వయసు 90 పైనే...కలయితో 16 అయింది!

స్నేహం మీద అనేకానేక కథలు, సినిమాలు వచ్చేశాయి. హీరో విలన్ కలిసిపోవడం, ఒక పెద్దాయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి మరో వ్యక్తి సహాయానికి వెళితే అతను తన బాల్యమిత్రుడని గుర్తించి ఆనందంగా సాయంచేయడం.. స్నేహ మేరా జీవితం.. అంటూ గట్టిగా కావలించేసుకుని పాడేసుకోవడం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పెద్ద రోడ్డుకి అవతల నుంచి స్నేహితుడి కోసం పరుగులు తీసి ఇవతలున్న స్నేహితుడిని కలవడం.. మామూలే. చిత్రమేమంటే ఇద్దరు పెద్దవాళ్లు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలిశారు. వారి ఉద్వేగానికి అంతే లేదు. బాల్యంలో కలిసినవారు అనేకానేక కారణాల వల్ల విడిపోయి చాలాకాలం తర్వాత కలవడం వింటూనే ఉంటాం. అయితే మరీ ముదిమి వయసులో కలవడమే ఈ యిద్దరి ప్రత్యేకత. అవును ఎప్పుడు రెండో ప్రపంచయుద్ధంలో కలిసి పనిచేసిన కుర్రాళ్లు పండు ముసలి వయసులో హఠాత్తుగా ఎదురయ్యారు. తప్పకుండా ఇది తెలుగు సీనిమా సీన్ అయితే కాదు.   ఒక షాపింగ్ మాల్ కి 95 ఏళ్ల పెద్దాయన మనవరాలితో వెళ్లాడు. అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి బయటికి వస్తున్నాడు. అప్పుడే దాదాపు అంతే వయసున్న మరో పెద్దాయన మనవడి సాయంతో లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే అవతలి ముసలాయన్ని గుర్తించాడు. వీడు నా ఫ్రెండ్ అని గుర్తించాడు. అంతే పరుగులాంటి నడకతో వెళ్లి  ఆ ముసలాయన్ని కౌగిలించుకున్నాడు. నేన్రా.. నేను.. అంటూ రెండో ప్రపంచయుద్ధసమయంలో నేవీలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేశాడు. అవును నిజమే.. అనుకుని పేలవంగా నవ్వలేదు.. అమాంతం హత్తుకున్నాడు.. ఆ ముసలాయన కూడా.  పెద్దాయన వాళ్లింటికి తీసికెళ్లాడు...75 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో 90 సంవత్సరాల సంభాషణ చేశాడు. యుద్ధానికి వెళ్లడం, అంతకుముందు కలిసిన రోజు, కలిసి నేవీలో పనిచేయడం, అంతా.. కానీ ఆ తర్వాత ఎంతో వెతికానని ఎవరూ తన గురించి చెప్పలేకపోయారని చెప్పుకున్నారు.. వారికి కనీసం మూడు గంటలపాటు ఆకలి అనిపించలేదు, డ్రింక్స్ అలానే ఉండిపోయాయి, అంతా మాటలు, కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎన్నో కథలు, ఎన్నో సరదాలు, సీరియస్ అంశాలు, పిల్లలు, మనవలు, మనవరాలు, ఆనందం, దుఖం, నవ్వులు, కాసిని ఏడుపులు... సర్వం వారిద్దరి మధ్యా అలా ప్రవాహ మయ్యాయి.  స్నేహబలం అంతే. ఎన్నాళ్లుపోయినా యంగ్ అండ్ ఎనర్జటిక్. అవును వాళ్లిద్దరూ పదహారేళ్లవారే. వాళ్లే కాదు అలా కలిసినవారంతా పరమ కుర్రాళ్లే. మీరయినా అంతే. పాత బాగా పాత... కనీసం ముప్పయ్యే ళ్లయినా కలవని స్నేహితులను కలవడానికి ప్రయత్నించండి.. వయసు, వ్యధలు, మౌనం.. అన్నీ వీడిపోతాయి. 

తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

నిలిచిపోయిన రెండున్నర గంటల తరువాత ఎట్టకేలకు వాట్సాప్ సేవలు పున: ప్రారంభమయ్యాయి. ప్రముఖ మేసేజింగ్ ఇంజిన్ వాట్సాప్ సేవలు సంకేతిక సమస్యలతో మంగళవారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్విట్లర్ వేదికగా వాట్సాప్ సేవల స్తంభనపై పలువురు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో  మెటా.. వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. సధ్యమైనంత త్వరలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ చెప్పింది. కాగా దాదాపు రెండున్నర గంటల తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.   వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై ఆ సందస్థ విచారణ చేపట్టింది. కాగా వాట్సప్ సేవలు నిలిచిపోవడం వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా అన్న అనుమానాన్ని భారత ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. అయితే వాట్సాప్ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని ప్రొవైడర్లు చెబుతున్నారు.  

ఐదు పరుగులిచ్చిన గ్లౌవ్

ఈసారి టీ20 ప్రపపంచకప్ లో వింతలు విడ్డూరాలే జరుగుతున్నాయి. ఆటతో పాటు విచిత్రాలూ ప్రేక్షకు లను ఆకట్టుకుంటున్నాయి. ఊహించని విధంగా క్యాచ్ లు పట్టడం, సిక్స్ లు బాదడంతోపాటు వికెట్ కీపర్ విన్యాసాలు గమనిస్తున్నాం. అయితే మరో చిత్ర విచిత్రమేమంటే దక్షిణాఫ్రికా పెనాల్టీగా ఐదు పరుగులు ఇవ్వడం. మొన్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే ఉట్టినే 5 పరుగులు సాధించింది. అందుక్కారణం కూడా దక్షిణాఫ్రికా ఫీల్డర్లే కారణం. సోమవారం గ్రూప్ 2లో జరిగిన ఈ మ్యాచ్ లో పెనాల్టీ పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. జింబాబ్బే ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మూడో బంతి ని జింబాబ్వే బ్యాటర్ మిల్టన్ వికెట్ కీపర్ వెనగ్గా ఫోరో సిక్సో కొట్టాలనుకున్నాడు. కానీ చేతకాలేదు. బంతి శరవేగంతో వెళ్లింది. రివర్స్ స్కూప్ ఆడబోతే అది కాస్తా ఫైన్ లెగ్ లోకి వెళ్లింది. అక్కడి ఫీల్డర్ ఎన్గిడి బంతిని అందుకుని వేగంగా కీపర్ డీకాక్ కి విసిరాడు. డికాక్ జింబాబ్వే బ్యాటర్ ను అవుట్ చేయాలన్న తొందరలో చేతికి ఉన్న కీపర్ గ్లౌవ్ తీసి పడేసి బంతిని పట్టుకున్నాడు. కానీ అది కాస్తా వికెట్లను తాకింది. వాటి మీద ఉన్న బెయిల్ పడింది. బ్యాటర్ అవుటయ్యాననుకన్నాడు. కానీ గ్లౌవ్ విసిరేయడంతో అది పడింది కనుక అవుటియ్య లేదు. పైగా అలా చేసినందుకు దక్షిణాఫ్రికా జట్టు అయిదు పెనాల్టీ పరుగులు సమర్పించు కోవాల్సి వచ్చింది. బ్యాటర్ కదలకుండానే అయిదు పరుగులు సాధించడం అందర్నీ ఆశర్యర్యపరి చింది. డీకాక్ కూడా ఇదేందిరా అయ్యా అన్నట్టు చూశాడు.  కానీ రూల్స్ అలానే ఉన్నాయి. గ్లైవ్ వికెట్లను తాకితే బెయిల్స్ కిందపడితే బ్యాటింగ్ చేస్తున్నవారికి అయిదు అదనపు పరుగులు ఇవ్వాలి. అలా పెనాల్టీ పడిందన్నమాట. అంచేత ఆడటం అంత సులువు కాదు. సవాలక్ష నిబంధనల మధ్యలో కాస్తంత భయం భయంగానే ఆడాలి. స్వేచ్ఛ తీసుకోవడానికి చాలా పరిమితులు ఉంటాయి.  ఆవేశంలో వాటిని అధిగమిస్తే ఫలితం ఇలానే ఉంటుంది. అందుకే మధ్యలో బ్యాటర్, బౌలర్ మధ్య గొడవలు జరిగినా మీదకు వచ్చినా ఇరుజట్ల కెప్టెన్లు పరుగున వచ్చి సర్దిచెప్పుకు పోతుంటారు. రోడ్డు మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటే డేంజరే. పెనాల్టీ  పరుగుల మాట ఎలా ఉన్నా, ఆట నించి బయటికి పంపేస్తారు. 

