లోకేష్ వ్యాఖ్యలతో.. వైసీపీలో వణుకు
posted on Aug 20, 2022 @ 1:39PM
జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతకాలంగా దండయాత్ర ప్రారంభించారు. వైసీపీ నేతల భారీ కుంభకోణాన్ని త్వరలో బయటపెడతానని లోకేష్ చెప్పడంతో.. వైసీపీ నేతల్లో వణుకు స్టార్ట్ అయింది. లోకేష్ దెబ్బకు.. జగన్ రెడ్డి అబ్బా అనే రేంజ్ లో ఆ కుంభకోణం ఏదో బట్టబయలవుతుందని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు. లోకేష బయట పెడతానన్న కుంభకోణం ఏమిటో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రత్యర్థుల తప్పుల గురించి సమాచారం ఏదైనా తెలిస్తే అప్పుటికప్పుడే ఎండగట్టేస్తాయి పొలిటికల్ పార్టీలు. జగన్ ప్రభుత్వంలో రహస్యంగా జరిగిన ఒక స్కామ్ గురించి ముందే చెప్పి బహిరంగం చేస్తానన్న లోకేష్ ధైర్యానికి తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. ‘రాష్ట్రంలో దొంగలు పడ్డారు’ అనే సినిమా త్వరలో విడుదల అవుతుందని, దాని రిలీజ్ డేట్ ముందే చెప్పారు లోకేష్. చినబాబు వేసిన బాంబ్ కు వైసీపీ నేతలు మాడి మసైపోతారనే టాక్ ఆంధ్రాలో జోరుగా నడుస్తోంది.
ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన నాటి నుండీ అరాచక పాలనకు అడ్డూ అదుపూ లేకుండాపోయిందని టీడీపీ నిప్పులు చెరుగుతూనే ఉంది. యువనేత లోకేష్ ఎప్పటికప్పుడు చేస్తున్న పోరాటంతో టీడీపీకి మైలేజ్ మరింతగా పెరిగిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ సారి లోకేష్ కొట్టే దెబ్బ వైసీపీ నేతలకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా చేయాలని టీడీపీ ప్రతి కార్యకర్తా భావిస్తున్నారని చెబుతున్నాయి. లోకేష్ బయటపెడతానన్న భారీ స్కామ్ ఏమిటో.. ఎలా ఉండబోతోందో అనే చర్చే ఇప్పుడు సర్వత్రా సాగుతోంది.
లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో కొత్త చర్చకు తెర తీశాయి. ఇప్పుడు పట్టణాల నుండి రచ్చబండ వరకు లోకేష్ బయటపెట్టే స్కాం ఎలా ఉండబోదన్నదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. అంశపై పలువురు చర్చించుకుంటున్నారు.