హిజాబ్ వివాదం.. చదువు మానేస్తున్న విద్యార్థినులు
posted on Aug 21, 2022 7:16AM
కర్నాటకలో హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. గ ఆ వివాదం కారణంగా శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తింది. ఆ తరువాత సమసిపోయిందని అంతా భావిస్తున్నా.. ఆ వివాదం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పిన సంగతి తాజాగా బయట పడింది.
హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ కర్ణాటకలో దాదాపు 145 మంది విద్యార్థినులు చదువులకు స్వస్తి చెప్పి టీసీలు తీసుకున్నారు. సమానత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండే దుస్తులు వేసుకుని విద్యాలయాలకు రావద్దని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించడంతో హిజాబ్ అంశం ఆ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే, హిజాబ్ ధరించవద్దని మంగళూరు విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
గత మే నెలలో యూనివర్సిటీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆ విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజీలు హిజాబ్ ధరించి కళాశాలకు రావద్దని విద్యార్థులకు సూచించాయి. దీంతో ఆ వర్సిటీ పరిధిలోని పలు కాలేజీలకు చెందిన 145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని చదువుకు గుడ్ బై చెప్పారు.
మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ఈ విషయాన్ని తెలిపారు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పలు కాలేజీల్లో మొత్తం 900 మంది ముస్లిం విద్యార్థినులు పలు కోర్సుల్లో చేరారని చెప్పారు. వారిలో 145 మంది హిజాబ్ వివాదం నేపథ్యంలో టీసీలు తీసుకుని కాలేజీలు మానేశారనీ వివరించారు.