పలాస పోలీసు స్టేషనా... వైసీపీ కార్యాలయమా?

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు స్టేషన్లు అధికార వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయా? పోలీసు స్టేషన్లలో వైసీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా? విపక్ష నేతలను వేధించడమే పనిగా వైసీపీ నేతల కనుసన్నలలో పోలీసు స్టేషన్లు పని చేస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడమే తమ విధి అన్నట్లుగా పని చేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పోలీసు స్టేషన్ పూర్తిగా వైసీపీ కార్యాలయంలా మారిపోయిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.   తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శీరీష, పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలాస సీఐ శంకరరావు అధికారపార్టీకి కొమ్ము కాస్తున్నారనీ, మంత్రి అప్పలరాజు చెప్పిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పలరాజు కనుసన్నలలో సీఐ పని చేస్తూ... ఏకంగా పోలీసు స్టేషన్ నే వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఎంపీ ఆరోపంచారు. సీఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. 

ఎన్నికల కమిషన్ హెచ్చరిక...గోడమీద పోస్టర్

ప్రతీ గల్లీలో జనం పరిగెడుతున్నారు. గ్రామకూడలిలో వేపచెట్టుకింద ఒక వ్యక్తి  ఆభరణాలు పంచు తున్నాడు. పిల్లలయితే ఉంగరాలు, పెద్దవాళ్లయితే గాజులు,గొలుసులు, వడ్డాణాలూను. మన రాజుకింత బుద్ధుంటే బావుండేది అనుకుంటూ అవి తీసుకున్న ఆనందంలో రాజుని వీలయినంతగా తిట్టుకుం టున్నారు. అలానే ఇళ్లకి చేరుకున్నారు. యువరాజుగారికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎవరక్కడ అని అరిచాడు. భటుడు వచ్చాడు. ఏం జరుగుతోంది అంటూ అరిచాడు. ప్రభూ పక్కూరి వాల్లు, చిన్న రాజ్యంవారూ వచ్చి మన ప్రజలకు కానుకలు ఇస్తున్నారు. మా ఆడోళ్లూ తెచ్చు కున్నారు అన్నాడు. రాజుకి కోపం నషాలానికి అంటింది. ప్రజలా మేకలా అలా వెంటబడి మీదబడి తీసు కుంటారా? అని కోపగించుకున్నారు. బాగా ఆాలోచించి మంత్రికి వాళ్లని తరిమే యమన్నాడు. మంత్రి వెళ్లి ఒక వడ్డాణం తీసుకుని ఇప్పుడు కాదు మరో రోజు రండి అని పంపేశాడు. ఈసమాచారం విని రాజుగారు ఒక ప్రకటన చేయించారు.. ఎవరూ ఎవరి కానుకలను తీసుకోరాదని. ఎవరు కానుకలు ఇవ్వడానికి వచ్చినా వెంటనే కబురుపెట్టమని లేకుంటే చెట్టుకి కట్టేయ మని ఆదేశించారు. అది చదివి జనం ఊరుకున్నారు. జరిగేది జరగక మానదు, రాజుగారి హెచ్చరి కతో అన్నీ ఆాగిపోతే రాజ్యం ఎందుకైతది?  ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ ఓటరుని ఆకట్టుకోవడానికి అనేక బహుమానాలు ఇవ్వడం మీదనే ఆసక్తి చూపుతున్నాయి. అసలు ఇప్పటికే కోట్లు ప్రవాహంగా వెళిపోయాయి. కొంతే పట్టుబడిందని మీడియా కోడయి కూస్తోంది. ఇప్పటికి భారత ఎన్నికల కమిషన్ వారికి ఇక్కడి సమాచారం తెలిసింది. వెంటనే అలా కానుకలు రూపంలో ఏమీ ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదని శాసించింది. ప్రజలకు ముఖ్యంగా ఓటరుకి పొట్టచెక్కలయ్యేంత నవ్వొచ్చింది.  పార్టీలు గెలవడానికి అన్ని యత్నాలూ చేస్తున్నాయి. వాటిలో భాగమే ఈ కానుకుల సంగతి. కొందరు ఏకంగా బంగారం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారట. అంటే మునుగోడు ఓటరు అనతికాలంలోనే కోటీశ్వరుడు అయినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎవరు ఏమీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకో వాలని హెచ్చరికలు జారీచేయడం పెద్ద అమాయకత్వం. అధికారంలోకి రావాలి, మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలి, రెండింటిలో ఏదయినాసరే పార్టీలకు ప్రధానమే. అందువల్ల తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి చేయాల్సిన అన్ని పనులూ చేస్తారు, అన్ని మార్గాలను అనుసరిస్తుంటారు. ఇది అనాదిగా ఉన్నదే. కాబోతే, ఇ.సి మాత్రం ఈసారి గట్టి చర్యలు తీసుకోవడానికి నిర్నయించింది. ఎవర యినా సరే డబ్బురూపంలోగాని, వస్తు రూపంలోగాని పార్టీల నుంచి, అభ్యర్ధుల నుంచి తీసుకోరాదు, అది ఘోరనేరంతో సమానమని భారీ ప్రచారానికి పూనుకుంది. పూర్వం సినిమాలకు రిక్షాల ప్రచారంలాగ వాహనాల్లో మైకు ప్రచారానికి, గోడల మీద పోస్టర్ల ప్రచారానికి పూనుకుంది. ప్రాంతీయ భాషలో ఈ ప్రచారం జరగాలని  తెలంగాణా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్, ఏవిఎంలు సిద్ధమయ్యాయని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు.  మునుగోడు నియోజకవర్గంలో 80 ఏళ్లు నిండిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత గడువులోగా ఫారం 12 డి సమర్పించారు. సీనియర్ సిటి జన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి ఈసీఐ సూచనల మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు బుక్ చేశామని, 2.5 కోట్లు సీజ్ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483 లీట ర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, 77కేసులు నమోదుచేసి 36 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మునుగోడుకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌తో పాటు ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని రెండవ ఎన్నికల పరిశీలకుడిగా  ఎన్నికల కమిషన్  నియమించింది. ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) నియోజకవర్గంలోని అక్రమ నగదు ప్రవాహాన్ని నియం త్రించేందుకు వ్యయ పరిశీలకులకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ నుండి ఏడుగురు సిబ్బందిని మునుగోడుకు నియమించారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బహుమతులు, చేబదులు రూపంలో పార్టీవర్గాలు ఓటర్లకు ఇచ్చేవాటిని, బహిరంగంగానో, రహస్యంగానో ఇళ్లకు పంపే వస్తువులను ఏ కెమెరా కన్ను అమాంతం పట్టేస్తుంది?  రాజుగారికి కోపం వచ్చినా, ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలు చేసినా పార్టీలు, నాయకులు, అభ్యర్ధులు, ఇపుడు  ఓటరు కూడా చాలా లైట్ గానే తీసుకుంటున్నారు. దీన్ని అవినీతి అనే కంటే మా వారికి ఇష్టపూర్వకంగా ఇస్తున్న కానుకలు అంటూ పెళ్లిలో ఇచ్చినట్టు ఇస్తున్న పుడు ఓటరు మాత్రం కాదనలేకపోతాడుకదా. లోలోపల కాస్తంత భయం ఉండచ్చుగాక, ఈ తరుణం మించితే  ఆనక ఫ్రిజ్ కొనడానికయినా నానా తంటాలు పడాలన్నది  ఓటరు ఆలోచన, పోనీలేద్దూ మనకి ఓటు వస్తాడుగా అనే నమ్మకం పార్టీలదీను.  ఇక ఇసీ ప్రకటనలు, హెచ్చరికలు గోడ మీద పోస్టర్లే. 

ఏపీలో జగన్ సీన్ సితారేనా?.. సీ వోటర్ సర్వే తేల్చేసిందా?

ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి ఓటర్లను కడుపూ, గడ్డం పట్టుకుని బతిమాలి ఏపీలో అధికార పీఠం ఎక్కిన జగన్ పట్ల ఓటర్లలో ఎక్కువ శాతం మందికి వెగటు పుట్టినట్లుంది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసిన జగన్ పాలన అంటే జనంలో తీవ్ర అసంతృప్తి రేగుతున్నట్లుంది. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిందంటున్నారు. ఆర్థికంగా ఏపీని బలోపేతం చేసే దిశగా ఏమాత్రం ఆలోచించకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటుపై దృష్టిపెట్టకుండా.. కేవలం కంటితుడుపు చర్యగా ఉచితాల పేరుతో జనాన్ని వెర్రోళ్లుగా, ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధి కోసం అర్రులు చాచేలా చేసిన జగన్ పట్ల, వైసీపీ పాలన పట్ల ఈ మూడున్నరేళ్లలో జనానికి మొహం మొత్తిందంటున్నారు.  తద్వారా జగన్ సర్కార్ డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ సీ-ఓటర్ తాజాగా వెల్లడించిన సంచలన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. జగన్ ఏలుబడిలో ఏపీలో ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ధైర్యంగా ఏపీలో ముందుకు రాని పరిస్థితి ఉంది. కొత్త పెట్టుబడిదారుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతున్న వైనం బాధాకరంగా మారింది. రోడ్ల దుస్థితి చూస్తే దయనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇలా ఒక్కటేమిటి అన్ని వర్గాల వారూ వైసీపీ పాలన అంటేనే చీదరించుకునే స్థితి వచ్చింది. ఇలాంటి ఎన్నో కారణాలతో జగన్ సర్కార్ అంటే ఏపీ జనంలో 57 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీ ఓటర్ తాజా సర్వేలో  వెల్లడించింది. సీ ఓటర్ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న టాప్ 5 ప్రభుత్వాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనంలో ప్రజాగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ అయితే మరీ దారుణంగా అగ్రస్థానంలో నిలిచింది. ‘యాంగర్ ఇండెక్స్’ పేరిట సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీ సర్కార్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తనుందని విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఏపీలోని ప్రస్తుతం 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం గమనార్హం. ఈ విషయం సీ ఓటర్ సంస్థే కాకుండా జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ చేసిన సర్వేలో కూడా స్పష్టమైంది. 2019లో 151 స్థానాల్లో విజయం సాధించి, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గానూ 175 చోట్లా గెలవాలనే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తన పార్టీ నేతలు, బాధ్యులను పరుగులు పెట్టిస్తుండడం గమనార్మం. అయితే.. సీ ఓటర్ సర్వేలో అందుకు పూర్తి భిన్నంగా జగన్ సర్కార్ పట్ల జనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ సర్వేల కన్నా విభిన్నంగా సీ ఓటర్ సర్వే ఫలితాలు రావడం గమనించదగ్గ అంశం. ఎక్కువ శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారి తీరు మారకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, ఇతరులకు కేటాయిస్తానంటూ జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. విచిత్రంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల కన్నా వైసీపీ పాలనే ఘోరంగా ఉందని జనం ఆగ్రహంతో ఉన్నట్లు సీ ఓటర్ సర్వే తేటతెల్లం చేసింది. అయితే.. అభివృద్ధిలో, సంక్షేమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని వైసీపీ నేతలు, ముఖ్యనేత చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98 శాతం అమలు చేశామని గొప్పగా వైసీపీ నేతలు చెబుతుంటే.. జనంలో తీవ్రాతి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం కనిపించడం లేదా అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లినప్పుడు కూడా ఇంతే స్థాయిలో వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సమర్థించగల దమ్ములేక అనేక మంది ఎమ్మెల్యేలు అసలు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముఖం చాటు వేసిన ఘటనలు ఉన్నాయి. ఏపీలోని స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, సీఎంకు సంబంధించిన ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే అంశంపై సీ ఓటర్ సర్వే నిర్వహించడం గమనార్హం. ఈ సర్వే సందర్భంగా జగన్ రెడ్డి పాలన ఏమాత్రం బాగోలేదని ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారంటే.. వైసీపీ సర్కార్ ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిందనే భావించాలని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కో ఆర్డినేటర్ల సమీక్ష సందర్భంగా ఎంతసేపూ ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ చిర్రుబుర్రులాడుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే.. ఆశ్చర్యకరంగా అసలు వైసీపీ సర్కార్ పైనే ఎక్కువ వ్యతిరేకత రావడం గమనార్హం.మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు ఏపీ జనం నుంచి దబిడి దిబిడి తప్పేట్టు లేదని సర్వే నివేదికల ద్వారా అర్థం అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గుడివాడలో నానికి ప్రత్యర్థిగా తెరపైకి కొత్త ముఖం.. చంద్రబాబు వ్యూహం

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఓ బలమైన నాయకుడినే కాకుండా.. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన వ్యక్తిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆయనను రంగంలోకి దింపి.. గుడివాడలో సేవా కార్యక్రమాలతోపాటు రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  ఆయన అయితేనే.. కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా చంద్రబాబు తెరపైకి తీసుకు వచ్చిన వ్యక్తికి.. కొడాలి నానికి పెద్దగా పరిచయం లేదని తెలుస్తోంది. కానీ.. కొడాలి నానిపై ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా కొడాలి నానికి  బాగా పరిచయస్తులేనన్న సంగతి తెలిసిందే.  కానీ ఇక పరిస్థితి ఉండకూడదన్న  కృత నిశ్చయంతోనే కొత్త అభ్యర్థినిబరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై మొన్నటి వరకు వంగవీటి రాధాని నిలుపుతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేరు తెరపైకి వచ్చింది.  ఉమ  అయితేనే కొడాలి నానికి కరెక్ట్ అని కూడా టీడీపీలో ప్రచారం జరిగింది. కానీ దేవినేని ఉమను సైతం కాదని.. తెరపైకి ఓ కొత్త వ్యక్తి పేరును చంద్రబాబు తీసుకు రావడంతో కొడాలి నాని వర్గంలో కొంత అలజడి మొదలైనట్లు తెలుస్తోంది.  అదీకాక.. ఇప్పటికి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి... గెలుస్తూ వచ్చిన కొడాలి నానికి వచ్చే ఎన్నికలు అంత ఈజీ కాదని ఆయన వర్గమే పేర్కొంటోంది. జగన్ తొలి కేబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా..  చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై బండ బూతులు తిట్టడమే కాదు.. చంద్రబాబు ఫ్యామిలీపై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో కొడాలి నాని తీవ్ర అపప్రదను ముటకట్టుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు నల్లేరు మీద నడక కాదనే చర్చ   గుడివాడ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. అదీకాక.. ఆయన మంత్రిగా ఉండగా  ఆయన వ్యవహార శైలితో.. నియోజకవర్గంలో యువత అంతా కొడాలి నానికి బాగా దూరంగా జరిగింది. మరోవైపు.. రానున్న ఎన్నికల్లో  కొడాలి నాని ఓటమే లక్ష్యంగా చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త అభ్యర్థిని చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన అయితేనే కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని చంద్రబాబు తన ఆలోచనలకు పదును పెట్టి.. మరీ ఆ పారిశ్రామికవేత్తను గుడివాడ నుంచి రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

