మత రాజకీయాలకంటే మునావర్ ప్రమాదకారా?!
posted on Aug 20, 2022 @ 11:50AM
అత్తమ్మ తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్విందని కోపగించుకుందిట.. వెనకటి ఒకామె. అలా ఉంది ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవ హారం. దేశంలో మునావర్ ఫారూఖీ కామెడీ షో అంటే గొప్ప క్రేజ్ ఉంది. ఆయన త్వరలో హైదరాబాద్‌లోనూ షో కి అంగీకరించ డంతో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. టికెట్లు ఇప్పటికే దాదాపు అన్నీ అమ్ముడుపోయాయి. దేశంలో మునావర్ కి షారూ ఖ్ ఖాన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. మునావర్ షోని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్, బీజేవైఎం నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఊరుకునేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రతా చర్యల దృష్ట్యా శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదా స్పదంగా మారాయి. కర్ణాటక లో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్ కొనసాగుతోంది. హైదరాబాద్ లోనూ మునావర్ షో లు నిర్వహించకూడదంటూ రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు పోలీసు బందోబస్తు ఉంటుందని డీసీపీ వెల్లడించారు.
దేశరాజకీయాల్లో స్వేచ్ఛకు ఆట్టే తావు లేదు. తనకు నచ్చిన విధంగానే కామెంట్లు రాయాలి, చెప్పాలి, ఉదహరించాలే గాని వేరే మార్గంలో తిట్టినా, ప్రచారం చేసినా ప్రభుత్వం అస్సలు అంగీకరించదు. విపక్షాల నుంచి బూతు పురాణాన్ని విమర్శనాస్త్రాలుగా అంగీకరిస్తున్న ప్రబుత్వాలు వారి పథకాలు, పాలనా విధానాన్ని విమర్శిస్తూ చేసే కామెడీ షోకి అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వం బల హీనతనే చూపుతుంది. దేశంలో విపక్షాలు, ప్రజలు ఎలాంటి పరిస్తితుల్లోనూ బీజేపీవారిని భజన చేయాలన్న ధోరణినే బీజేపీ కేంద్ర నాయకత్వం హెచ్చరించడం ఇలాంటి వ్యతిరేకతలకూ దారితీస్తున్నది.
పూర్వం కార్టూన్లకు నాయకులు నవ్వుకుని అవునా, ఇలా అన్నానా.. అంటూ సదరు కార్టూనిస్టుని, పత్రికనూ మెచ్చుకునే వారు. అంటే నాయకుడిలో లోపాలు తెలియజేయడం మీడియా పరిమితుల్లోనే చేస్తుంది. కానీ కామెడీ షోలు, టీవీలో వచ్చే ప్రత్యే క టాక్ షోలలో పార్టీ లేదా ప్రభుత్వ విధానాల మీద చేసే కామెంట్లను అలానే తీసుకోవాలి గాని చాలా సీరియస్‌గా తీసుకు ని హెచ్చరికలు జారీ చేయడంలో ప్రభుత్వ ప్రతిష్టను తామే తీసుకున్నట్టే అవుతుందన్నది విశ్లేషకుల మాట. కాగా మునావర్ షో విషయానికి వస్తే, అతను భారతీయతను వెక్కిరిస్తున్నాడంటూ చేస్తున్న విమర్శలు అతన్ని తప్పకుండా శిక్షకు గురిచేస్తాయి.
కానీ కేంద్రం అలాంటి చర్యలు, హెచ్చరికలూ జారీ చేసిన దాఖలాలు లేవు. అయితే తమను పల్లెత్తు మాట అన్నా, చిన్న గీత అంత విముఖత ప్రదర్శించినా బీజేపీ బొత్తిగా భరించలేని ఉలిపికట్టెగా మారింది. కనుక మునావర్ లాంటివారి షోలు నిర్వహించడానికి అనేకమంది అనుమతులు అవసరమవుతున్నాయి. దేశంలో స్వాతంత్ర్యం లో స్వేచ్ఛ లేదన్నది బీజేపీ వారకే స్పష్టం చేస్తున్నారు. వారి నీడన పడున్నామన్న ధోరణిలో వ్యవహరించే రాజకీయాలు దేశానికి ప్రమాదకరమే. మోదీ, షా ద్వయం ఇలాంటి కాషాయరంగు రాజకీయాలకు స్వస్తి పలికితేనే మన, మనవాళ్లు అన్న ధోరణికి పట్టు ఉంటుంది. స్వేచ్ఛ లేని చోట ప్రజా జీవితం స్తంభిస్తుంది. స్వేచ్ఛ పేరుకే ఉన్న పాలనలో ప్రజలు ప్రభుత్వాన్ని, ససేమీరా గౌరవించరు.