మునుగోడులో గెలిచేది ఆ  పార్టీ యేనా

మునుగోడు ఉప ఎన్నిక ను అన్ని పార్టీలు చాలా సీరియస్ గానేతీసుకుంటున్నాయి. ముఖ్యంగా రాబోయే ప్రధాన ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీస్ గా భావించడంతో అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది.  మునుగోడును అడ్డుపెట్టుకుని తెలంగాణాలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో బీజెపీ ఉంది. మరో వైపు కాంగ్రెస్ టీపీసిసీ అధ్యక్షుడు రేవంత్ సారధ్యంలో బీజేపీ, టీ ఆర్ ఎస్ లకు చెక్ పెట్టి కేసీ ఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని  రెండింతల ఆవేశంతో ముందుకు ఉరుకుతోంది. టీ ఆర్ ఎస్ ఎలాగైనా కాంగ్రెస్ను, బీజేపీ నీ తమ అధికారాన్ని కొల్లగొట్టకుండా చూసే యత్నంలో ఉంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా, టిఆర్ఎస్ కు అంత సీన్లేదని బీజేపీ విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయని  కాంపాక్ట్ సర్వే వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన అనేక సర్వేలు మాత్రం బీజేపీయే ఈసారి మునుగోడులో గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికలు, ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితం గా జరుగుతాయనే చెప్పాలి. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 2 లక్షల,43వేల,594 ఓట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అనుసరించి బీజేపీ 36 శాతం, అధికార టీఆర్ఎస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధించుకోవచ్చని కాంపాక్ట్ సర్వే తెలియజేసింది. మునుగోడులో కాంగ్రెస్కు 14శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు రావచ్చని తెలుస్తోంది.  మండలాల వారీగా చూసుకుంటే.. చండూరు మున్సిసిపాలిటీలో 9 వేల 950, రూరల్ లో 19 వేల 500 ఓట్లున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీల మధ్య మంచి పోటీ ఉంది. అయితే డబ్బు పంపిణీ జరుగు తున్న నేపథ్యంలో ఓటరు ఎటు మొగ్గు చూపుతాడన్నది అనుమానమే. కాంగ్రెస్ కంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే పోటాపోటీ నడుస్తోంది. ప్రచారంలో గాని, ఓటర్లను ఆకట్టుకోవడంలోగాని బీజేపీ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది. కాగా చౌటుప్పల్ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 25 వేల 493 ఓట్లు ఉన్నాయి. చౌటుప్పల్ లో మొదటి రెం డు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు సమానంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో ఇక్కడి కాంగ్రెస్ ఓటు బ్యాంకును రెండు పార్టీలు సమానంగా పంచుకు నేలా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ క్రమేపీ ప్రాభవం కోల్పోయిందనే అనాలి. కానీ భారత్ జోడో యాత్ర ప్రభావం అంతగా లేదనేది స్పష్టమవుతోంది. అయితే పదిరోజుల క్రితం బీజేపీకి చెం దిన ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు తంగేడుపల్లి, మరొకరు లింగోజిగూడెంకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరటం గమనార్హం. ఇది బీజేపీపై ప్రభావం చూపవచ్చు.  కాగా 16 వేలకు పైగా ఓట్లున్న గట్టుప్పల్ లో బీజేపీ కంటే టీఆర్ఎస్ వెనకంజలో ఉందనే చెప్పాలి. బీజేపీకి 50 శాతం ఓట్లు రావడానికి చాలా అవకాశా లున్నాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు మోహరించినప్పటికీ ఓటరు అధికార పార్టీకే ఓటువేస్తా రనే గ్యారంటీ లేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ ఓట్లు చీలవచ్చు. గతంలో కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న మర్రిగూడలో దాదాపు 28 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ టీఆర్ ఎస్ బలం ఇటీవలి రాజకీయ పరిణామాలతో తగ్గిందనాలి. అధికారపార్టీ ఇక్కడి యువతను ఆకట్టుకోవడానికి విశ్వయత్నాలు చేస్తోంది. ఇక్కడ బీఎస్పీకి కూడా అభిమానులు ఉన్నారు. టీఆర్ ఎస్ ప్రాభవం ఉన్న చాలా గ్రామాల్లో ఓటర్లను డబ్బుతో బాగా ఆకట్టుకుంది. దీనితో ఓటర్లు టీఆర్ఎస్ కు పట్టం కట్టవచ్చు. కానీ డబ్బుల పంపిణీ జరగడం అనేది యింకా అమలు కాలేదు గనుక ఓటర్ మనసు మార్చుకున్నా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు.  ఇక అత్యంత కీలకమైన మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ రెండూ బరాబరీగా ఉన్నాయి. ఇక్కడ 36వేల మంది ఓటర్లలో చాలామంది బీజేపీకే మొగ్గుచూపుతున్నారనాలి. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ కోటగా భావించినప్పటికీ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో తలెత్తిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కొంత ఇబ్బందుల్లో పడిందనాలి. పైగా ఇక్కడ కోమటిరెడ్డి సోదరులకు అభిమానుల బలం ఎక్కువే. మరో వంక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన సోదరుడు వెంకటరెడ్డి పట్ల పార్టీ వర్గాలు కూడా నమ్మకం కోల్పోయాయి. అయితే టీఆర్ ఎస్ ను బలపరిచేందుకు కేసీఆర్ మహాసభ విజయవంతం అయితే పోటీ మరింత పోటాపోటీగా మారుతుంది. అయినప్పటికీ పరిస్థితులు టీఆర్ఎస్ కు అంతగా అనుకూలించవని విశ్లేషకుల మాట. ఇక్కడ అనూహ్యంగా బీజేపీకి మెజారిటీ ఓట్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి.  కోమటిరెడ్ది అభిమానులు తప్పకుండా ఈ పరిస్థితుల్లో బీజేపీ నే గెలిపించే అవకాశాలున్నాయని కోపాక్ట్ సర్వే వెల్లడించింది.  కాగా మునుగోడు నియోజకవర్గంలో వెనుకబడినప్రాంతంగా పేర్కొనే నాంపల్లి అభివృద్ధి ఏమాత్రం లేకపోవడంతో ప్రజలు అధికార టీఆర్ ఎస్ పార్టీ పట్ల ఆసక్తి చూపడం లేదు. తండాలు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో 35వేల ఓట్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల మాత్రం ప్రజలు విముఖంగా లేరు.  అధికార పార్టీ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కి కూడా వీరాభిమానులు ఉన్నారని సర్వేలో తేలింది. ఇక్కడ త్రిముఖ పోటీకీ అవకాశం ఉందని కోపాక్ట్ సర్వే స్పష్టం చేసింది.  కాగా నారాయణపురం విషయానికి వస్తే, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు మంచి పేరుంది. కాగా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడివాడే కావడంతో టీఆర్ ఎస్ ప్రతిష్టాత్మకంగానే తీసుకుందనాలి. 36 వేల మందికి పైగా ఓటర్లున్న నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత అభిమానులు ఉండటంతో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని. ఇక్కడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి షిఫ్ట్ అయితే, ఆ పార్టీకి లీడ్ ఉంటుందని కాంపాక్ట్ సర్వే స్పష్టం చేసింది. ఇదే మండలంలోని గుడిమల్కాపూర్ లో వివిధ పథకాలు బాగా అమలు కావడంతో టీఆర్ఎస్ కి కలిసిరావచ్చని పేర్కొన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అదే జరిగితే ఇక్కడ బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని సర్వే పేర్కొంది. 

అప్పుడలా.. ఇప్పుడిలా..