నా హత్యకు సీఎం కుట్ర..రఘురామకృష్ణం రాజు

దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి హైదరాబాదుకు వెళ్ళిన తనని, బ్లాంక్ ఎఫ్ ఐ ఆర్ ద్వారా ఏపీ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారని రఘురామరాజు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  తనకు ఖచ్చితమైన సమాచారం లభించడంతోనే, తాను తిరిగి ఢిల్లీకి చేరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని అంతమొందించడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఏపీలో మంత్రులకు భద్రత పెంపుపై స్పందించిన ఆయన ఏపీలో జగన్ సర్కార్ తీరు కారణంగా ప్రజల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కావాలనే పరిస్థితి ఇంత తొందరగా వస్తుందనుకోలేదని వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మా జగనన్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని సెటైర్ వైశారు.  సిఐడి చట్టబద్ధంగానే పని చేస్తోందని, తప్పు చేయని వారు భయపడాల్సిన పని లేదని, అవసరమైతే కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుందని మీడియాలో వచ్చిన కథనాలపైనా రఘురామకృష్ణంరాజు స్పందించారు.  హక్కుల గురించి సిఐడి అధికారులు  చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో తాము లేమన్నారు. సిఐడి పోలీసులు ఎంతోమందిని అరెస్టు చేయగా, మెజిస్ట్రేట్ లు వారిని కస్టడీకి ఇవ్వకుండా తిరిగి వెనక్కి పంపిన ఉదాంతాలు అనేకం ఉన్నాయన్నారు.  అమాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులను మెజిస్ట్రేట్ లు తక్షణమే శిక్షించాలని కోరారు. ఇదే విషయమై తాను త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలుస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు, బారి కేడ్స్ మధ్య ప్రజల్లోకి వస్తున్నారన్న ఆయన , ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పంథా ను అనుసరించాలని అపహాస్యం చేశారు.     సిఐడి కస్టడీలో పోలీసుల హింసను అనుభవించిన వారెవరు న్యాయస్థానానికి, మీడియాకు ఫిర్యాదు చేయలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు . సిఐడి ని అభాసు పాలు చేసేందుకే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐడి అధికారులకు కళ్ళు ఉన్నాయా?, లేవా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం సిఐడి పోలీసులకు, న్యాయస్థానం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిందన్నారు.  అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా పాలకులు అడ్డుకోవాలని చూస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, ఇది రైతులకు పరీక్షా సమయం కాదని… ప్రజాస్వామ్యానికే పరీక్ష అని వ్యాఖ్యానించారు.      కడప ఎంపీ స్థానం కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చెప్పారంటే నిజమే అయి ఉంటుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య వల్ల లబ్ధిదారులు ఎవరన్నది త్వరలోనే తేలనుందన్నారు.  

నక్క...నాగలోకమూ

రైతే రాజు నినాదం అనాదిగా ఉన్నదే. రాష్ట్రపతి కంటే రైతే మన దేశంలో గట్టివాడనేవారు. రాజకీయా ధికారాలు లేకపోయినా రైతు దేశ ప్రజలకు దైవంతో సమానం. కానీ కాలక్రమంలో రైతును సామాన్య ఓటరు స్థాయికి దిగజార్చారన్న మాటా లేకపోలేదు. రాజ్యాధికారం చేతికి రాగానే రాజకీయ పార్టీలు, నాయకులే రైతునీ ఓటుహక్కున్న మనిషిగానే చూస్తున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతుపట్ల కాస్తంత గౌరమే ఉందనుకోవాలి. అక్కడి ప్రభుత్వాలు వారికి గౌరవమిస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రైతుకి స్థాయి దిగజారింది. రాజధాని నగరానికి భూము లిచ్చినా వారిని అగౌరవపరచడమే జరుగుతోంది. వారి మాటను వినడం మానేశారు. ప్రబుత్వం ఏది నిర్ణయిస్తే దాన్నే అంగీకరించాలన్న విధంగా వారిని లోబరచుకోవడానికే చూస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణే రైతుల మహాపాద యాత్ర. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములు తీసుకున్నారు. 2015లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేక‌రించిన భూముల్లో 2015 ఆక్టోబ‌ర్ లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేతుల మీదుగా అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. రైతుల నుంచి స‌మీక‌రించిన భూములతో పాటుగా ప్ర‌భుత్వ భూములు కూడా క‌లిపి 50వేల ఎక‌రాల పైబ‌డి విస్తీర్ణంలో అమరావతి మహా న‌గ‌రం నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని కార్యాల‌యాల‌ను సిద్ధం చేశారు. తాత్కాలిక అవ‌స‌రాల కోసం నిర్మించిన సెక్ర‌టేరియేట్, అసెంబ్లీ భ‌వ‌నాలు 2017లోనే అందుబాటులోకి తీసుకొచ్చా రు. తాత్కాలిక హైకోర్టు భ‌వ‌నం కూడా అందుబాటులోకి వ‌చ్చింది.  ఆ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేవంప్రభుత్వం దిగిపోయి వైసీపీ సర్కార్ వచ్చింది. దీంతో 2019 డిసెంబ‌ర్ లో జగన్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి విష‌యంలో నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 2020 జ‌న‌వ‌రిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మూడు రాజ‌ధానుల వైపు అడుగులు వేసింది. వాటిపై ప‌లు అభ్యం త‌రాలు, అమ‌రావ‌తి ప్రాంతవాసుల ఆందోళ‌న‌ల‌కు తోడు కోర్టులో కేసులు ఉండ‌డంతో రాజ‌ ధానుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగ‌లేదు.  భూములు ఇచ్చింది రాజధాని నిర్మాణానికి కనుక అమరావతి నే రాజధాని చేయాలన్న రైతాంగం, ప్రజల డిమాండ్ బలపడింది. పాలనాపరమైన సౌలభ్యంకోసమే మూడు రాజధానుల మాట తెరమీదకు తెచ్చామని జగన్ సర్కార్ ప్రచారం చేసుకుం టోంది. ప్రబుత్వం చెప్పే కారణాలు, వివరణల మాట ఎలా ఉన్నప్పటికీ , రైతాంగం మాత్రం ససెమిరా అంటూ పాదయాత్ర ఆరంభించింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం.. సీఆర్డీయే చట్టాన్ని సవరించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.అయినా జగన్ సర్కార్ తన మొండి పట్టు వీడలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. మూడురాజధానులపై ముందుకే సాగుతానంటోంది. రైతుల మహాపాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటోంది.  మరో వంక  నోయిడా విమనాశ్రమం కోసం చుట్టుపక్కల ఆరు గ్రామాల రైతాంగంలో 76 శాతం మంది తమ భూములు ఇవ్వడానికి  అంగీకరించారు. వారిని నోయిడా విమానాశ్రమం రెండో విడత పనులకు కావలసి భూమి కోసం అధికారులు, ప్రభుత్వం సంప్రదించింది.  వారిని నుంచి భూమిని తీసుకు నేందుకు అన్ని ఏర్పాట్లూ చేపడుతున్నామని ప్రభత్వం ప్రకటించింది. కలెక్టర్  ఆ గ్రామాల రైతులకు అంగీకార పత్రాలనుకూడా ఇచ్చారు. ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రెండో విడత పనులు చేపడితే సుమారు 7,164 కుటుంబాలపై ప్రభావం ఉంటుందని వారిలో 70 శాతం మంది అంటే 5 వేల కుటుంబాల అంగీకారం అవసరమయిందని కలెక్టర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ  రాజధాని  వ్యవహారం కంటే చిన్నదే కావచ్చుకాని రైతాంగంతో ప్రభుత్వాలు వ్యవహరించే తీరు లో మార్పు గమనించవచ్చు. రైతాం గాన్ని అవసరం వచ్చినపుడు బతిమాలి బామాలిన జగన్ సర్కార్ తర్వాత నిర్లక్షంగా మాట్లాడి దూరం చేసుకుంది. అటు యూపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఎంతో సమన్వయంతో పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతోంది. అయితే అక్కడ కూడా ప్రబుత్వం భూముల విషయమయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ ఆ రైతులతో సంప్రదించి పరిస్థి తులు వివరించి వారి నుంచి అనుకూలత అంగీకారం సాధించగలిగారు. వారికి ఆ ర్ అండ్ ఆర్ పాలసీనీ చక్కగా వివరించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలోనే 200 మంది రైతులు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను కలిశారు. వారికి భూమిపై ఇచ్చే పరిహారం పెంచమన్న డిమాండ్ గురించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అంగీకరించడం గమనార్హం.  చిత్రమేమంటే, ఆంధ్రా విషయానికి వస్తే, భూములు తీసుకున్న లక్ష్యం మరోలా ఉండటం. భూములను రాజధాని నిర్మాణానికి తీసుకుని అందుకు వినియోగించుకోవడం లేదు. పైగా రాజధానిని విశాఖపట్నానికి మారిస్తే చూస్తూ ఊరుకోమని రైతాంగం కూడా కరాఖండీగా చెబుతోంది. మా వద్ద నుంచి భూములు తీసుకుని ఇప్పుడు రాజధానిని మార్చే ఆలోచన చేయడం దుర్మార్గమని రైతాంగం ఉద్యమ బాట పట్టింది. మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది.  సమస్యను పరిష్కరించడంలో జగన్ విఫలమయ్యారు. తాను పట్టిన కుందేటికి.. అన్న సామెతలా తయారయి విశాఖను అభి వృద్ధి చేయాలనే తలంపుతో సీెం జగన్ మొండిపట్టుపట్టారు. అమరావతి, చుట్టుపక్కల భూములిచ్చినవారంతా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్నే ముందునుంచి ప్రచారం చేశామని,ఆాశించామని భీష్మించారు.  ప్రబుత్వం కేవలం రాజకీయ అవసరాలకోసమే మూడు రాజధానుల మాట ఎత్తిందేగాని వాస్తవానికి అమరావతి అభివృద్ధిని ఆకాంక్షించలేదని రైతాంగం ఆగ్రహించింది. ప్రభుత్వం పొగరు దించాలనే మహాపాదయాత్ర చేపట్టి ప్రజల మద్దతు పొందింది. 

