గుడివాడలో నానికి ప్రత్యర్థిగా తెరపైకి కొత్త ముఖం.. చంద్రబాబు వ్యూహం
posted on Oct 25, 2022 @ 3:20PM
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఓ బలమైన నాయకుడినే కాకుండా.. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన వ్యక్తిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆయనను రంగంలోకి దింపి.. గుడివాడలో సేవా కార్యక్రమాలతోపాటు రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఆయన అయితేనే.. కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా చంద్రబాబు తెరపైకి తీసుకు వచ్చిన వ్యక్తికి.. కొడాలి నానికి పెద్దగా పరిచయం లేదని తెలుస్తోంది. కానీ.. కొడాలి నానిపై ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా కొడాలి నానికి బాగా పరిచయస్తులేనన్న సంగతి తెలిసిందే. కానీ ఇక పరిస్థితి ఉండకూడదన్న కృత నిశ్చయంతోనే కొత్త అభ్యర్థినిబరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై మొన్నటి వరకు వంగవీటి రాధాని నిలుపుతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేరు తెరపైకి వచ్చింది. ఉమ అయితేనే కొడాలి నానికి కరెక్ట్ అని కూడా టీడీపీలో ప్రచారం జరిగింది. కానీ దేవినేని ఉమను సైతం కాదని.. తెరపైకి ఓ కొత్త వ్యక్తి పేరును చంద్రబాబు తీసుకు రావడంతో కొడాలి నాని వర్గంలో కొంత అలజడి మొదలైనట్లు తెలుస్తోంది.
అదీకాక.. ఇప్పటికి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి... గెలుస్తూ వచ్చిన కొడాలి నానికి వచ్చే ఎన్నికలు అంత ఈజీ కాదని ఆయన వర్గమే పేర్కొంటోంది. జగన్ తొలి కేబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై బండ బూతులు తిట్టడమే కాదు.. చంద్రబాబు ఫ్యామిలీపై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో కొడాలి నాని తీవ్ర అపప్రదను ముటకట్టుకున్నారు.
దాంతో వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు నల్లేరు మీద నడక కాదనే చర్చ గుడివాడ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. అదీకాక.. ఆయన మంత్రిగా ఉండగా ఆయన వ్యవహార శైలితో.. నియోజకవర్గంలో యువత అంతా కొడాలి నానికి బాగా దూరంగా జరిగింది. మరోవైపు.. రానున్న ఎన్నికల్లో కొడాలి నాని ఓటమే లక్ష్యంగా చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త అభ్యర్థిని చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన అయితేనే కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని చంద్రబాబు తన ఆలోచనలకు పదును పెట్టి.. మరీ ఆ పారిశ్రామికవేత్తను గుడివాడ నుంచి రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.