నాడు నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరగబోతోందన్న బిల్డప్ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పడు  కేటీఆర్ బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కోరుతున్న ఫోన్ సంభాషణ అడియో రిలీజైతే మాత్రం అందులో తప్పేముంది. నేనే మాట్లాడా, అది నా గొంతే అని దబాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. తాను చేస్తే రైటు.. ఇతరులు ఏం చేసినా రాంగ్ అన్న టీఆర్ఎస్ వైఖరికి ఇది నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు ఓటుకు నోటు కేసులో  అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో తెలుగుదేశం అధినేత.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు  అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఆ ఫోన్ కాల్ లో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన మాటలలో సొమ్ము ప్రస్తావన ఏదీ లేదు. అయినా అప్పట్లో చంద్రబాబు మాటలతో తెలంగాణలో ఏదో  బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి చేసింది. నాడు ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు ప్రస్తావన చేయలేదు. మనవాళ్లు నాకు బ్రీఫ్ చేశారు. వారేం చెప్పారో అది జరుగుతుంది. మనం కలిసి పని చేద్దాం అని అన్నారు. దానితోనే కోట్ల రూపాయల వోటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ అప్పట్లో తెరాస సర్కార్ హడావుడి చేసింది. ఇప్పుడు కేటీఆర్ ఒక బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. మనుగోడు ఉప ఎన్నిక తో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడేదీత లేదు.. టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేదీ లేదు.  అందుకే మీరు మా పార్టీలోకి రండి మీ ఆశీర్వాదం కావాలి అంటే పార్టీలో చేరాల్సింగా ఒత్తిడి చేశారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఔను   అవును నేనే మాట్లాడాను. తప్పా. ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేమన్నా తప్పా.. పని చేశాం అని చెప్పాం. పార్టీలోకి రమ్మని అడిగాం తప్పేముంది అన్నారు. ఈ రెండు ఆడియోలూ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. నాడు చంద్రబాబు విషయంలో ఒకలా.. నేడు కేటీఆర్ విషయంలో ఒకలా టీఆర్ఎస్ స్పందన ఉండటం గమనార్హం అంటూ పరిశీలకులు అంటున్నారు.

రిమాండ్ కు  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు...హైకోర్టు  తీర్పు

అధికార తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు లో నిందితుల రిమాండ్ కు హైకోర్టు అనుమతించింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామిలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ాదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రామాలో పట్టుబడిన నిందితులకు 41 ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్ కు తరలించేం దకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వాదనలు విన్న తర్వాత నిందితులకు రిమాండ్ కు అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్ల కూరు సుమలత తీర్పు వెలువరించారు. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర చాలని ఆదేశించారు.  రిమాం డ్‌ను నిరాకరిస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు శుక్ర వారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు లంచ్ మోషన్‌ను తరలించడం ద్వారా ముందస్తు విచారణను కోరింది, అయితే కోర్టు రెగ్యులర్ పిటిషన్‌ను కోరింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామి అనే ముగ్గురు నిందితులను విడుదల చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పోలీ సులు సవాలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు  బుధవారం రాత్రి టీఆర్ ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఎరచూపించి బీజపీ పార్టీలోకి  తీసుకు రావడానికి, పార్టీలో ఉన్నత పదవులతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడానికి  ప్రయ త్నించారు. ఆ ముగ్గుకు వ్యక్తులను సరూర్ నగర్ లో న్యాయమూర్తి నివాసానికి గురువారం రాత్రి పోలీసులు తీసికెళ్లారు. కానీ నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపేం దుకు పోలీసులు చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.  నిందితులుగా పేర్కొన్న ముగ్గురు టీ ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి  ఆకట్టుకోవడానికి  చేసే యత్నం లో డబ్బు ఆశ చూపారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి పోలీసుల అభ్యర్ధ నను నిరాకరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని ఆయన అన్నారు.  కాగా,ఈ కేసు విషయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.  బీజేపీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తెలంగాణా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  మునుగోడు ఉప ఎన్నికలనేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్  కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేస్‌ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిష నర్ హైకోర్టును కోరారు. పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు. 

రాహుల్ భారత్ జోడో యాత్రను మసకబార్చడానికేనా?

ఎవరు ఔనన్నా కాదన్నా రాహుల్ భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇప్పటి దాకా రాహుల్ పాదయాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలోనూ మంచి స్పందన లభించింది. మీడియా కూడా రాహుల్ పాదయాత్రకు మంచి కవరేజే ఇచ్చింది. కానీ ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టే సరికి సీన్ మారిపోయింది. రాహుల్ పదయాత్రకు జనస్పందన ఎలా ఉంది అన్న విషయం కూడా తెలియనంతగా మీడియా ఆయన యాత్రను డౌన్ ప్లే చేస్తోంది. అయితే ఇది ఉద్దేశ పూర్వకంగా కాదని పరిశీలకులు అంటున్నారు. ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భంగా జనస్పందన, యాత్ర వివరాలకు మీడియా , సామాజిక మీడియాలో మంచి కవరేజ్ వచ్చింది. దీపావళి సందర్భంగా విరామం ఇచ్చి తరువాత తెలంగాణలో ఆయన పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ అది ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది. మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హడావుడిలో మునుగోడు ప్రచార సంరంభం కూడా మసకబారిపోయింది. అది పక్కన పెడితే రాజకీయ వర్గాలలో మాత్రం రాహుల్ పాదయాత్ర ప్రాముఖ్యతను తగ్గించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల డ్రామాకు తెరలేచిందా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.  కాంగ్రెస్ ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బీజేపీకి ఇప్పుడు ప్రధానంగా అడ్డుపడుతున్నది రాహుల్ భారత్ జోడో యాత్రే. ఆయన యాత్రకు వస్తున్న ఆదరణ  బీజేపీ టాప్ బ్రాస్ లో బెదురు పుట్టించిందనడంలో సందేహం లేదు. అందుకే మోడీయే స్వయంగా కాంగ్రెస్ కదులుతోంది జాగ్రత్త అంటూ బీజేపీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవద్దనీ, ఆ పార్టీ కొత్త పంథాలో, కొత్త వ్యూహాలతో చురుగ్గా పుంజుకుంటోందనీ హెచ్చరించారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆయన అలా అన్నారనే అనుకోవాలి.  ఇప్పుడు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన తరువాత అప్పటి వరకూ ఆ యాత్రకు వచ్చిన కవరేజ్ హఠాత్తుగా ఆగిపోయింది. అందుకు కారణంగా బయటకు కనబడుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం. ఈ విషయంలోనే రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ లు కూడబలుక్కునే ఈ వ్యవహారానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, తెరాసలు కూడబలుక్కున్నాయా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. తమ సందేహాలకు కారణంగా వారు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. కేసీఆర్ అవసరం లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కాపాడుకోవడం అని అంటున్నారు. అందుకే ఉభయతారకంగా మునుగోడు ఉప పోరులో పోటీ విషయాన్ని విస్మరించి.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు, రాహుల్ పాదయాత్ర ప్రభావం లేకుండా చూసేందుకు కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. 

మునుగోడులో బీసీ ఓట్లే కీలకం.. మొగ్గు ఎటు?

