పనికి మాలిన పోలీసు అధికారి సునీల్ కుమార్!
posted on Aug 20, 2022 @ 11:44AM
న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు అధికార వైసీపీ చేయని ప్రయత్నం లేదు.. ఉపయోగించుకోని వ్యవస్థ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. గోరంట్ల మాధవ్ ను కాపాడుకోవడం కోసం తప్పుమీద తప్పు చేస్తూ వైసీపీ సర్కార్ జనం ముందు దోషిగా నిలబడింది. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో ఏం సంబంధమూ లేని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన వివరణపై తెలుగుదేశం నాయకులు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.
మాజీ పోలీసు అధికారి, తెలుగుదేశం నాయకుడు అయిన వర్ల రామయ్య గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ యాదవ్ తీరు అధికార పార్టీకి కొమ్ముగాయడం కోసమే ఏపీసీఐడీ ఉందా అన్న అనుమానాలకు తావిస్తోందని విమర్శలు గుప్పించింది. అసలు విషయాన్ని వదలి మాధవ్ ను కాపాడేందుకు మసిపూసి మారేడు కాయ చేసే విధంగా సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారనీ, ఆయనో పనికిమాలిన పోలీసు అధికారి అని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య అన్నారు. మాధవ్ అశ్లీల చిత్రంపై సమగ్ర విచారణ జరిపితే ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన సునీల్ కుమార్, ఫకీరప్పతో ఈ వ్యవహరంలో మాధవ్ కు అనుకూలంగా మాట్లాడిన పోలీసు అధికారులంతా జైలుకు వెళతారని వర్ల అన్నారు.
ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్న పోలీసు అధికారులు.. ఎటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఫారిన్ ఏజన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు. వాస్తవానికి మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంలో పోలీసుల విచారణకు ఎటువంటి ఫిర్యాదు అవసరం లేదు. ఐపిసి సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 294 (ఎగ్జిబిషన్ ఆఫ్ అబ్ సీన్ యాక్ట్), 506 (క్రిమినల్ ఇంటిమినేషన్), 590 (ఎక్స్ పోజింగ్ అబ్ సీన్ ఆబ్జెక్ట్స్, అబ్ సీన్ వర్డ్స్ యాక్ట్ టు ఉమెన్), ఐటి సెక్షన్ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపడం పోలీసు విధుల్లో భాగమని గుర్తు చేశారు.
ఆ అశ్లీల వ్యవహారం నాలుగు గోడల మధ్య జరిగినా చట్ట ప్రకారం శిక్షార్హమేనని వర్ల అన్నారు. ఫిర్యాదు చేయకపోతే ఏమీ చేయలేమని పోలీసులు చెప్పడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. పట్టాభి రిపోర్టు తెచ్చారు కాబట్టి ఆ రిపోర్టు ఒరిజినల్ కాదని చెప్పించి సిఎం కళ్లలో ఆనందం చూడాలన్న తాపత్రేయమే ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లో కనబడుతోందని అన్నారు. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. సునీల్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలో కూడా స్టాఫోర్డ్ ఎక్కడా ఆ నివేదిక అబద్దమని చెప్పలేదు. ఈ విషయాలు మాట్లాడుతున్న తనపై కూడా రేపో,మాపో కేసు పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనిత అయితే తప్పుడు పనిచేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ ను రక్షించాలనే తపనతో ప్రభుత్వం పోలీసు శాఖను వాడుకుంటున్న తీరు ‘పాపం పోలీసులు’అనిపించేలా ఉందని అన్నారు.
గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదికను పట్టాభి బయట పెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారని అసలు సీఐడీకి ఈ కేసు ఎవరు అప్పగించారని నిలదీశారు. సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును పోలీసులు డీజీపీకి రిపోర్టు ఇచ్చిన తరువాత సీఐడీకి రిఫర్ చేస్తేనే ఆ ఫైల్ సీఐడీకి వెళుతుందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. డీజీపీ, సీఐ పకీరప్ప పక్కకు వెళిపోయి, అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ బయటి కొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోనవసరం లేదని సునీల్ కుమార్ చెప్పి, ఆ ల్యాబ్ కు మెయిల్ ఎందుకు పంపిచారని నిలదీశారు. తనకు సంబంధించి అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే గోరంట్ల మాధవ్ ఫిర్యాదు ఎందు చేయలేదని అడిగారు.