంగీక‌రించ‌దు. విప‌క్షాల నుంచి బూతు పురాణాన్ని విమ‌ర్శ‌నాస్త్రాలుగా అంగీక‌రిస్తున్న ప్ర‌బుత్వాలు వారి ప‌థ‌కాలు, పాల‌నా విధానాన్ని విమ‌ర్శిస్తూ చేసే కామెడీ షోకి అడ్డుప‌డ‌టం కేంద్ర ప్రభుత్వం బ‌ల హీన‌త‌నే చూపుతుంది. దేశంలో విప‌క్షాలు, ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్తితుల్లోనూ బీజేపీవారిని భ‌జ‌న చేయాల‌న్న ధోర‌ణినే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం హెచ్చ‌రించ‌డం ఇలాంటి వ్య‌తిరేక‌త‌ల‌కూ దారితీస్తున్న‌ది.  పూర్వం కార్టూన్ల‌కు నాయ‌కులు న‌వ్వుకుని అవునా, ఇలా అన్నానా.. అంటూ స‌ద‌రు కార్టూనిస్టుని, ప‌త్రిక‌నూ మెచ్చుకునే వారు. అంటే నాయ‌కుడిలో లోపాలు తెలియ‌జేయ‌డం మీడియా ప‌రిమితుల్లోనే చేస్తుంది. కానీ కామెడీ షోలు, టీవీలో వ‌చ్చే ప్ర‌త్యే క టాక్ షోల‌లో  పార్టీ లేదా ప్ర‌భుత్వ విధానాల మీద చేసే కామెంట్ల‌ను అలానే తీసుకోవాలి గాని చాలా సీరియ‌స్‌గా తీసుకు ని హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంలో ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను తామే తీసుకున్న‌ట్టే అవుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. కాగా మునావ‌ర్ షో విష‌యానికి వ‌స్తే, అత‌ను భార‌తీయ‌త‌ను వెక్కిరిస్తున్నాడంటూ చేస్తున్న విమ‌ర్శ‌లు అత‌న్ని త‌ప్ప‌కుండా శిక్ష‌కు గురిచేస్తాయి. కానీ కేంద్రం అలాంటి చ‌ర్య‌లు, హెచ్చ‌రిక‌లూ జారీ చేసిన దాఖ‌లాలు లేవు. అయితే త‌మ‌ను ప‌ల్లెత్తు మాట అన్నా, చిన్న గీత అంత విముఖ‌త ప్ర‌ద‌ర్శించినా బీజేపీ బొత్తిగా భ‌రించ‌లేని ఉలిపిక‌ట్టెగా మారింది. క‌నుక మునావ‌ర్ లాంటివారి షోలు నిర్వ‌హించ‌డానికి అనేక‌మంది అనుమ‌తులు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి. దేశంలో స్వాతంత్ర్యం లో స్వేచ్ఛ లేద‌న్న‌ది బీజేపీ వార‌కే స్ప‌ష్టం చేస్తున్నారు. వారి నీడ‌న ప‌డున్నామ‌న్న ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించే రాజ‌కీయాలు దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మే. మోదీ, షా ద్వ‌యం ఇలాంటి కాషాయ‌రంగు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌లికితేనే మ‌న‌, మ‌న‌వాళ్లు అన్న ధోర‌ణికి ప‌ట్టు ఉంటుంది. స్వేచ్ఛ లేని చోట ప్ర‌జా జీవితం స్తంభిస్తుంది. స్వేచ్ఛ పేరుకే ఉన్న పాల‌న‌లో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని,  స‌సేమీరా గౌర‌వించ‌రు.  

పనికి మాలిన పోలీసు అధికారి సునీల్ కుమార్!

