కేసీఆర్ తాజా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోజనం ఏమిటి? ఫలితమేమిటి?
posted on Oct 25, 2022 @ 11:41AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజాగా మునుగోడు ఉప ఎన్నిక ముందు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారు. ఆయన ఆపరేషన్ కు ఆకర్షితులై పార్టీలోకి వలస వస్తున్న వారంతా కూడా తెరాసను ఏదో కారణంతో వీడి వెళ్లిన వారే కావడం గమనార్హం.
దీంతో ఆయన తాజాగే ప్రారంభించిన ఈ ‘ఆపరేషన్’ ఫలితమేమిటి, తెరాసకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వినవస్తున్నాయి. గతానికి భిన్నంగా కేసీఆర్ స్వయంగా ఫోన్ లు చేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
దీని వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటే.. భవిష్యత్ లో ఏదో ఒక పదవి గ్యారంటీ అన్న ఆశతోనైనా పార్టీలోకి వలస వస్తారన్నది ఆ వ్యూహంగా పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పిలుపునకు స్పందించి తెరాస గూటికి చేరిన వారంతా గతంలో పార్టీలో ప్రాధాన్యత లేదనీ, పదవులు దక్కలేదన్న అలకతో పార్టీ వీడిన వారే కావడం గమనార్హం. దాసోజు శ్రవణ్ కానీ, స్వామిగౌడ్ కానీ ఇదే కోవకు చెందుతారు. అయితే తాజా ఆపరేషన్ ఆకర్ష్ కు స్పందించి తెరాసలోకి వస్తున్న వారిలో ప్రజాదరణ ఉన్న నేతలు కానీ, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉన్న నేతలు కానీ, ఎన్నికలలో నిలబడి ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని గెలిచే నేతలు కానీ ఎవరూ లేరు.
ఎక్కడ ఉన్నా ఒకటే అనే స్థాయి నేతలు మాత్రమే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ వలకు చిక్కు గులాబి గూటికి చేరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో అటువంటి నేతల వల్ల నిజంగా టీఆర్ఎస్ కు లభించే ప్రయోజనం ఏముంటుందని.. పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు తెరాసలోకి వలసలు వస్తున్నాయి.
పార్టీకి ఆదరణ తగ్గలేదు అని చెప్పుకోవడానికి తప్ప ఇటీవల తెరాసలోకి వలస వచ్చిన వారితో పార్టీకి కలిగే ప్రయోజనం పూజ్యమని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులూ అంటున్నాయి. దాసోజు శ్రవణ్ కుమార్, రాపోలు ఆనంద భాస్కర్ వంటి వారు ప్రసంగాలు చేయగలరే తప్ప ప్రజా క్షేత్రంలో గుర్తింపు ఉన్న నాయకులు కాదు. ఆ పాటి ప్రసంగాలు చేయగలిగే నేతలు తెరాసలో చాలా మందే ఉన్నారు. మరి కొత్తగా ఇటువంటి నేతలను పిలిచి మరీ పార్టీ కండువా కప్పడం వెనుక కేసీఆర్ ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని తెరాస శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.