ఫోటో ఇచ్చిన అమితానందం

ఇప్పుడంటే సెల్ఫీలు వచ్చాయిగాని ఈమధ్య వరకూ ఫోటోలదే రాజ్యం. బాల్యంలో తీయించు కున్న ఫోటోలకు మరింత విలువ.  అప్పట్లో యే ప్రముఖ వ్యక్తితోనో తీయించుకున్న ఫోటో చాలాకాలం ఎంతో పదిలంగా దాచుకోవడం పరిపాటి. అది ఏకంగా ముఖ్యమంత్రితో తీయించుకున్నదయితే మరీ పదిలం చేసుకోవడం దాన్ని చూసుకుంటూ మురిసిపోవడం జరుగుతూంటుంది. స్కూల్లో, అపీసులో తోటి మిత్రులతో అ అనందం పంచుకుంటాం. మరీ వింతేమంటే..చాలాకాలం ఏ ప్రముఖుడితో ఫోటో తీయించుకున్నామో అదే ప్రముఖుడు మరింత పెద్ద స్థాయిలో కలిస్తే ? అ అనందానికి అంతే ఉండదు. సరిగ్గా ఇదే జరిగింది ఒక మేజర్ కి. గజరాత్ కి చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఆయన స్కూల్ ఫంన్ కి నరేంద్ర మోడీ వెళ్లారు. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. ముఖ్యమంత్రితో ఫోటో తీయించుకన్న ఆనందం అందరికీ పంచుకున్నారు. దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు.  తర్వాత చదువు పూర్తిచేసుకున్న అమిత్.. భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్నారు.  చిత్రంగా చాలా కాలం తర్వాత మోదీని ఇన్నాళ్లకి కలిశారు. ఈసారి తాను మేజర్, ఆయన దేశ ప్రధాని.   దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం అమిత్కి  వచ్చింది. ఈ అరు దైన సంఘటనకు ప్రధాని మోదీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది.  దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు. వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూశారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపు కుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కార్గిల్ లో పర్యటించారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుం టుండగా.. అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తుచేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అమిత్తో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి ఫొటోను పట్టుకుని ప్రధాని మోదీ, మేజర్ అమిత్ మళ్లీ ఫొటో దిగారు.

వాట్సాప్ కు గ్రహణం.. గగ్గోలు పెడుతున్న నెటిజనం

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌  సేవలకు అంతరాయం ఏర్పడింది.   మధ్యాహ్నం 12 గంటలకు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్లనే వాట్సప్ సేవలు నిలిచిపోయాయని భావిస్తున్నారు. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో ఆ యాప్ యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి అవకావం లేకుండా సేవల మొత్తం నిలిచిపోయాయి. వాట్సప్ కాల్స్ కు కూడా అవకాశం లేకుండా పోయింది.  అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ.. వాట్సాప్‌ పర్సనల్ చాట్స్‌తో పాటు గ్రూప్స్‌కు కూడా సందేశాలు పంపే, స్వీకరించే సేవలు స్తంభించిపోయాయి. . ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్  విషయాన్ని వెల్లడించింది.  దీంతో నెటిజన్లు వాట్సాప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యగ్రహణం మాట దేవుడెరుగు.. వాట్సాప్ కు గ్రహనం పట్టిందని గగ్గోలు పెడుతున్నారు నెటిజనం.

షిండే వర్గంలో లుకలుకలు.. మరో మహా సీఎంకు రంగం రెడీ అవుతోందా?

మహారాష్ట్రలో రాజకీయ అస్థిరతకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. శివసేనను నిట్ట నిలువునా చీల్చి, ఉద్ధవ్ ధాక్రేను గద్దె దించి కమలం మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన ఏక్ నాథ్ షిండే పదవీ వైభోగం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా? ఆయనకు పదవీ గండం పొంచి ఉందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. శివసేన షిండే వర్గంలో అసమ్మతి జ్వాలలు భగ్గు ముంటున్నాయని, ఆయనపై తిరుగుబాటుకు తెరవెనుక రంగం సిద్ధమౌతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంటోందని చెబుతున్నారు. షిండే వర్గంలో ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగ నివురు తొలగించుకుని జ్వాలలై ఎగసే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు.   శివసేన నుంచి తిరుగుబాటు చేసిన వచ్చిన షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ప్రస్తతం షిండేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ముఖ్యమంత్రి వర్గీయులే చెబుతున్నారు. ఉద్దవ్ పై తిరుగుబావుటా ఎగుర వేసిన 40 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని శివసేన ఉద్ధవ్ వర్గం అధికార పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. బీజేపీయే స్వయంగా షిండే వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నదనీ, బీజేపీ షిండేను సీఎం పీఠంపై తాత్కాలికంగానే కూర్చో బెట్టిందనీ సామ్నా పేర్కొంది.   అసమ్మతి నేతల తిరుగుబావుటా కారణంగా షించే ఏ క్షణంలోనైనా తన పదవి కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. అంధేనీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివసేన షిండే వర్గం పోటీ చేయాలని భావించినప్పటికీ బీజేపీ అంగీకరించలేదనీ,  దీనిని బట్టే ప్రభుత్వం నడపడంలో సీఎం పాత్ర ఎంత అన్నది సులువుగానే అర్ధం చేసుకోవచ్చని ధాకరే వర్గీయులు అంటున్నారు. షిండే తిరుగుబాటు చేసి గద్దెనెక్కడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేశారనీ, మహా జనం ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరనీ సమ్నా సంపాదకీయం పేర్కొంది. కేవలం 40 మంది తరుగుబాటు ఎమ్మెల్యేలతో నడుస్తున్న షిండే సర్కార్ ఎక్కువ కాలం అధికారంలో ఉండే అవకాశం లేదని పేర్కొంది. షిండేకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల రిమోట్ కంట్రోల్ పీఎంవో చేతుల్లో ఉందని, ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర తీసుకుంటున్నారని సామ్నా పేర్కొంది. 

కేసీఆర్ తాజా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోజనం ఏమిటి? ఫలితమేమిటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ముందు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆయన ఆపరేషన్ కు ఆకర్షితులై పార్టీలోకి వలస వస్తున్న వారంతా కూడా తెరాసను ఏదో కారణంతో వీడి వెళ్లిన వారే కావడం గమనార్హం. దీంతో ఆయన తాజాగే ప్రారంభించిన ఈ ‘ఆపరేషన్’ ఫలితమేమిటి, తెరాసకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వినవస్తున్నాయి. గతానికి భిన్నంగా కేసీఆర్ స్వయంగా ఫోన్ లు చేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటే.. భవిష్యత్ లో ఏదో ఒక పదవి గ్యారంటీ అన్న ఆశతోనైనా పార్టీలోకి వలస వస్తారన్నది ఆ వ్యూహంగా పరిశీలకులు  అంటున్నారు.  ఎందుకంటే కేసీఆర్ పిలుపునకు స్పందించి తెరాస గూటికి చేరిన వారంతా గతంలో పార్టీలో ప్రాధాన్యత లేదనీ, పదవులు దక్కలేదన్న అలకతో పార్టీ వీడిన వారే కావడం గమనార్హం. దాసోజు శ్రవణ్ కానీ, స్వామిగౌడ్ కానీ ఇదే కోవకు చెందుతారు. అయితే తాజా ఆపరేషన్ ఆకర్ష్ కు స్పందించి తెరాసలోకి వస్తున్న వారిలో ప్రజాదరణ ఉన్న నేతలు కానీ, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉన్న నేతలు కానీ, ఎన్నికలలో నిలబడి ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే నేతలు కానీ ఎవరూ లేరు. ఎక్కడ ఉన్నా ఒకటే అనే స్థాయి నేతలు మాత్రమే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ వలకు చిక్కు గులాబి గూటికి చేరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో అటువంటి నేతల వల్ల నిజంగా టీఆర్ఎస్ కు లభించే ప్రయోజనం ఏముంటుందని.. పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు తెరాసలోకి వలసలు వస్తున్నాయి. పార్టీకి ఆదరణ తగ్గలేదు అని చెప్పుకోవడానికి తప్ప ఇటీవల తెరాసలోకి వలస వచ్చిన వారితో పార్టీకి కలిగే ప్రయోజనం పూజ్యమని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులూ అంటున్నాయి. దాసోజు శ్రవణ్ కుమార్, రాపోలు ఆనంద భాస్కర్ వంటి వారు ప్రసంగాలు చేయగలరే తప్ప ప్రజా క్షేత్రంలో గుర్తింపు ఉన్న నాయకులు కాదు. ఆ పాటి ప్రసంగాలు చేయగలిగే నేతలు తెరాసలో చాలా మందే ఉన్నారు. మరి కొత్తగా ఇటువంటి నేతలను పిలిచి మరీ పార్టీ కండువా కప్పడం వెనుక కేసీఆర్ ఆంతర్యమేమిటో  అర్ధం కావడం లేదని తెరాస శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. 