న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు అధికార వైసీపీ చేయని ప్రయత్నం లేదు.. ఉపయోగించుకోని వ్యవస్థ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. గోరంట్ల మాధవ్ ను కాపాడుకోవడం కోసం తప్పుమీద తప్పు చేస్తూ వైసీపీ సర్కార్ జనం ముందు దోషిగా నిలబడింది. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో ఏం సంబంధమూ లేని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన వివరణపై తెలుగుదేశం నాయకులు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. మాజీ పోలీసు అధికారి, తెలుగుదేశం నాయకుడు అయిన వర్ల రామయ్య గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ యాదవ్ తీరు అధికార పార్టీకి కొమ్ముగాయడం కోసమే ఏపీసీఐడీ ఉందా అన్న అనుమానాలకు తావిస్తోందని   విమర్శలు గుప్పించింది.  అసలు విషయాన్ని వదలి మాధవ్ ను కాపాడేందుకు మసిపూసి మారేడు కాయ చేసే విధంగా  సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారనీ, ఆయనో పనికిమాలిన పోలీసు అధికారి అని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య అన్నారు.  మాధవ్ అశ్లీల చిత్రంపై సమగ్ర విచారణ జరిపితే ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన సునీల్ కుమార్, ఫకీరప్పతో ఈ వ్యవహరంలో మాధవ్ కు అనుకూలంగా మాట్లాడిన   పోలీసు అధికారులంతా జైలుకు వెళతారని వర్ల అన్నారు. ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్న పోలీసు అధికారులు..  ఎటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఫారిన్ ఏజన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు.  వాస్తవానికి మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంలో పోలీసుల విచారణకు ఎటువంటి ఫిర్యాదు అవసరం లేదు.  ఐపిసి సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 294 (ఎగ్జిబిషన్ ఆఫ్ అబ్ సీన్ యాక్ట్), 506 (క్రిమినల్ ఇంటిమినేషన్), 590 (ఎక్స్ పోజింగ్ అబ్ సీన్ ఆబ్జెక్ట్స్, అబ్ సీన్ వర్డ్స్ యాక్ట్ టు ఉమెన్), ఐటి సెక్షన్ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపడం పోలీసు విధుల్లో భాగమని గుర్తు చేశారు. ఆ అశ్లీల వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగినా చట్ట ప్రకారం శిక్షార్హమేనని వర్ల అన్నారు.  ఫిర్యాదు చేయకపోతే ఏమీ చేయలేమని పోలీసులు చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. పట్టాభి రిపోర్టు తెచ్చారు కాబట్టి ఆ రిపోర్టు ఒరిజినల్ కాదని చెప్పించి సిఎం కళ్లలో ఆనందం చూడాలన్న తాపత్రేయమే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లో కనబడుతోందని అన్నారు. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సునీల్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలో కూడా స్టాఫోర్డ్ ఎక్కడా ఆ నివేదిక అబద్దమని చెప్పలేదు. ఈ విషయాలు మాట్లాడుతున్న తనపై కూడా  రేపో,మాపో   కేసు పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు.   ఇక తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనిత అయితే  తప్పుడు పనిచేసిన  ఎంపీ గోరంట్ల మాధవ్ ను రక్షించాలనే తపనతో   ప్రభుత్వం పోలీసు శాఖను వాడుకుంటున్న తీరు   ‘పాపం పోలీసులు’అనిపించేలా ఉందని  అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదికను   పట్టాభి బయట పెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారని అసలు సీఐడీకి ఈ కేసు ఎవరు అప్పగించారని నిలదీశారు. సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును  పోలీసులు   డీజీపీకి రిపోర్టు ఇచ్చిన తరువాత సీఐడీకి రిఫర్ చేస్తేనే ఆ ఫైల్ సీఐడీకి వెళుతుందని అధికారులు చెప్పినట్లు తెలిపారు.  డీజీపీ, సీఐ పకీరప్ప పక్కకు వెళిపోయి, అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ బయటి కొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని ప్రశ్నించారు.  ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోనవసరం లేదని సునీల్ కుమార్ చెప్పి, ఆ ల్యాబ్ కు మెయిల్ ఎందుకు పంపిచారని నిలదీశారు.  తనకు సంబంధించి అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే గోరంట్ల మాధవ్ ఫిర్యాదు ఎందు చేయలేదని అడిగారు.  

