డొక్కా డొంక తిరుగుడు.. ఉండవల్లికి విరుగుడు
posted on Aug 20, 2022 @ 12:25PM
వైసీపీలో ఏ నాయకుడిని ఎప్పుడు అందలమెక్కిస్తారో.. ఎప్పుడు అధ: పాతాళానికి తొక్కుస్తారో ఎవరూ ఊహించలేరు. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికే ఈ ఎత్తుపల్లాలు వైసీపీలో తప్పలేదు. పార్టీలో నంబర్ 2గా ఒక వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత ఒక్కసారిగా జీరోగా మారిపోయారు. ఆ తరువాత మళ్లీ పార్టీలో ఆయనకు పూర్వవైభవం దక్కిందనుకోండి అది వేరే విషయం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు వరుసగా వస్తాయి. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా ఎంత మందో పార్టీలో ఓ వెలుగు వెలిగి ఆ తరువాత ఎవరూ పట్టించుకోకుండా మిగిలిపోయిన వారు కనిపిస్తారు. ఇప్పుడు తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి అలా తయారైంది. జగన్ మనసు గ్రహించి మసులుకున్నఎమ్మెల్యేగా ఆమెకు మంచి గుర్తింపే దక్కింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆమె చెలరేగిన తీరు పార్టీ అధినేతను మెప్పించింది. రాజధాని కోసం గళమెత్తి ఆందోళనకు దిగిన వారందరినీ ఆమె పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు. అమరావతి భూములన్నీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారివేనంటూ ఆరోపణలు గుప్పించారు.
సరే ఆ వైభోగం ఇప్పుడు అయిపోయింది. ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తడంతో వైసీపీ ఉండవల్లి శ్రీదేవిని దూరం పెడుతోంది. అంతేనే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని అన్యాపదేశంగా చెప్పేసింది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గ సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. దీంతో ఉండవల్లి శ్రీదేవికి పార్టీలో పొమ్మన లేక పొగపెట్టినట్లేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఉండవల్లి నుంచి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలే వారి నియోజకవర్గానికి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తుంటారు.
అయితే జగన్ మాత్రం ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ను సమన్వయ కర్తగా నియమించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ఎమ్మెల్సీకీ రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆ తరువాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలోనే చేరారు. అలా చేరీ చేరగానే తాను రాజీనామా చేసిన ఎమ్మల్సీ పదవిని వైసీపీ నుంచి పొందారు. ఇప్పుడు గతంలో తాను రెండు సార్లు గెలిచిన తాడికొండ నియోజకవర్గానికి వైపీసీ సమన్వయ కర్తగా నియమితులయ్యారు. దీంతో ఉండవల్లి సీటుకు ఎసరు పెట్టేశారు.