జగన్ హయాంలో రివర్స్ పాలన.. జీవోలు గోప్యం.. నిఘా నివేదికలు బహిర్గతం!

రివర్స్ టెండర్లంటూ ఆరంభించిన జగన్ సర్కార్.. పాలననే రివర్స్ చేసి పారేసింది. ఏ ప్రభుత్వమైనా తనకు నిఘావర్గాల(ఇంటెలిజెన్స్) ద్వారా  వచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఆ వర్గాల సమాచారం మేరకు అప్రమత్తమౌతుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారిస్తుంది. అలాగే పాలనలో భాగంగా జారీ చేసే ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్ డొమైన్ లో ఉంచి.. ప్రజారంజకంగా పాలించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తుంది. అయితే ఏపీలో జగన్ సర్కార్ మాత్రం అందుకు రివర్స్ లో వ్యవహరిస్తున్నది. ఏపీ సర్కార్ ఇంటెలిజెన్స్ నివేదికలు లీక్ చేస్తూ.. జీవోలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. జీవోలను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నది. 13 మంది జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేయవచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదిక సోషల్ మీడియాలో, మీడియాలో హల్ చల్ చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ ఇంటెలిజెన్స్ నివేదికకు అనుగుణంగా పోలీసులు మంత్రులకు భద్రత పెంచారు. ఇంటెలిజెన్స్ నివేదిక లీక్ కావడం అంటే ప్రభుత్వం విఫలమైనట్లుగానే భావించాల్సి ఉంటుంది. అసలు ఇంటెలిజెన్స్ నివేదిక బయటకు పొక్కితే దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సర్కార్ తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. లీకైన ఇంటెలిజెన్స నివేదికను సాకుగా చూపి జనసేన కేడర్ పై విమర్శలు గుప్పించడానికీ, వారిపై నిర్బంధం పెంచడానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటున్న తీరు చూస్తుంటే ప్రభుత్వమే ఈ నివేదికను లీక్ చేసిందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.  

కుల‌ రాజకీయాలకు  కాంగ్రెస్ తిరిగి వచ్చిందా? 

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల‌పై  యింకా కుల ప్ర‌భావం ఉంద‌నాలి. దేశంలోని ఇంగ్లీషు సోష‌ల్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ వార్త‌లు చూస్తుంటే శ‌శిథ‌రూర్‌ని దూత‌గా, త‌న పార్టీ చేతిలో బ‌ల‌యిన వ్య‌క్తిగా అనుకోనే అవ‌కాశం ఉంది. ఆయ‌న సంస్క‌ర్త‌గా, ప్రొఫెస‌ర్‌గా ఆయ‌న విదేశీ అభిమాను ల‌కు క‌న‌ప‌డ‌తారు. ఆయ‌న ర‌చ‌నావ్యాసాంగం, వాక్చాతుర్యం, ప్ర‌సంగాలు అన్నీ ఆయ‌న‌కు సెల‌బ్రిటీ స్థాయిని క‌ల్పించాయి. కానీ ఆయ‌న పార్టీ ప‌ద‌వికి ఎన్న‌డూ పాకులాడ‌ని స్థితికి ఎలా ఉండి పోయారో అర్ధంకాదు. ఇప్పుడు స్పష్టమైన విజేత, 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు క‌న‌ప‌డుతున్న తీరుకు విరు ద్ధంగా కార్మిక ఉద్యమా లలో తన రాజకీయ మాట‌కారిత‌నాన్ని త‌గ్గించుకుని, అనేక ప్రాంతీయ ఎన్నికల విజయాలను సాధించాడు. అన్నింటి కంటే మించి దళితుడు, విజయం సాధించాడు. ఖర్గే కూడా కాంగ్రెస్ వర్గాలు, క‌ట్టుబాట్లను తారుమారుచేయ‌గ‌ల నైపుణ్యం ఉన్న‌ పార్టీ వ్యక్తి.  ఇద్దరు వ్యక్తులు దక్షిణానికి చెందినవారు కావడం, కాంగ్రెస్ పోరాటం జాతీయ ఎన్నికల రాజకీయాల ఉత్తరాది స్థిరీ కరణను తలకిందులు చేస్తుందని సూచిస్తుంది. ఏ రెండు సామాజిక వర్గాలు ఒకేలా ఉండవని, సామాజిక వర్గాల మధ్య జరిగే పోటీయే భారత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీగా మార్చిందని కూడా ఈ పోటీ తెలియ‌జేసింది. భాష, కులం శక్తి,  థరూర్‌, ఖర్గే మధ్య విభేదాలను నిర్వచించినా, పోటీ లో రాహుల్ గాంధీ వ్యక్తిత్వం పెద్దదిగా ఉంది. ఖర్గే కు మంచి మెజారిటీ వ‌చ్చినా, ఆంగ్ల మాధ్యమం కుట్రలు, కుతంత్రాలతో ఎన్నికల ప్రక్రియను కూడా కించపరిచే ప్రయత్నా లతో కొట్టుమిట్టాడుతోంది, ఇది అనేక విధా లుగా భారత రాజకీయాల స్థితిని స్ప‌ష్టం చేస్తుంది. కాంగ్రెస్ దాని ప్రారంభ పునాదుల రోజుల నుండి భారతదేశంలోని ఆంగ్లం మాట్లాడే ఉన్నత వర్గాలను ఆకర్షించింది. అధికార భాష గా, ఒక శతాబ్దం తరువాత, ఇంగ్లీష్ ఇప్పుడు పాలనను ఆదేశించదు. ఇంకా, ఖచ్చితంగా భారతీయ ఆంగ్ల మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా కుల-అంధులుగా ఉన్నందున నిస్సందేహంగా వారి కుల ప్రత్యేకతను కాపాడుకోవడం కోసం థరూర్ తమ అభి మాన అభ్యర్థిగా ఫ్లోటర్ ఓటర్‌ను తిప్పికొట్టడానికి, ఆకాంక్షకు ప్రాతినిధ్యం వహించే అధికారాలతో అంచనా వేయబడింది. ఖర్గే వృద్ధుడే కాదు, తన సొంత అభిప్రాయాలను కూడా కలిగి లేడని కొట్టిపారే శారు. వ్యంగ్యం మాయ‌మై చాలా కాలమ‌యింది. రాజ కీయ కథనాలు, అదృష్టాలు, దిశను మీడియా ప్రభావితం చేయగలిగినంత మేరకు, ఖర్గే విజయం పక్షపాతాన్ని మళ్లీ ధృవీకరించ డానికి ఉపయోగపడింది. థరూర్ గొప్ప‌ ఆస్తి నిజా నికి అతని మీడియా అవగాహన. నరేంద్ర మోడీ రాజ‌కీయ‌తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పటి నుండి, ఫోర్త్ ఎస్టేట్  సాంప్రదాయ అభిప్రాయాలను రూపొందించే యంత్రాంగానికి ఏదైనా ముఖ్యమైన శక్తి ఉందా అనేది పూర్తిగా అస్పష్టంగా ఉంది. ఖర్గేను ఎన్నుకోవడంలో, ఆంగ్ల మాధ్యమాన్ని కూడా సమర్థ వంతంగా ఎంపిక చేయడంలో, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో మాత్రమే ఆడుకుంటోందని చెప్పాలి. దురదృష్ట వశాత్తూ ప్రెస్ మళ్లీ పెద్దగా నష్టపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి, ఆంగ్ల పత్రికలు అధికార పక్షానికి ఎటువంటి ప్రవేశం లేకుం డా పోరాడవలసి ఉంటుంది, అయితే ఇప్పుడు పాత పార్టీ అవమానాన్ని కూడా పొందుతుంది, ఈ ప్రక్రియలో దాని స్వంత విశ్వస నీయత, అధికారాన్ని తగ్గిస్తుంది. భారతదేశంలోని బహుళ-పార్టీ ప్రజాస్వామ్యానికి దాని ఆంగ్ల మాధ్యమానికి ఇది శుభవార్త కాదు. ఖర్గే విజయంలో, కాంగ్రెస్ బదులుగా కులం శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. అత్యంత పోటీ తత్వం ఉన్న ఎన్నికల సందర్భంలో, బిజెపి తన స్వంత ప్రయోజనం కోసం కుల మాతృకను ఉపయో గించుకుంది, సాధన చేసింది. పంజాబ్ ప్రచారంలో దళిత ముఖంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ కాంగ్రెస్‌కు ఓట్లను సాధించనప్పటికీ, ఈ ముఖ్యమైన, చారిత్రాత్మకంగా అణచబడిన, ప్రస్తుతం తక్కువ ప్రాతి నిధ్యం లేని సామాజిక వర్గం వైపు పార్టీ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా కులాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ  ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం బీజేపీ నిశ్చయాత్మక గుర్తింపు రాజకీయాల నుండి ప్రత్యామ్నాయ దృష్టిని అందిస్తుంది. అయితే, ఇది సింబాలిక్ టోకెనిజం స్థాయిలో మాత్రమే మిగిలి ఉంటే, ఇది కాంగ్రెస్‌కు కోల్పోయిన అవకాశం. నిస్సందేహంగా, హైందవ హిందూ జాతీయవాద యుగంలో కులానికి సంబంధించిన కొత్త రాజకీయాల పునఃస్థాపన కొత్త రాజకీయ ప్రారంభాన్ని అందిస్తుంది. భారతీయ సమాజం ప్రాథమిక నిర్మాణంగా, కులం చాలా కాలంగా భారత ప్రజాస్వామ్యానికి జైలు గృహంగా ఉంది. ఇప్పుడు, అది ఎన్నికల సమీకరణాల కోసం కులపెద్దల సంకేత మరియు సాధన గణనకు అతీతంగా కొత్త ఊహ  రాజకీ యాలకు అర్హమైనది మరియు డిమాండ్ చేస్తోంది. సంక్షిప్తంగా, కొత్త కుల రాజకీయాలు ఇప్పుడు విరక్తి, నకిలీ సోషలిజం విష పూరిత మిశ్రమాన్ని అనుకరించలేవు, ఇది మునుపటి యుగంలోని మండల్ రాజకీయాలను నిర్వ చించింది. అది ప్రభావవంతంగా లేదా స్ఫూర్తిదాయకంగా ఉండదు! చివరగా, కొత్త అధ్యక్షుడు చరిత్రకు తిరిగి వచ్చారు. భారత్ జోడో యాత్ర సామూహిక సంప్రదింపు కార్య క్రమం మధ్య ఖర్గే వైపు తిరిగి, కాంగ్రెస్ రాజకీయశ్రమంతా పాత విభజనకు తిరిగి వచ్చింది. చారిత్రా త్మకంగా, రాజకీయ నాయకత్వం పార్టీ అధ్యక్షత మ‌ధ్య ఎంతో తేడాలున్నాయి. ఇది గాంధీ యుగం నుండి నెహ్రూ వరకు ఇటీవలి యుపిఎ యుపిఎ కాలంలో కూడా ఘర్షణలో లేదా సామరస్యంతో రెండు వేర్వేరు వ్యక్తులచే పార్టీ, ప్రభుత్వం నడిపించబడింది. ప్రజా సంప్రదింపు కార్యక్రమం జరుగుతు న్న సమయంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ ఆత్మ సంతృప్తి అధ్యాయం నుండి బయటపడినట్లు కనిపిస్తోంది. కనీసం 2012 నుండి, పార్టీ అద్వితీయమైన ఓటములతో మాత్రమే కాకుండా, కీలకంగా, రాజకీయ భాష కోల్పోవడం వల్ల కూడా ఇరుకైనది. ప్రస్తుతా నికి, హిందూ జాతీయవాద ఆధిపత్యా న్ని అణగదొక్కడానికి ప్రాంతాన్ని, సమా జాన్ని పునర్వ్య వస్థీకరిం చడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ భవిష్యత్తును కోరుకుంటోందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ తరుణం లో, కాంగ్రెస్  రాజకీయ అధికారానికి మార్గం ఇంకా గొప్ప ఆకర్షణీయమైన దృష్టితో వెలిగిపోవాలి.