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, విపక్ష  బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ నియోజకవర్గాన్ని  84 యూనిట్లుగా చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లను ఆయా యూనిట్లలో మోహరించింది. అలాగే బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోకి సైతం వెళ్లి ప్రచారం చేస్తూ బీజేపీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం.. తన ఐదో విడత మహా సంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌  వేసి మరీ   మునుగోడు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యం అన్నట్లుగా కదన రంగంలోకి దూకింది. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. మునుగోడులోనే బస చేసి మరీ.. పార్టీ  విజయం కోసం సర్వశక్తుల ఒడ్డుతున్నారు. అందుకే రాహుల్ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి ఇలా పాల్గొని.. అలా మళ్లీ మునుగోడుకు వచ్చేసి.. తన ప్రచారాన్నికొనసాగిస్తున్నారు. అయితే దుబ్బాక, హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్.. మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలన్న ధ్యేయంతో ప్రచారాన్ని మరో లెవల్ కు తీసుకువెడుతోంది. అలాగే బీజేపీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలిచాం.. ఆలాగే మునుగోడులో కూడా గెలిచి కమలం సత్తాను  సీఎం కేసీఆర్‌కు మరోసారి రుచిచూపించాలని ఉవ్విళ్లూరుతోంది.  అందుకు అనుగుణంగానే ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.  మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేలకుపైగా బీసీలే.  మునుగోడు లో ఎవరు విజయం సాధించాలన్న బీసీ ఓట్లే అత్యంత కీలకం. ఈ విషయమే మూడు పార్టీలలోనూ టెన్షన్ కు కారణమౌతోంది. ఎందుకంటే మునుగోడు బరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ముగ్గురూ  రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. అలాంటి వేళ..   బీసీ ఓట్లు కోసం ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే కాదు.. బీసీలను తమ వైపు తిప్పుకుంటే.. తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే  అని భావిస్తున్నాయి.  మరి బీసీలు ఎవరి వైపు.. ఏ పార్టీ వైపు.. ఎవరి పక్షాన నిలబడారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మునుగోడు ఫలితం తరువాత టీఆర్ఎస్ కు చుక్కలేనా?.. వరదలా బీజేపీలోకి వలసలేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత ఇప్పటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని, ఎదురు లేని పెత్తనం, ఆధిపత్యం చెలాయించిన పార్టీ. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా. ప్రజా వ్యతిరేకతతో పాటు.. పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి తార స్థాయికి చేరిందా? అంటే పరిశీలకులు అవునంటున్నారు. అధినాయకత్వంపై తిరుగుబావుటా ఎగురువేయడానికి సిద్ధమైన వారి సంఖ్య భారీగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం 2014, 2019 ఎన్నికల తరువాత కేసీఆర్ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ మిషన్ లేనని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పెద్ద సంఖ్యలో ఇరత పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో తెరాస పూర్తిగా కక్కిరిసి పోయిందంటున్నారు. అలా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో వారిపై తెరాస తరఫున పోటీ చేసి పరాజయం పాలైన వారికి పార్టీలో గుర్తింపు లేకండా పోయిందనీ, అలా గుర్తింపు లేకుండా పోయిన వారిలో అత్యధికులు తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ తెరాసతో కలిసి నడిచిన వారేనని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా ఇకపై తమది ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడంతో ఉద్యమ నేతలకు, ఉద్యమ కారులకు ఇకపై పార్టీలో ప్రాధాన్యత ఉండదని చెప్పకనే చెప్పేసినట్లయ్యింది. దాంతో ఉద్యమ కాలం నాటి నేతలంతా పార్టీ నేతలంతా పార్టీలో ఉన్నప్పటికీ మానసికంగా అనుబంధాన్ని కోల్పోయామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సిట్టింగులకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించేయడంతో చాలా నియోజకవర్గాలలో ఆశావహులు ఇక టీఆర్ఎస్ లో కొనసాగడం అనవసరం అన్న అభిప్రాయానికి వచ్చేశారు. అలాగే గత ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు తమ నియోజకవర్గంలోనే గత ఎన్నికలలో ప్రత్యర్థులుగా నిలిచి గెలిచిన వారి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెరాస నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో  చిక్కిన వారిలో నందు అనబడే నందకుమార్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనీ, ఆ డైరీలో తెరాసకు చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, వారు పార్టీ మారడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.  బీజేపీని ట్రాప్ చేయడానికో, లేక వారి ట్రాప్ లో పడటానికో  ఫామ్ హౌస్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలూ ఇప్పటికీ ప్రగతి భవన్ లోనే ఉండటం.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటం పై తెరాస వర్గాల్లోనే పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆ నలుగురినీ ఫామ్ హౌస్ లో నిర్బంధించారా అన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఒక వేళ వారు నిజంగానే బీజేపీ అగ్రనేతలను ట్రాప్ చేయడానికే అక్కడకు వెళ్లి ఉంటే వారిని ప్రగతి భవన్ కు పరిమితం చేయకుండా.. మునుగోడు ప్రచారానికి పంపి పార్టీ క్యాడర్ చేత బ్రహ్మరథం పట్టించేవారు కదా అని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో టీఆర్ఎస్ బండారం బయటపడే పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం అటూ ఇటూ అయినా.. అంటే తెరాస విజయం సాధించకపోతే మాత్రం కేసీఆర్ కు తలనొప్పులు తప్పవనీ, తెరాస నుంచి వలసలు గట్టు తెంచుకుని ప్రవహించే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఆ వలసలను నివారించడమెలా అన్నదే కేసీఆర్ ముందున్నపెద్ద సవాల్ అనీ, ఆ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలను నియంత్రించ లేని పరిస్థితి ఏర్పడితే టీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడుతుందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం వెలుగులోకి రాగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయి మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆందోళనలకు దిగిన తెరాస శ్రేణులు ఒక్క సారిగా చల్లబడిపోయాయి. ఇందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపే కారణం. హఠాత్తుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై ఎవరూ స్పందించద్దంటూ కేటీఆర్ పిలుపు నివ్వడంతోనే ఏదో తేడా కొట్టిందని తెరాస నాయకులు, క్యాడర్ కు అర్ధమైపోయింది. అందుకే వారిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వం సంక్షోభ సమయంలో ఎందుకు ఇలా మౌనం వహిస్తోందని పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చ ప్రారంభమైంది. ఒక వైపు అత్యంత ప్రతిష్ఠాత్మంగా కేసీఆర్ స్వయంగా ప్రకటించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా పట్టించుకోకుండా.. కేసీఆర్ మౌనం.. ప్రచారంలో జోరుగా తిరగాల్సిన నలుగు ఎమ్మెల్యేలు నాలుగు రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం.. బీజేపీ సవాళ్లకు స్పందించే నాథుడే లేకపోవడం వంటి విషయాలతో మునుగోడు పరాజయాన్ని కేసీఆర్ ముందుగానే అంగీకరించేశారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఫలితం తరువాత తెరాస పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది.

ఓటింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్న బీజేపీ 

ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్  అన్నారు. అవును రోజూ లెక్కలు చేస్తుంటే భయం పోతుందిరా.. అంటాడు తండ్రి కొడుకుతో...బాగా ప్రాక్టీస్ చేయి..సిక్స్ కొట్టడం తెలుస్తుందంటాడు ప్లేయర్ తో కోచ్.. ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటు వేయడం గురించి నేర్పుతారు అక్కడి వాలంటీర్లు. వేలి మీద వేసిన చుక్క ఎలా పోతుందనేది నాయనమ్మ చెబుతుంది.. చిత్రంగా మునుగోడులో జనానికి బీజేపీ వారు  తమకే ఓటువేసే విధానాన్ని బోధిస్తున్నారు.  అసలు ఏదయినా ప్రజలు తమకు అనుకూలమయ్యే మార్గాన్ని ఆలోచించడంలో బీజేపీ వారిని మించి ఎవ్వరూ ఉండరు. వారి తెలివే తెలివి. ఉపన్యాసాలతో ఆకట్టుకుంటారు, ఎవరయినా సరే తమవారిని చేసుకోవడం వారి పనులు కానిచ్చేసుకోవడంలో ఉండాల్సిన తెలివి కమలనాథులకే తగును. ఎంత ఆలోచించినా వారితో పోటీ పడటం చాలా కష్టం. ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ వారికి, టీ ఆర్ఎస్ వారికి రాని ఆలోచనని బీజేపీవారికి రావడం వెంటనే అమలుచేసేయడం క్షణాల్లో జరిగిపోతోంది. ఇపుడు ఇంటిం టికీ తిరిగి మాకు ఓటెయ్యండి అంటూ బతిమిలాడుకోవడం, నోటు ఇవ్వడమే కాదు.. వాటికన్నా అసలు పోలింగ్ బూత్ కి వెళ్లాక పెద్దాయనో, పెద్దమ్మో ఏ కీ నొక్కితే భీజేపీ కి ఓటు వెళుతుందో కూడా వారికి తెలి సేలా చేస్తున్నారు. వారికి మెల్లగా ప్రాక్టీస్ చేయించితే ఓటింగ్ రోజు ప్రత్యేకించి ఆ బోర్డు మీద మీట నొక్కడం గురించి తెలియజేయక్కర్లేదు.   ఎందుకంటే, పాపం ఓటర్లకీ అందరికీ ఓటు వేయడంలో ప్రాక్టీస్ ఉండాలిగదా.. ప్రాక్టీస్ చేయిస్తే ధైర్యంగా వెల్లి మీట నొక్కి నవ్వుతూ బయటికి వస్తాడు.. బీజేపీ వారి మనుషులంతా కమలమంత పెద్దగా నవ్వులు విరజిమ్ముతారు. అదిగదా ఆనందం. అదే కావాలి. అందుకే మునుగోడు మొత్తాన్ని బీజేపీ గుర్తు ఓటింగ్ మిషన్ మీద ఎక్కడుంటుంది, మీట ఎలా నొక్కాలి.. ఈ ఘనకార్యం చేస్తే మనసు ఎంతగా నెమ్మదిస్తుం దీ, అంతా ఎంత ఆనందంగా ఉంటారు, అక్కర్లేకున్న రిక్షాలోనో, ఆటోలోనో ఇంటికి వెళ్లే మార్గం గురించి పెద్దగా ఆలోచించకుండానే జరిగిపోవడం...అన్నీ అయిపోతాయి. పాపం ఓటరుకి అంతకంటే ఏం కావాలి. ఎలాగూ డబ్బుల పంపకాలు, హామీలూ అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు పోలింగ్ స్టేషన్ కి ఎలా వెళ్లాలి, ఓటు ఎలా వేయాలన్నది మాత్రం నేర్పుకోలేదు. అది బీజేపీవారే బాగా ముందుగా గుర్తించి మరీ వెంటాడి నేర్పుతున్నారు.  నేర్పితేనే గొప్ప విద్య అవుతుంది. నేర్పితేనే మాట వింటారు. నేర్పితేనే పార్టీ గెలుస్తుంది. నేర్పితేనే మన వెంట ఉంటారు... ఈ నినాదాలన్నీ ఎంతగా ఉపకరిస్తాయన్నది కూలంకషంగా ఆలోచించే ప్రయోగా త్మకంగా మునుగోడులో, ఆనక  పెద్ద ఎన్నికల్లో మరింత పకడ్బందీగానూ చేయిపట్టి చేయించే యొచ్చ న్నది కమలనాధుల ధీమా.. కాదు వాల్లు తప్పకుండా మన మాట వింటారని, మన గుర్తున్న మీటనే నొక్కుతారని కాషాయమంత వెలవని నమ్మకం. 

సమభావం లేనప్పుడు అన్నీ ఒకేలా ఎలా?

బీజేపీ వారికి దేశభక్తి మరీ నరనరాల నిండిపోతోంది. భక్తి తో తూగిపోతున్నారు, దాన్ని అందరికీ పంచాలి. సామాన్యు లకు బోధించాలి. అందుకే ప్రధాని మోదీజీ మన్ కీ బాత్ పేరుతో బోధానంద మోదీజీ గా మారారు. మనసులో మాట మరీ జనాంతికంగానే అనేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చేయడానికి అధికార యంత్రాన్ని అమాంతం రంగంలోకి దింపేయడం అన్నీ రాజకీయతంత్రంగానే భావించాలి. మనసులో మాట అంటూనే వారి నిర్ణయాన్ని ప్రకటించడంలో మోదీజీ ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చింతన్ బైఠక్ లోనూ ఒకే దేశం, ఒకే యూనిఫాం అనే కొత్త నినాదాన్నిచ్చారు. అసలా మాటకి వస్తే ఆయనలా మరే రాజకీయ నాయకుడూ దేశంలో ఆలోచించలేరు.. కడు దుర్లభం కూడా. వారిది ఆర్ ఎస్ ఎస్ క్రమశిక్షణ మరి. అందువల్ల మాటయినా, అభిప్రాయాన్న యినా రుద్దడమే తెలుసు. పలకమీద కాదు రాతి మీద శాసనమే. మనమంతా ఒకటే అంటూండడం పరిపాటి. అంతా ఒకటే ఏ విషయంలోనో తెలీదు. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రాలకీ మధ్య  అత్తగారు, చిన్న కోడలు, పెద్దకోడల తారతమ్యం చాలా ఉంది. పెద్దామెకు పెద్ద కోడలు పీట వేస్తే, చిన్న కోడలు అరిచి అడిగితే గాని గ్లాసుడు నీళ్లవదట.. అలా ఉంది కేంద్రం, రాష్ట్రాల మధ్య సో కాల్డ్ సంబంధాలు. మనది భిన్నత్వంలో ఏకత్వం.. కానీ ఎక్కడా ఎవ్వరూ సమానత్వం, ఏక కత్వం అనేది పాటించగా చూడం. రాజకీయవాతావరణం అంతగా పరిస్థితులను మలినంచేసేసింది. ప్రతీదీ రాజకీయాల మయం. రాజకీయ కోణంలోనే  ఆలోచించడం జరుగుతోంది. మరి ఇప్పుడు మోదీజీ కొత్త పిలుపుని చ్చారు.. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం అని. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా మాట్లా డారు. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని తెలిపారు. వారి చింతన్ శిబిరంలో ఏది చర్చించినా, నిర్ణయం తీసుకున్నా దేశానికి ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయంలో ప్రకటనలు చేయడం చిత్రం.  రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చిం చాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. ఇది ఉపన్యాసంవరకూ బాగానే ఉంది. కానీ రాష్ట్రాల మధ్య సమన్వయం సరిగా లేన పుడు, వివరాలు, సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడాల్లో రాజకీయ కోణంగా ఆలోచించి జాప్యాలు జరుగు తున్న సమయాల్లో శాంతి భద్రతలు, ప్రజారక్షణ అంశాల్లో కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది. పైగా అన్నింటికీ ముందే నిర్ణయాలు తీసుకుని, అమలు చేయాలన్న చివరి దశలో పోనీ మనోళ్లని ఒకసారి కలిసి మాట్లాడు తామన్న ధోరణే తప్ప జాతీకి ఉపయోగపడే అంశాల మీద రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయడం అవసరం. ీ విషయంలో మరి కేంద్రం ఏ మేరకు నమ్మకం కలిగిస్తోంది.  చిత్రమేమంటే,  నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేధోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్య మంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారి మాటకు కేంద్రం యిచ్చే ప్రాధాన్యత, గౌరవం మున్ముందు తెలుస్తుంది. హామీలు ఇవ్వడం కంటే వాటిని నిలబెట్టుకోవడం, సహాయసహకారాలు అందించడమే కీలకం. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య రాజకీయ కోణం అడ్డుపడకూడదు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం, రక్షణ విషయాల్లో కూడా పరిస్థితులను అనుసరించి  ఏ విధంగా సహాయసహకారాలు అందించాలన్నది ఆలోచించాలి. తనవారు పరాయివారు అన్న తేడాలు ఈ విషయాల్లో లేకుండా ఉంటేనే నిజమైన సామరస్యం ఉంటుంది. 

