అద్భుత నటుడు జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో ఎన్టీఆర్ తో లంచ్ భేటీ తరువాత.. ఆయనతో భేటీ ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ ట్వీట్ చేశారు. ఆయనో అద్భుత నటుడని పేర్కొన్న అమిత్ షా.. ఆయన ఇటీవల నటించిన సినీమాలో ఆయన నటన చూసిన తరువాత ఆయనను ఒక సారి కలవాలని భావించాననీ, ఆయనతో భేటీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభ అనంతరం అమిత్ షా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ను తనతో డిన్నర్ సమావేశానికి అమిత్ షా ఆహ్వానించిన సంగతి విదితమే. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌కు అమిత్ షా పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. వీరి మధ్య ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగింది. అందులో దాదాపు 20 నిమిషాల సేపు అమిత్ షా, ఎన్టీఆర్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం అమిత్ షా, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి భోజనం చేశారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్టీఆర్ నటన, రాజకీయ జీవితం గురించిన ప్రస్తావన వచ్చిందని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన విశ్వామిత్ర, దానవీర శూర కర్ణ తదితర సినిమాలను తాను చూసినట్లు అమిత్ షా చెప్పారనీ, అలాగే ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అధికారుల పనితీరు బాగుండేదనీ అన్నట్లు సమాచారం.
అదలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాల భేటీపై ఉభయ తెలుగు రాష్ట్రాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరువురి మధ్యా ప్రస్తావన కు వచ్చిన అంశాలపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారనీ, అందుకు జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించారనీ చెబుతున్నారు.
ఒక వేళ బీజేపీలోకి రావడం ఇష్టం లేకుండా తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ కు సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రానున్న రోజులలో తెలుగుదేశం, బీజేపీలు దగ్గరయ్యే అవకాశాలను మెరుగుపరిచాయని విశ్లేషకులు అంటున్నారు.