మూడు రాజధానులకు జనామోదం లేదని చెబుతూనే ఎందుకీ జులుం?

మూడు రాజధానులకు జనం ఆమోదం లేదని వైసీపీకి కూడా అర్ధమైపోయిందా? అందుకే ఉత్తరాంధ్ర మంత్రులలో అసహనం పీక్స్ కు చేరుకుందా? ధర్మాన మాటలు వింటుంటే ఔననే సమాధానం వస్తోంది. ధర్మన ఇటీవలి కాలంలో తరచుగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వడం లేదని విశాఖ వాసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వని వారంతా విశాఖ ద్రోహులు, ఉత్తరాంధ్ర ద్రోహులు అంటూ వమర్శలు గుప్పిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ఎందుకివ్వరని కన్నెర్ర చేస్తున్నారు. అయితే మొత్తం మీద విశాఖ రాజధాని అంటే విశాఖ ప్రజలే అంగీకరించడం లేదని ధర్మాన తన చేష్టల ద్వారా పదే పదే రుజువు చేస్తున్నారు.  రోజూ విశాఖ రాజధానిని జనం ఇష్టపడటం లేదనే మాటే చెబుతున్నారు.   విశాఖ రాజధానికి మద్దతు కోసం ఏర్పాటు చేసిన సభలో విశాఖ రాజధాని కోసం చేతులెత్తమని అడిగితే ఒక్కరూ ఎత్తలేదు. దీంతో వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనని చిటపటలాడారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో  ఆయనకు విశాఖకు అనుకూలంగా స్పందన కనిపించలేదు. దాంతో మళ్లీ కన్నెర్ర చేశారు. విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వాసులు నోరెందుకు విప్పడం లేదని ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ధర్మాన విశాఖ రాజధాని పల్లవి ఎందుకు ఎత్తుకున్నారో అందరికీ తెలిసిన విషయమే కనుక ఆయన చిటపటలకు, కోపానికి ఎవరూ బెదరడం లేదు. ఆయన మాటలకు తందాన అనడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి ఏపీకి రాజధానిని నిర్ణయించే సమయంలో అమరావతే రాజధాని అని ఏకగ్రీవంగా సర్వామోదం తెలిపారు. అప్పట్లో అమరావతికి వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు వైసీపీ స్వరం మార్చినంత మాత్రాన ప్రజలు కూడా మారతారని, మారి తీరాలని ఎందుకు అంటున్నారో.. వారికే అర్ధం కాని పరిస్థితి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో ధర్మాన వాస్తవాలు వాగేస్తున్నారు.. విశాఖ వాసులపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఓ వెలుగువెలిగారు. అయితే వైఎస్ తనయుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. తొలి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. పుండు మీద కారం చల్లినట్లుగా ఆయన సోదరుడికి ఆమాత్యపదవి లభించింది. సరే కంటి తుడుపు చర్యగా మలి కేబినెట్ లో ధర్మాన క్రిష్ట ప్రసాద్ కు ఉద్వాసన పలికి ధర్మాన ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు జగన్. అయితే.. గతంలో ధర్మాన కూడా అమరావతికే మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపినందునే రైతులంతా భరోసాతో భూములిచ్చారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత .. భూ దందాల కోసం… తాము కబ్జా చేసిన భూములను రక్షించుకోవడం కోసం విశాఖ రాజధాని అని తాము అంటే జనం కూడా తమ మాటకు వంత పాడాలని ధర్మాన జులుం చేస్తున్నారు.  

