మునుగోడుకు అమిత్ షా
posted on Aug 21, 2022 8:34AM
మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ విజయానికి రహదారిగా భావిస్తున్న బీజేపీ ఆదివారం (ఆగస్టు 21)న భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా హాజరౌతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాన్ని రిపీట్ చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అమిత్ షా సభను విజయవంతం చేయడం ద్వారా అందుకు బాటలు పడతాయని భావిస్తున్నది.
అందుకే భారీ ఎత్తున జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం (ఆగస్టు 21)న చండూరు వద్ద సభా ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే బీజేపీ ముఖ్య నేతలు మునుగోడులోనే బస చేసి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర నిఘావర్గాలు సభా ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు.. అమిత్ షా సభకు భారీ ఎత్తున జన సమీకరణకు అన్ని ఏర్పాట్లూ చేశారు.
ఇక అమిత్ షా ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు. అమిత్‌షా మధ్యాహ్నం 3.20కి రమదా మనోహర్ హోటల్‌కు చేరుకుంటారు.
అక్కడ రైతు నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గంటలకు మనుగోడు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సభ అనంతరం అమిత్‌షా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.