యాంటిబయిటిక్స్ వినియోగం..  3వ స్థానంలో తెలంగాణా

యాంటి బయిటిక్స్ వినియోగంలో జాతీయస్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది. అంతర్జా తీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల యాంటి బయాల్ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటి బయిటిక్స్ కు  స్పం దిం చదని నిపుణులు హెచ్చరిం చారు. ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్లో ప్రచురించింది. దేశంలోనే అత్యధిక యాంటి బయి టిక్స్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా మూడవ స్థానానికి చేరింది. యాంటి బయిటిక్స్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు. యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల మొదటి, రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు. డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటి బాయిటిక్స్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది. అధికంగా యాంటి బయి టిక్స్ వాడడంవల్ల సూపర్బగ్ గా మారి ఇకసాధారణదారణ మందులు సైతం స్పందిం చడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ స్థాయిలో యాంటి బయిటిక్స్ వినియోగించిన మాట వాస్తవం. వివిదరాష్ట్రాలలో యాంటి బయి టిక్స మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని  కొన్నిచోట్ల ఎక్కువ  మరికొన్ని చోట్ల  తక్కువగా విని యోగిం చినట్లు బృందం గుర్తించింది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందంలో యుఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్  ఫౌండే షన్ ఇండియా ఢిల్లికి  చెందిన  షఫీ  ఫుజలుద్దిన్  కోయా.సెంథిల్ గణేష్,శక్తివేల్ సెల్వ రాజ్, వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్ ఉన్నారు. యాంటి బయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని.ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని. 2౩.5 పంజాబ్,రెండవ స్థానం 22.9 తో తెలంగాణా మూడవ స్థానం. 7.2 తో  మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం.బీహార్ 8.1 రాజ స్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదన లో తెలం గాణా అత్యధికంగా వినియోగించిన  పరిశోదనా బృందం వెల్లడించింది. 2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగంలో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ. క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది. భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువే నని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ  లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టు లు,దేశవ్యాప్తంగా 60 శాతం  స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు, 18 వేలు పంపిణీ దారులు 5 లక్షల రీటై లర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.                                                     

అధికార బాషా సంఘం అధ్యక్షుడిగా పి. విజయబాబు

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా  ఆర్టీఐ మాజీ కమిషనర్ ,సీనియర్ జర్నలిస్టు పి.విజయ్ బాబును ఏపీ సర్కార్ నియమించింది.  విజయబాబు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.   జగన్ సర్కారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో రాష్ట్ర ప్రభుత్వం పి. విజయబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుగా పలు పత్రికలలో పని చేసిన విజయబాబు.. ఒక ప్రముఖ పత్రికలో సంపాదకుడిగా పని చేశారు. ఆ తరువాత సమాచార హక్కు చట్టం కమిషనర్ ఉన్నారు. ఇప్పడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

ద్ర‌వ్యోల్బ‌ణం.. ముందున్న‌ది  గుజ‌రాత్ 

గుజరాత్ అన్నివిధాలా  అభివృద్ధి దిశలో ముందడుగు వేస్తోందని  చాలాకాలం నుంచి ప్రచారం బాగానే సాగుతోంది. కేంద్రం నుంచి  దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నాయకులంతా  ఆ రాష్ట్రంలో  పోలుస్తూ ఇతర రాష్ట్రాలు  ఆ  దిశగా పయనించాలని బోధ చేయడం, ప్రాచారం చేయడం పరిపాటి. రాష్ట్రంలో పాడిపం టలు, పరిశ్రమలు ఎంతో  అద్భుత మని అక్కడి పాలనా పరంగా ప్రజలు ఎంతో సంతృప్తి చెందుతు న్నారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి  వ్యతిరేకతా లేదని అంటూంటారు. కానీ ఇతర రాష్ట్రాలను అంతే స్థాయిలోకి తీసుకురావడానికి పరిస్థితులు,రాజకీయ వాతావరణం, కేంద్ర సహకారం ఇన్ని అంశాలు లెక్క లోకి వస్తాయి. అన్నిటినీ రాజకీయ కోణంలోనే చూడడం తప్ప, రాష్ట్రాలకు  కేంద్రం ఎలాంటి ప్రోత్సాహక ప్రకటనలూ చేయడం లేదు.  ద్రవ్యోల్బణం విషయానికొస్తే, గుజరాత్ జాతీయ సగటు కంటే ముందుంది, హిమాచల్ సెప్టెంబరులో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమంగా ఉంది. డేటా గుజరాత్  ద్రవ్యోల్బణం తోటి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ రాష్ట్రం హిమాచల్ కంటే దాదాపు రెట్టింపు; గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల కనిపిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లే రెండు రాష్ట్రాలలో, రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరు 2022 నెలలో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తరువాతి కాలంలో తక్కువగా ఉందని అధికారిక డేటా చూపు తుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం గుజరాత్‌లో వార్షిక సీపీఐ ద్రవ్యోల్బణం 7.95 శాతంగా ఉంది, ఇది జాతీయ సగటు 7.41 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో 4.54 శాతం తక్కువగా ఉంది. వాస్తవానికి, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కంటే ఢిల్లీ మాత్రమే తక్కువ (4.03 శాతం) నమో దైంది. హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 4.24 శాతం, 5.76 శాతంగా ఉంది. గుజరాత్‌లోని గ్రామీణప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.31 శాతంగా ఉండగా, రాష్ట్రం లోని పట్టణ ప్రాంతాల్లో 7.68 శాతంగా నమో దైంది. ఈ ఏడాది చివర్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ నున్నాయి. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ధరల పెరుగు దల గతంలో ఎన్నికల ప్రధాన సమస్యలలో ఒకటి. పోల్ ఫలితాలను ప్రభావితం చేసినందున డేటా ముఖ్యమైనది. ఇదిలా ఉండగా, నవంబర్ 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) అదనపు సమావేశం జరగబోతోంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి మీద ఈ సమావేశంలో చర్చ జరుగు తుంది. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు ఎందుకు అదుపు చేయలేకపోయిందో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సమాధానం చెప్పాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీ ఐ సౌలభ్య స్థాయి (కంఫర్ట్ రేంజ్) 2-6 శాతంగా ఉంది. అయితే... సెప్టెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులోని 7 శాతం నుంచి ఇది పెరిగింది. ఇది ఐదునెలల గరిష్టస్థాయి. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది. 2021 సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా నమోదైంది. అక్కడి నుంచి పెరుగుతూనే వస్తోంది. ఆర్బీ ఐ మానిటరీ పాలసీ కమిటీ  చివరిసారిగా 2022 సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో సమావేశమైంది. ఎంపీసీ సిఫార్సుల ప్రకారం... సెప్టెంబర్ 30న, పాలసీ రెపో రేటును 0.5 శాతం లేదా 50 బేసిస్ పాయిం ట్లు (బీపీఎస్) ఆర్బీ ఐ పెంచింది. ఈ ఏడాది మే నెల నుంచి రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి. మే నుంచి సెప్టెంబర్ వరకు 1.9 శాతం లేదా 190 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయి,  కరోనా ముందున్న స్థాయి. ఆర్బీ ఐ రెపో రేట్లను పెంచడం వల్ల, అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఫలితంగా.. కార్‌, పర్సనల్‌, హోమ్‌ లోన్‌ వంటి అన్ని రకాల రుణాలు ప్రియమై, సామాన్యులపై భారం పెరిగింది.

ఆడియో టేపుల మతలబేంటి?

తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల అంశంలో ఆడియో టేపుల మతలబేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆడియో టేపులు ఈ వ్యవహారంలో కీలక సాక్ష్యం అని ఎవరైనా అంటారు. కానీ తెరాస మాత్రం అలా భావించడం లేదు. వీటి వల్ల న్యాయపరంగా కానీ చట్ట పరంగా కానీ కేసు నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్లు తోస్తోంది. ఎందుకంటే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఏపీసీ కోర్టు రిమాండ్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.  అయితే కోర్టులో మాత్రం ఆ పార్టీ బయటకు రిలీజ్ చేసిన ఆడియో టేపులను బయటపెట్టలేదు.  స్వల్ప వ్యవధిలో రెండు ఆడియో టేపులను విడుదల చేసి ప్రజలలో అయోమయం సృష్టించాలనీ, ఈ కేసులో బీజేపీ అగ్ర నేతల హస్తం ఉందని ప్రజలు భావించేలా చేయాలన్న ప్రయత్నానికే పరిమితమైంది కానీ, ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో చట్టం ముందు బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు. నిజంగా తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ అగ్రనేతల ఇన్ వాల్వ్ మెంట్ ఉండి ఉంటే.. తన వద్ద ఉన్న, లేదా ఉన్నాయని తెరాస చెబుతున్న ఆధారాలను కొర్టులోనే ప్రవేశ పెట్టి ఉండేది. తెరాస కోర్టులో ప్రవేశ పెట్టకుండా విడుదల చేసిన ఆడియోలలో ఒక దాంట్లో రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డి, నందకుమార్ మధ్య పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్లు ఉంది. మరో దాంట్లో  డబ్బుల ప్రస్తావన ఉంది. రోహిత్ వంద అడిగారని నందకుమార్ చెబుతున్నట్లు ఆ ఆడియోలో వినిపించింది. అయితే వీరు  ఎవరితో డీల్ చేశారన్నదానిపై  మాత్రం ఆ వీడియోలో  స్పష్టత లేదు. బీజేపీలోని టాప్ టు వ్యక్తులతో మాట్లాడిస్తామని చెప్పడం అయితే వినిపించింది.  అయితే వీటిని కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదు?  ఇంత మొత్తంలో డబ్బులు దొరికాయని పోలీసులు కూడా ప్రకటించలేదు. దీంతో కేసు నిలబడదని న్యాయశాస్త్రంలో కొద్ది పాటి పరిచయం ఉన్న వారికైనా ఇట్టే అర్ధమైపోతుంది.  న్యాయవర్గాలు కూడా అదే చెబుతున్నాయి.   ఆ రెండు ఆడియోలలోనూ  రెండు వర్గాల మధ్య మాటలు మాత్రమే ఉన్నాయని వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేర వ్యవహారమేదీ లేదని చెబుతున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఈ టేపులను కోర్టులో ప్రవేశ పెట్టలేదని అంటున్నాయి. ఇక   రోహిత్ రెడ్డి సహా ఈ డీల్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచీ ప్రగతి భవన్ లోనే ఉన్నారు.  ఫామ్ హౌస్‌లో కేసు బయటపడిన రోజున   ప్రగతి భవన్‌కు వెళ్లిన వారు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. అంతే కాదు వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి.     శుక్రవారం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఈ వ్యవహారం గురించి బాంబు విస్ఫోటనం లాంటి వివరాలు వెల్లస్తారని తెరాస వర్గాలు చెప్పాయి. కానీ అది జరగలేదు.     శుక్రవారం లేదా శనివారం  ఢిల్లీకి వెళ్లి .. అక్కడే మీడియాతో మాట్లాడతారనీ, బీజేపీకి దిమ్మతిరగక తప్పదనీ తెరాస వర్గాలు లీకులు ఇచ్చాయి. అదీ జరగలేదు. గురువారం నుంచీ కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు. ప్రగతి భవన్ గడప దాటి బయట కాలు పెట్టలేదు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ సైలెన్స్  తెరాస వర్గాలలో గందరగోళం సృష్టిస్తోంది. బ్రహ్మాండం బద్దలైపోయిందన్న సంబరం గంటల పాటు కూడా నిలవలేదు. ఏదో తమ వైపు నుంచే పొరపాటు జరిగిందా అన్న శంక తెరస శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో వారు కూడా నిశబ్దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా మునుగోడులో తెరాస ప్రచారంపై ప్రతికూలంగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏపీకి అప్పులు సునాయాసం! ఇలా అభ్యర్థన.. అలా అనుమతి..!

జగన్ ప్రభుత్వానికి దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేని వెసులుబాటు అప్పుల విషయంలో కేంద్రం ఇస్తోంది. దీని వెనుక జరుగుతున్న రహస్యోద్యమమేమిటో అర్ధం కాక జనమే కాదు పరిశీలకులు సైతం తలలు బాదుకుంటున్నారు. జగన్ సర్కార్ ఇలా కోరడం తరువాయి.. కేంద్రం నుంచి అప్పులకు అలా అనుమతి లభించేస్తోంది. అంతే చిటికెలా జగన్ సర్కార్ ఆర్బీఐలో ఇండెంట్ పెట్టేస్తోంది. ఆర్బీఐ సైతం ఆఘమేఘాల మీద అప్పిచ్చేస్తోంది. ఇప్పటికే అనుమతిని మించి పదివేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసింది. అది చాలదన్నట్లు మరో 1413 కోట్ల అప్పు కావాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. నవంబర్ 1వ తేదీన  బాండ్ల వేలం ద్వారా ఆ సోమ్ములు ఏపీ ఖాతాలో జమ అవుతాయి. ఆ సొమ్మును  ఇప్పటికే జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ఓడీ తీసుకున్నందున   వాటికి జమ చేస్తారని చెబుతున్నారు.   దాదాపు ఇలాంటి ఆర్థిక సమస్యలతో తెలంగాణ సతమతమౌతున్నప్పటికీ.. కేంద్రం ఖరాకండీగా కాదు.. కూడదని తెగేసి చెబుతోంది. ఈ వివక్ష ఎందుకు.. తేడా ఎమిటి అంటే కేంద్రం అడుగులకు జగన్ సర్కార్ మడుగులొత్తుతుంటే.. తెరాస సర్కార్ మాత్రం కేంద్రం తప్పిదాలపై విరుచుకు పడుతోంది. కేంద్రం విషయంలో జగన్ సర్కార్ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే... తెలంగాణ సర్కార్ మాత్రం కేంద్రం ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. ఎదిరిస్తోంది. అదీ తేడా. మరో తమాషా ఏమిటంటే.. ఏపీ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే అప్పులు చేస్తున్నట్లుగా ఉందంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించేస్తారు. అదే సమయంలో మరింత ఉదారంగా అప్పులకు అనుమతి ఇచ్చేస్తారు. విమర్శలు ఎందుకు, ఈ భుజం తట్టడాలెందుకు అన్న ప్రశ్నలకు సమాధానం రాదు.   ఏపీ సర్కార్ కు నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం మరచిపోయిందా అన్న అనుమానాలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పలా మారినా.. ఆ చేసిన అప్పులతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులూ చేపట్టింది. ఆ అభివృద్ధి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం తెలంగాణ సర్కార్ పట్ల కఠినంగానూ, ఏపీ సర్కార్ పట్ల  పరిమితులు లేనంత ఉదారంగానూ వ్యవహరిస్తున్నది. ఏపీ సర్కార్ ఇంత యథేచ్ఛగా అడ్డగోలుగా అప్పులు చేస్తూ కూడా ఒక్క రూపాయి అభివృద్ధి పనులకు కేటాయించిన దాఖలాలు లేవు. చేసిన వేల కోట్ల రూపాయల అప్పులన్నీ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికీ.. ఉద్యోగుల జీత భత్యాలకే సర్దేస్తోంది.   చిన్న చిన్న పనుల కాంట్రాక్టర్లకూ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.  ఇలా వేల కోట్లు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయన్నది బ్రహ్మ రహస్యంలా ఉందని పరిశీలకులు అంటున్నారు.  యాభై వేల కోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, వాటి వివరాలు కావాలని కాగ్ వివరాలు కావాలని కాగ్ అడుగుతోందని ప్రచారం జరుగుతోంది.   నిజంగా ఏపీ అప్పుల తప్పుల లెక్కలు బయటకు తీయాలంటే పెద్ద పనేం కాదు. కానీ కేంద్రం, కాగ్ లకు ఆ పని చేయడానికి గంట కూడా సమయం చిక్కడం లేదు. అదనపు అప్పులకు అనుమతులు ఇవ్వడానికి మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఏపీ   ఆర్థికంగా దివాలా దిశగా పరుగులు తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్షం ఆడిన క్రికెట్ మ్యాచ్ 