క్రాకర్స్ తో అలంకరించి కారును కాల్చేశాడు!

పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి.. ఎవడి పిచ్చి వాడికి ఆనందం.. పిచ్చి పీక్స్.. అంటే.. ఇదే కాబోలు.. అని అనకుండా ఉండలేరు. దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్‌ చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇదేం తిక్కరా నాయనా, వీడెవడండి బాబూ అని అనుకునేలా చేసింది.       అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడో మరో కారణమో కానీ.. డిఫరెంట్‌గా థింక్‌ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్‌ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులు వరసగా పేర్చాడు. ఆ తర్వాత బాంబులను పేల్చాడు.  దీంతో కాసేపు ఆ ప్రాంతమంతా క్రాకర్స్ శబ్ధంతో మారుమోగిపోయింది. బాంబులు పేలడంతో కారు కలర్‌ మొత్తం మారిపోయింది. పేలిన టపాసుల ధాటికి కారు గ్లాస్‌ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజిన్‌ పని చేయడం విశేషం. కాసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విరాట్ అద్భుత ఇన్నింగ్స్ పై అనుష్క లవ్లీ రియాక్షన్

 టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన విరాట్ కోహ్లీని క్రికెట్ ప్రపంచం మొత్తం పొగడ్తల వర్షంలో ముంచెత్తుతోంది. అయితే విరాట్ భార్య,  బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పై చేసిన ఒక ఎమోషనల్ పోస్టు క్రీఢాభిమానులు, సినీ అభిమానులనే కాకుండా అందరినీ ఆకర్షిస్తోంది.  అనుష్క శర్మ తన భర్తపై విరాట్ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం తానెలా ఎమోషనల్ అయ్యానో చెబుతూ ఇస్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అందుకు విరాట్ ఇచ్చిన సమాధానం కూడా నెటిజన్ల మనసు దోచుకుంది.  పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించిన ‘ఛేజింగ్ కింగ్’ విరాట్ కోహ్లీపై   దిగ్గజ ఆటగాళ్లు, రాజకీయ, సినీ, పారిశ్రామిక, ఇతర రంగాల ప్రముఖులు  ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.   90 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన మెల్‌బోర్న్ స్టేడియం ‘విరాట్ కోహ్లీ.. ఇండియా.. ఇండియా’ నినాదాలతో హోరెత్తింది.  తర్వాత దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ పోరును ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా టీవీల్లో, కంప్యూటర్ తెరలపై వీక్షించిన కోట్లాది మందిలో విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఉంది. మ్యాచ్ తర్వాత ఆమె ‘ నువ్వొక అద్భుతం. నువ్వు ఇవాళ దీపావళి కంటే ముందే చాలా మంది జీవితాల్లో ఎంతో వెలుగుల సంతోషం నింపావు. నువ్వొక వండర్‌పుల్ మ్యాన్‌వి... నీ ధైర్యం, సంకల్పం, నమ్మకం అపూర్వం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో  పోస్టు చేసింది. ఆ పోస్టులో    తన జీవితంలో  అత్యుత్తమ మ్యాచ్‌ను ఇప్పుడే చూశాననీ, మ్యాచ్‌ తర్వాత ఆనందంతో డాన్స్ చేశాననీ, అరిచాననీ పేర్కొంటూ, తానెందుకు అలా అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానో అర్ధం చేసుకునే వయస్సు ఇంకా తమ కుమార్తెకు లేకపోయినా, తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడని ఏదో ఒక రోజు తను తప్పకుండా తెలుసుకుని గర్వపడుతుందనీ పేర్కొంది. కెరీర్‌లో ఒక టఫ్ దశను ఎదుర్కొని మునుపెన్నడూ లేనంత బలంగా తిరిగొచ్చి చేసిన నీ ప్రదర్శన  నాకెంతో గర్వంగా ఉంది  నీ ధైర్యం స్ఫూర్తిదాయకం. నీపై నా ప్రేమ అపరిమితం. నీ కష్టాల్లో, విజయాల్లో.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అన పేర్కొంది. ఆ పోస్టు వెంటనే వైరల్ అయ్యింది. లక్షల మంది లైక్ చేశారు. భార్య ప్రేమ పూర్వక అభినందనకు కోహ్లీ స్పందించి తీరు కూడా నెటిజన్ల మనసు దోచుకుంది. థాంక్యూ మై లవ్‌. ప్రతి విషయంలో, ప్రతి క్షణంలో నాకు మద్దతుగా నిలిచావు. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ అండ్ లవ్‌ యూ సో మచ్ అంటూ కోహ్లీ చేసిన పోస్టు కూడా క్షణాల్లో వైరల్ అయ్యింది. 

ది వాల్ ద్రావిడ్ చేతే గంతులేయించిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్

విరాట్ కోహ్లీ..పరుగుల యంత్రం, ఛేజింగ్ ఛాంపియన్.. తన కళాత్మక బ్యాటింగ్ తో భారత్ కు పాక్ పై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అసలే మాత్రం అవకాశం లేని చోట, ఓటమి తథ్యమని అంతా చేతులెత్తేసిన వేళ.. తనకే సాధ్యమైన అత్యద్భుత ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు.   భారత్- పాక్ మధ్య మ్యాచ్ అంటే.. అది కేవలం క్రీడ కాదు.. అంతకు మించి.. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అటువంటి మ్యాచ్ చివరి వరకూ అంటే చివరి బంతి వరకూ పోటా పోటీగా సాగిందంటే.. స్టేడియంలో ఉన్న 90 వేల పైచిలుకు ప్రేక్షకులే కాదు.. టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ ను కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు కూడా మునికాళ్ల మీద నుంచి గోళ్లు కొరుక్కుంటూ ఊపిరి బిగపెట్టి చూస్తారనడంలో సందేహం లేదు. దీపావళి ముందు రోజు మెల్ బోర్న్ వేదికగా భారత్, పాకిస్థాన్ ల మధ్య టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోట్లాది మంది నరాలు తెగిపోయే ఉత్కంఠతో చూశారు అందులో సందేహం లేదు. అలా చూసి భారత్ గెలుపు అనంతరం ఆనందంతో గెంతులు వేసిన వారిలో క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ కూడా ఉన్నాడు. ఇక మిస్టర్ కూల్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే టీమ్ ఇండియా హెడ్ కోచ్ కూడా ఆనందంతో చేతులు విసరడం, ఆనందంతో ఉప్పొంగిపోవడం చూశాం.  ఎప్పుడూ కూల్ గా కనిపించే మిస్టర్ వాల్ ద్రావిడ్ శనివారం నాటి  మ్యాచ్‌లో టీమిండియా విజయం తర్వాత   భావోద్వేగాలు నియంత్రించుకో లేకపోయాడు. ద్రావిడ్ ఆనందంతో గంతులు వేశాడు.. విరాట్ కు ఎదురెళ్లి ఆలింగనం చేసు కున్నాడు. ఇందుకు సంబంధించి  ఐసీసీ పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.  ఎందుకంటే ఎంతటి ఉత్కంఠ భరితమైన సమయంలోనైనా సరే రాహుల్ ద్రావిడ్ పెద్దగా భావోద్వేగానికి గురికాడు. కామ్ గా ఉంటాడు. కోల్ కతా వేదికగా 2001లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ లో  ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో లక్ష్మణ్ తో కలిసి   376 పరుగుల రికార్డు భాగస్వామ్యం సాధించి మ్యాచ్ ను గెలిపించిన సందర్భంలో కూడా ఎలాంటి ఎమోషన్స్ ప్రదర్శించలేదు. గంభీరంగానే ఆ క్షణాలను ఆస్వాదించాడు ద్రావిడ్. వాల్ అన్న తన బిరుదుగు తగ్గట్టుగా గోడలాగే ఎలాంటి ఎమోషన్స్ నూ సాధారణంగా ప్రదర్శించడు. అయితే అటువంటి వాల్ ద్రావిడ్ కూడా దీపావళిని ఒక రోజు ముందే తీసుకువచ్చిన కోహ్లీ సూపర్బ్ ఇన్నింగ్స్ ను చూసి   బ్రేక్ అయ్యాడు. ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక పోయాడు. జట్టు సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాడు. గంతులు వేశాడు. ఆ తరువాత డ్రెస్సింగ్ రూమ్ కు వస్తున్న విరాట్ కోహ్లీకి ఎదురెళ్లి హత్తుకుని అభినందించాడు