పని తీరే ప్రామాణికం.. గెలుపు గుర్రాలకే టికెట్టు.. చంద్రబాబు స్పష్టీకరణ

పార్టీ అధినేత‌తో నాలుగు మాట‌లు మాటాడినంత మాత్రాన ఆయ‌న దృష్టిలో గొప్ప నాయ‌కుడు అయిపోరు, నాలుగు ఫోటోలు తీసుకున్నంత మాత్రాన జ‌నాల్లో ప‌ర‌ప‌తి పెరిగిపోతుంద‌నుకోవ‌డ‌మూ పొర‌పాటే. రాజ‌కీయాల్లో పైకి రావాలంటే   పార్టీ కోసం పాటుప‌డాలి. పార్టీ విజ‌యం కోసం కృషి చేయాలి. ఎన్నిక‌లు ఏవ‌యినా స‌రే పార్టీకి త‌న వం తు కృషి చేయ‌డ‌మే పార్టీ అధినేత‌ను గౌర‌వించ‌డంతో స‌మానం. ఏపీలో మారుతున్న రాజ‌కీయ‌ ప‌రిణామాల దృష్ట్యా తెలుగు దేశం పార్టీకి అధికారంలోకి రావ‌డానికే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో ఇంత కాలం పార్టీని పట్టించుకోకుండా మొహం చాటేసిన నేతలంతా మేమే తోపులం అంటూ ముందుకు వస్తున్నారు.  చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొని తమకే టికెట్ ఖరారైపోయిందంటూ లీకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఈ విషయంలో పార్టీ నాయకులకు, క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరికీ టికెట్ కన్ ఫర్మ్ చేయలేదని విస్పష్టంగా చెప్పారు. నియోజకవర్గ సమీక్షకు హాజరైనంత మాత్రాన టికెట్ కన్ ఫర్మ్ అయినట్లు కాదని, పార్టీ టికెట్ దక్కాలంటే పనితీరే ప్రామాణికమని తేల్చేశారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వ  తీరు ప‌ట్ల ప్ర‌జ లు విసుగెత్తారు. జగన్ పథకాలు, ప్ర‌కటనలు ఒట్టి డొల్ల అన్న గ్రహింపునకు జనం వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం దూకుడు పెంచింది. ప్ర‌తీ ప్రాంతంలోనూ చిన్న‌, పెద్ద నాయ‌కుల‌ను స‌మ‌ర స్పూర్తితో ముంద‌డుగు వేయా ల‌ని ఆ పార్టీ అధినే చంద్ర‌బాబునాయుడు పార్టీ నేతలకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ చార్జీలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిగో ఈ సమీక్షలను ఆసరాగా చేసుకునే కొందరు తమకు పార్టీ టికెట్ అధినేత ఖరారు చేసుకున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వదంతులు వ్యాపింప చేస్తున్నారు. వీటికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టిగా చెక్ పెట్టారు.  వదంతులు నమ్మొద్దనీ, ఎవరికీ తాను పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయలేదనీ విస్పష్టంగా చెప్పారు. ఈ సారి గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారు.   పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవడం భ్రమేనని తేల్చేశారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో   భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​లతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించి.. వారి పనితీరును సమీక్షించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని..పార్టీ నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు మరింత దూకుడు పెంచాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో..సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. మొదటి రోజు అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం,సంతనూతలపాడు నియోజకవర్గాల ఇంచార్జ్ లతో భేటీ అయ్యారు. ఆయా ఇంఛార్జ్ లతో ప్రత్యేకంగా జరిగిన ముఖాముఖిలో...పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, బాదుడే బాదుడు కార్యక్రమం, ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ...నేతల పనితీరుపై చర్చించారు. నియోజవకర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఆయా నియోజకవర్గాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఇంచార్జ్ లతో మాట్లాడి...సూచనలు చేశారు. రానున్న ఏడాది కాలమే అత్యంత కీలక మని అలస త్వం వీడి ప్రణాళికతో పని చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే పలు కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు పాల్గొన డంతో పాటు స్థానిక సమస్యలపైనా పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి పైనా స్థాని కంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు.  నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు.ఫలానా వారికి పార్టీ టికెట్ ఖరారైంది అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారందరికీ టికెట్ ఖాయమంటూ జరుగుతున్న ప్రచారాన్ని విశ్వసించొద్దని విస్పష్టంగా తేల్చేశారు. ఈ సారి తాను గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లిస్తానని స్పష్టం చేశారు. నేతల పని తీరుపై ప్రతి మూడు నెలలకు ఒక సారి సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ టికెట్ విషయంలో పని తీరే ప్రామాణికమని, గెలిచే వారికే టికెట్లని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు. రానున్న రోజులలో నియోజవకర్గాల ఇన్ చార్జిలతో ఇదే తరహా సమీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. 

నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిపై  నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.  నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం విదితమే.  నిత్యానంద మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో  విచారణ కొనసాగుతోంది. అయితే  2019 నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో  బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు నిత్యానందపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిత్యానంద ‘కైలాసం’ పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు అప్పట్లో కలకలం రేపాయి. తాను ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నట్లు నిత్యానంద ప్రకటించారు. ఆ దీవికే  కైలాసం అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్‌ ప్రభుత్వం పేర్కొంది. విచారణకు హాజరు కావాలని గతంలోనూ ఆయనకు బెంగళూరులోని కోర్టు వారెంట్‌ జారీ చేయగా, ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. గతంలో నిత్యానంద స్వామి అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత భారత్ విడిచి పారిపోయారు. దీంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం 2020లో రద్దు చేసింది. బిడది ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఆయన ఆశ్రమంలో ఉంటున్న ఓ వివాహిత మహిళ 2010లో బిడది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యానందతో పాటు ఆయన శిష్యులు కొందరిని అరెస్టు చేసి రామనగర జైలుకు పంపించారు. కొంతకాలం పాటు నిత్యానంద జైలు జీవితం గడిపారు.   బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద ఆ తరువాత  2019 వరకు కోర్టు విచారణ హాజరయ్యారు.  2019 వరకు బహిరంగంగా కనిపించిన నిత్యానంద ఆ తరువాత పరారైయ్యారు. కైలాసం అనే దేశాన్ని సొంతంగా స్థాపించుకున్న నిత్యానంద ఆ  దేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రకటనలు గుప్పించారు.   దేశం వదిలిపారిపోయిన నిత్యానందకు వ్యతిరేకంగా ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.   ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది.   నిత్యానంద బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నిత్యానంద కోర్టుకు హాజరుకాకపోతే షూరిటీ ఇచ్చిన వ్యక్తి ఆస్తిని జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది అంటున్నారు. మొత్తం మీద నిత్యానందకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ కావడంతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం.. జాతి విద్వేష దురహంకారం!

అమెరికాలో గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. జాతి విద్వేష దురహంకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  న్యూయార్క్‌ సౌత్‌ రిచ్‌మండ్‌ హిల్‌లోని శ్రీ తులసీ మందిర్‌ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంన్ని కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆ ఫుటేజీల్లో స్పష్టం అవుతోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహ ధ్వంసానికి పూనుకోగా, ఆ తరువాత  మరికొందరు వచ్చి  చేరారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరువాత వారంతా రెండు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు.  ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారంతా పాతిక, 30 ఏళ్ల మధ్యవయస్కులేనని చెబుతున్నారు. కాగా ఈ ఘటనను భారత్ తీవ్రండగా ఖండించింది.  న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళింది. న్యూయార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరగడం గడిచినరెండు వారాల్లో ఇది రెండో సారి. తాజాగా దాడిలో  దుండగులు పెయింట్‌తో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.  ఆగస్టు 3న కూడా ఇదే విగ్రహంపై దాడి జరిగింది. గాంధీ విగ్రహంపై దాడి ఘటనను న్యూయార్క్‌ స్టేట్‌ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్‌ రాజ్‌ కుమార్‌ ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.