వర్షం రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు. కానీ వర్షా కాలంలోనే తెలిసి క్రికెట్ మ్యచ్ లు , ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహించడంలో అర్ధం లేదు. మరి అన్నింటా తెలివిగా ఉంటామనే ఇంగ్లీష్ వారు వర్షాలు బాగా పడే సమయంలోనే ఏకంగా ప్రపంచకప్ నిర్వహించడం మాత్రం ప్రపంచ క్రికెట్ వీరాభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అవును చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అద్భత ప్రదర్శనలను చూడాలన్న ఉత్పాహం నీరుగర్చారనే అనాలి.  వర్షం మామూలు సమయంలో బాగానే అనిపిస్తుంది. తడిసి గెంతులేయాలనే అనిపిస్తుంది. కానీ మంచి క్రికెట్ మ్యాచ్ అందునా భారత్, పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ ల సమయంలో వస్తే మాత్రం క్రికెట్ వీరాభిమానులకు పిచ్చెక్కుతుంది. ఎంతో  ఆశతో చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న మ్యాచ్ లు వర్షం కారణంగా జరగకపోయినా, సగం జరిగి ఆగిపోయినా మ్యాచ్ మజా పోతుంది.  టికెట్ అతికష్టం మీద సంపాదించి తన వీరాభిమాన హీరోల ఆటను ప్రత్యక్షంగా చూడటంలో ఉండే థ్రిల్ వేరబ్బా అంటారు క్రికెట్ పిచ్చాళ్లు. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాక్స్ వెల్ లాంటి సూపర్ హిటర్ల ఆటతీరు  దగ్గరుండి చూడటం, దాన్ని స్నేహితులకు వివరిస్తూ చెప్పడంలో అదో మజా. కానీ వర్షం వస్తే మాత్రం మొత్తం గల్లంతే.. అంతటి ఉత్సాహం వర్షార్పణమే అవుతుంది.    క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లు సిద్ధంగా ఉంటే సరిపోదు. వాతావరణం కూడా అనుకూలించాలి. వర్షం పడినా, ఎండ ఎక్కువైనా సరే మ్యాచ్ ఆడటం కష్టమవుతుంది. ఎండైతే ఎలాగోలా మేనేజ్ చేసి ఆడేయొచ్చు. కానీ వర్షం పడితే మాత్రం ఒక్క బంతి కూడా పడదు. ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ లకు ఇబ్బంది ఎప్పుడూ ఉండేదే. కానీ టీ20 వరల్డ్ కప్ లాంటివి నిర్వహించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా జరుగుతున్న టోర్నీనే చూస్తుంటే ఐసీసీని తిట్టాలి అనిపించేంత కోపం వస్తోంది. ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని మ్యాచులకు ఇలా వర్షం అడ్డంకిగా నిలిచింది. 2020 జనవరి నెలలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టి20 సిరీస్ వర్షం ప్రభావాన్ని తెలియజేసే గొప్ప సందర్భం.  అస్సాం రాజధాని గువహటి లో మ్యాచ్ అనగానే సగటు భారత క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తొచ్చేవి ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లు. అంతలా గువహటిలోని బర్సపార క్రికెట్ స్టేడియం పేరు గాంచింది. అందులో భాగంగా తొలి టి20 గువహటి లోని బర్సపార స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే మ్యాచ్ కు కొన్ని గంటల  ముందు గువహటిలో భారీ వర్షం  కురిసింది. ఇక మ్యాచ్ సమయాని కైతే వర్షం మాత్రం ఆగిపో యింది. వర్షం కురిసే సమయంలో గ్రౌండ్  సిబ్బంది పిచ్ ను సరిగ్గా కప్ప లేదేమో.. లేదా రంధ్రాలున్న  కవర్లతో  పిచ్ భాగాన్ని కప్పారేమో తెలీదు కానీ.. వర్షానికి పిచ్ తడిసి పోయింది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ బాగున్నా.. పిచ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఎవరి ఐడియానో కానీ.. గ్రౌండ్ సిబ్బంది పిచ్  మీదకు ఐరన్ బాక్స్ లను, హెయిర్ డ్రయర్లతో వచ్చేశారు. వాటితో పిచ్ ను ఆరబెట్టే ప్రయత్నం చేశారు. టీ20 ప్రపంచకప్ 2022లో వర్షం హవా కొనసాగుతోంది ఇంగ్లండ్‌లో వాతావరణం అనూహ్యంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే, అయితే అనేక మ్యాచ్‌లు రద్దు కావడం మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేయడంపై ప్రశ్నలను లేవ నెత్తింది.  మొన్న ఒక్క రోజే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షానికి బల య్యాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలి యా- ఇంగ్లండ్ మ్యాచ్‌లు రద్దవ్వడం వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వర్షం వల్ల  దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా గెలిచేస్తుంది అని టైంకి మళ్లీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ ని రద్దు చేశారు. బుధవారం కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంగ్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ టైంలో వర్షం పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. దీని తర్వాత జరగా ల్సిన ఆఫ్ఘానిస్ధాన్-న్యూజిలాండ్ మ్యాచ్ అయితే.. కనీసం టాస్ పడకుండానే రద్దయింది. రెండు జట్లకు చెరో పాయిం ట్ ఇచ్చేశారు. జస్ట్ రోజుల వ్యవధిలోనే మూడు మ్యాచ్ లు వర్షానికి ఎఫెక్ట్ అయితే.. ఇక రాబోయే మ్యాచ్ ల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వర్షకాలంలో వరల్డ్ కప్ ఏంటి.. ఐసీసీకి ఆ మాత్రం తెలివి లేదా అని నెటిజన్స్ ఏకిపారేస్తున్నా రు. అలానే దీన్ని వర్షాల వరల్డ్ కప్ అని విమర్శిస్తున్నారు. మరి ఈసారి వరల్డ్ కప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అను కున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యా న్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈ విధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి. 

తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు..జగన్ కు చిక్కులు తప్పవా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసు తార్కిక ముగింపు దిశగా సాగుతోందా? ఈ కేసు విషయంలో దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారా? ఆ విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం నమ్మిందా? అన్న ప్రశ్నలకు వివేకానంద హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించేందుకు సుప్రీం అంగీకరించడాన్ని బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది. తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాల్సిందేనన్న పట్లు దలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె సాహసోపేతమైన పోరాటమే చేశారు. ఆ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేకానందరడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తే ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ స్వంత మీడియాలో పదే పదే చెప్పించడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసిందంటే  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అంతకంటే దారుణమైన అవమానం వేరొ కటి వుండదు. పాత రోజులలో అయితే అటు ముఖ్యమంత్రి, ఇటు డిజిపి వంటి ఉన్నతా ధికారులు సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడితే  వెంటనే పదవులు వదిలేసే వారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో అటువంటి నైతికతకు చోటు లేని పరిస్థితి ఉంది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడినా జగన్ సర్కార్ లో ఎటువంటి చలనం లేదు. అయితే సుప్రీం ఆదేశాలతో  వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అయితే (ఇప్పటికే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి సుప్రీం అంగీకరించింది. అయితే  నేరస్తులకు ఉచ్చు బిగుసుకున్నట్లే అని పరిశీలకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇదే సమయంలో వివేకా హత్య పై జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు హత్యకు కారణమేమిటో, హత్య చేసిన వారెవరో చెప్పకనే చెప్పేశాయని పరిశీలకులు అంటున్నారు. తన చిన్నాన్నను చంపారని, చంపిన వారెవరో అందరికీ తెలుసని ప్రకటించా రామె. ఆమె నోటి వెంట ఆ మాట వెలువడడం వైఎస్ కుటుంబాన్ని చిక్కులలోకి నెడుతున్నది. ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంపీ సీటు కోసమే తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో... ఇప్పటి దాకా కేసును నీరుగార్చడానికి పోలీసు యంత్రాంగం చేసిన ప్రయత్నాలతో వివేకా హత్య కేసులో నేరస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని, చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. 

బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం

పోలీసుల తీరుకు నిరసనగా బుద్ధా వెంకన్న చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖలో తెలుగుదేశం  చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో  గురువారం(అక్టోబర్ 27) మధ్యాహ్నం నుంచి తన ఇంటి   వద్దే బుద్దా వెంకన్న నిరవధిక దీక్షకు దిగిన సంగతి విదితమే. వెంకన్న దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు బుద్ధా దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరశన దీక్ష కారణంగా బుద్ధా వెంకన్న సుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయని వైద్యులు సూచించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు అర్ధరాత్రి రెండు గంటల  ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో బుద్ధా వెంకన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు బుద్ధా  సుగర్ లెవల్స్ పడిపోయాననీ, వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోనికి దింపి బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసుల చర్యను గర్హిస్తూ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తమ జీపుకు అడ్డు పడిన వారిని పక్కకు లాగేసి బుద్ధాను ఆసుపత్రికి తరలించారు. ఈ  సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కవిత కోసమేనా.. అమిత్ షా వద్దకు మాజీ గవర్నర్ నరసింహన్ ను పంపి కేసీఆర్ భంగపాటు?

నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయింది. ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను బయటపడేయడానికే అన్నది ఇప్పుడు తేటతెల్లమౌతోంది. తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని బయటపడింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసీఆర్ యూపీ వెళ్లారు. కూడా తన కుమార్తె కవిత, మరో సమీప బంధువు, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. సాధారణంగా చావు పరామర్శకు వెళ్లినా, అంత్యక్రియలకు వెళ్లిన.. అక్కడ నుంచి నేరుగా తిరిగి ఇంటికి రావడమన్నది సంప్రదాయం.. అటువంటిది సెంటిమెంట్లపై విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ ములాయం అంత్యక్రియలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు రాకుండా నేరుగా హస్తినకు వెళ్లి అక్కడే పది రోజులు బస చేయడంపై అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అక్కడ పది రోజులు బస చేసిన ఆయన అక్కడ అన్ని రోజులు ఏం చేశారన్నది ఇన్ని రోజులూ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడప్పుడే అక్కడ ఆయన అన్ని రోజులు బస చేసి చేసిందేమిటన్నది బయటకు వస్తున్నది. ఆయన హస్తిన పర్యటన మొత్తం తన బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికే అన్నది తేటతెల్లమైపోయింది. ఈ విషయమై ఆయన ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లి మరీ ప్రయత్నించారనీ, అలాగే బీజేపీ పెద్దలతో భేటీకి కూడా ప్రయత్నించారనీ హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందిన సమాచారం.  అలాగే పలు జాతీయ పార్టీల నాయకులతోనూ టచ్ లోకి వెళ్లి మద్దతు కోరినట్లు చెబుతున్నారు. అయితే ఎవరూ కూడా ఈ విషయంలో కేసీఆర్ కు ఎవరి నుంచీ ఎటువంటి మద్దతూ లభించలేదని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్.. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆయనను హస్తినకు పిలిపించుకుని సహకారం అందించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా అప్పట్లో నరసింహన్ కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించారని అంటుంటారు. అలాగే కేసీఆర్ కూడా నరసింహన్ కు అత్యధిక ప్రాధాన్యత  ఇచ్చే వారని చెబుతారు. ఆ పరచయాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ నరసింహన్ ను తన తరఫున అమిత్ షాను కలిసి కవిత విషయంలో మద్దతు కోరాల్సిందిగా అడిగారని ఢిల్లీ వర్గాల భోగట్టా. మొహమాటానికైనా నరసింహన్ అందుకు అంగీకరించారనీ, కేంద్ర ఇంటెలిజెన్స్   బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన నరసింహన్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అధికారులతో తనకున్న పరిచయాల ద్వారా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలిశారనీ, కేసీఆర్ విషయం ఆయనకు చెప్పారనీ అంటున్నారు. అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ,  ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని నరసింహన్ కేసీఆర్ కు చెప్పడంతో కేసీఆర్ కూడా ఆగ్రహంతో రగిలిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల పర్యవశానమే.. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కారణమైందని పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా బీజేపీని ఇరుకున పెట్టాలనీ, అమిత్ షాకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా గుణ పాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని అంటున్నారు. అయితే ఫామ్ హౌస్ నుంచి చేసిన ఫోన్ అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతోనే ఈ డ్రామా రక్తికట్టలేదని పరిశీలకులు అంటున్నారు. 

కాణిపాకం ఆలయంలో బంగారు విభూది పట్టీ చోరీ.. అర్చకుడే దొంగ!

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి చోరీకి గురైంది. సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో  బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు‌   భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.   నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి‌ భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొంది తరిస్తుంటారు  స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ దాత విరాళంగా అందించారు. ఆ విభూది పట్టీ ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీన కుంభాభిషేకం సందర్భంగా స్వామి వారికి అలంకరించారు. అంతే ఆ రోజు నుంచీ అది కనిపించడం లేదు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ విభూది పట్టీని విరాళంగా ఇచ్చిన దాత తనకు రశీదు ఇవ్వలేదంటూ..అధికారులను సంప్రదించడంతో ఆ బంగారు విభూది పట్టీ కనిపించడం లేదన్న విషయం వెల్లడంది. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం  ప్రారంభించారు. ఇంతలో గత 45 రోజులుగా కనిపించని ఆ ఆభరణం ఆలయ యోగశాలలో ప్రత్యక్షమైంది.  ఈ విభూది పట్టీని వేలూరుకు చెందిన ట్రస్ట్ విరాళంగా అందజేసింది. ఈ ఆభరణం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుంది. సాధారణంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తితో అందించిన విరాళాలకు సంబంధించిన రసీదును ఇస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆలయానికి ముగ్గురు మంత్రులు రావడం, కుంభాభిషేకం కావడంతో అధికారులు హడావుడిలో ఉండి రసీదు ఇవ్వలేదు. విభూది పట్టీని మాత్రం స్వామి వారికి అలంకరించారు. అయితే ఎన్ని రోజులైనా రసీదు రాకపోవడంతో విభూది పట్టీని విరాళంగా ఇచ్చన ట్రస్ట్ దాతలు రసీదు గురించి అధికారులను సంప్రదించారు.  అప్పుడు విభూది పట్టీ మాయమైన సంగతి వెలుగులోనికి వచ్చింది. ఇంతకీ ఆ విభూది పట్టీని కాజేసింది ఆలయ అర్చకుడేనని తేలింది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘటన బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. 

మోడీ, రిషి సునాక్ భేటీ ఖరారు.. ఎక్కడంటే..?

బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ వచ్చే నెలలో బేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ ఖరారైంది. ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాధినేతల భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ వీరి భేటీ ఎక్కడంటే... వచ్చే నెల బాలి వేదికగా జరగనున్న జ20 లీడర్ షిప్ సమ్మిట్ కు ఇరువురూ హాజరు కానున్నారు.  ఈ సమ్మిట్ లో భాగంగా ఇరువురు నేతలూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని,  ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది. కాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ   ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని మోడీ రిషి సునాక్ దృష్టికి తీసుకువెళ్లారు. రిషీ సునాక్ హయాంలో భారత్, బ్రిటన్ ల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.